ETV Bharat / city

'ప్రజలకు న్యాయం జరిగేవరకు కాంగ్రెస్​ పార్టీ ఉద్యమం ఆగదు..'

author img

By

Published : Apr 6, 2022, 3:19 PM IST

TPCC Chief revant reddy Comments in Zoom Meeting
TPCC Chief revant reddy Comments in Zoom Meeting

Revanth Reddy : టీపీసీసీ చీఫ్​ రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జూమ్‌ సమావేశం నిర్వహించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, విద్యుత్​ ఛార్జీలు తగ్గే వరకు, రైతులు పండించిన చివరి గింజ కొనేవరకు కాంగ్రెస్ పార్టీ పోరాటాలు కొనసాగుతాయని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Revanth Reddy : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా.. ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటాలు కొనసాగిస్తుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఇవాళ(ఏప్రిల్​ 6న) ఉదయం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన జూమ్‌ సమావేశంలో కార్యనిర్వహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, గీతారెడ్డి, అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ, ఏఐసీసీ కార్యదర్శులు శ్రీనివాస్ కృష్ణన్, బోసురాజు, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, విద్యుత్​ ఛార్జీలు తగ్గే వరకు, రైతులు పండించిన చివరి గింజ కొనేవరకు కాంగ్రెస్ పార్టీ పోరాటాలు కొనసాగుతాయని రేవంత్‌ రెడ్డి వివరించారు.

"కాంగ్రెస్ పార్టీ తమ పక్షాన పోరాటం చేస్తుందని ప్రజలు విశ్వసించేలా కార్యక్రమాలు ఉండాలి. ప్రధానంగా అయిదు అంశాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తగ్గి.. ఛార్జీలు తగ్గించే వరకు పోరాటాలు జరగాలి. రైతులకు భరోసా వచ్చే వరకు ప్రతి వరిగింజ కొనేవరకు ఉద్యమాలు చేయాలి. కేంద్రం, రాష్ట్రం ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రైతులకు తీవ్ర నష్టం చేసే పరిస్థితులు కలిగిస్తున్నారు. ముడిబియ్యం, ఉప్పుడుబియ్యం అంటూ ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు. రేపు విద్యుత్ సౌద, పౌరసరఫరా కార్యాలయాల ముట్టడి పెద్ద ఎత్తున జరగాలి. తెరాస తమ ఉద్యమాలను అడ్డుకునే కుట్ర చేస్తుంది. ఎక్కడ అడ్డుకుంటే అక్కడే రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయాలి. పోలీస్​స్టేషన్లలో కూడా ఉద్యమం కొనసాగాలి." - రేవంత్​రెడ్డి, పీసీసీ ఆధ్యక్షుడు

భవిష్యత్ కార్యాచరణ మళ్లీ నాయకులతో చర్చించి ప్రకటిస్తామని రేవంత్​రెడ్డి వెల్లడించారు. ఈ నెలాఖరున ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్​లో జరిగే సమావేశానికి రావాలని ప్రతిపాదన పెట్టినట్లు తెలిపారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.