ETV Bharat / city

'సీఎం కేసీఆర్​ను ఏక్​నాథ్​ శిందే భూతం పట్టుకుంది..'

author img

By

Published : Jul 11, 2022, 7:51 PM IST

Revanth Reddy Comments: సీఎం కేసీఆర్​పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నాలుగు రోజుల్లో కేసీఆర్ మంత్రివర్గాన్ని రద్దు చేసి ముందస్తుకు రావాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్‌ను ఇప్పుడు ఏక్‌నాథ్‌ శిందే బూతం పట్టుకుందని ఎద్దేవా చేశారు.

TPCC Chief Revanth reddy comments on CM KCR
TPCC Chief Revanth reddy comments on CM KCR

Revanth Reddy Comments: తన పేరు ఉచ్ఛరించడానికి కూడా కేసీఆర్ భయపడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. నాలుగు రోజుల్లో మంత్రివర్గాన్ని రద్దు చేసి కేసీఆర్ ముందస్తుకు రావాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తెరాస గ్రాఫ్ పడిపోతుందని.. కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందని ఆ పార్టీ వ్యూహకర్త స్పష్టమైన నివేదిక ఇచ్చినట్టు పేర్కొన్నారు. తెరాస 32 సీట్లు గెలిచేలా ఉందని... మరో 17 సీట్లు పోటాపోటీ ఉందని.. కాంగ్రెస్‌ 32సీట్లు గెలుస్తుందని మరో 23 సీట్లలో గట్టి పోటీ ఇస్తుందని నివేదికలో పేర్కొన్నట్టు వివరించారు.

కేసీఆర్‌ను వదిలించుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని రేవంత్​ తెలిపారు. ఆగస్టు 2న సిరిసిల్ల సభకు భారీ ఎత్తున యువత తరలి రావాలని సూచించారు. వరంగల్‌ డిక్లరేషన్ మాదిరి రాహుల్ గాంధీ నేతృత్వంలో సిరిసిల్ల డిక్లరేషన్ ప్రకటిస్తామని వెల్లడించారు. రాజపక్సే కుటుంబానికి పట్టిన గతే కేసీఆర్‌ కుటుంబానికి పడుతుందని రేవంత్​ జోస్యం చెప్పారు. శ్రీలంక పరిణామాలతో కేసీఆర్ భయపడుతున్నారని ఆరోపించారు. సహారా కుంభకోణంలో కేసీఆర్‌ను భాజపా కాపాడుతుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ అవినీతిపై విచారణకు మోదీ ఆదేశిస్తారని ఆశిద్దామని ఆకాంక్షించారు.

"కేసీఆర్‌ మాటల్లో కొత్తేమీ లేదు.. వింతేమీ లేదు. పై ఆదేశాల ప్రకారమే అలా మాట్లాడారు. కేసీఆర్‌ తన గురించి గొప్పలు చెప్పుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన చేస్తున్న దానికి, చెబుతున్న దానికి ఏమైనా సంబంధం ఉందా? కేసీఆర్‌ చెప్పింది నిజమే.. మోదీ వల్ల ప్రజాస్వామ్యానికే ముప్పు ఉంది. కానీ, మోదీకి గురువు కేసీఆర్‌. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కేసీఆర్‌ లాక్కున్నప్పుడు ఇవన్నీ మర్చిపోయారా? తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏక్‌నాథ్‌ శిందేల ఉత్పత్తి ప్రారంభించింది కేసీఆర్‌ కాదా? ప్రతిపక్ష పార్టీలో గెలిచిన తలసాని శ్రీనివాస్‌ను తెరాసలో చేర్చుకుని మంత్రిని చేసింది కేసీఆర్‌ కాదా? ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి రూపంలో ఏక్‌నాథ్‌ శిందేలను తయారు చేసింది కేసీఆర్‌ కాదా? ఇప్పుడు ఏక్‌నాథ్‌ శిందే భూతం కేసీఆర్‌ను పట్టుకుంది." - రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

'సీఎం కేసీఆర్​ను ఏక్​నాథ్​ శిందే భూతం పట్టుకుంది..'

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.