ETV Bharat / city

వీరి వ్యవహారం.. వివాదాస్పదం.. చర్చనీయాంశం!!

author img

By

Published : Jul 18, 2022, 10:28 AM IST

జిల్లాలో పలువురు పోలీస్‌ ఠాణాల అధికారుల పనితీరు వివాదాస్పదమవుతోంది. స్నేహపూర్వక పోలీసింగ్‌ విధానంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుండగా, కొందరు అధికారులు, సిబ్బంది వ్యవహార శైలి కారణంగా తరచూ వార్తల్లోకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు పోలీసు అధికారుల ప్రవర్తన చర్చనీయాంశమవుతుంది.

Police behavior is controversial
Police behavior is controversial

రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో పలువురు పోలీస్‌ ఠాణాల అధికారుల పనితీరు వివాదాస్పదమవుతోంది. స్నేహపూర్వక పోలీసింగ్‌ విధానంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుండగా, కొందరు అధికారులు, సిబ్బంది వ్యవహార శైలి కారణంగా తరచూ వార్తల్లోకి వస్తున్నారు. ప్రధానంగా సివిల్‌ కేసుల్లో తలదూర్చి పెత్తనం చలాయించి జిల్లాలోని పలువురు పోలీసు అధికారులు వివాదాలకు కేంద్ర బిందువులవుతున్నారు. పోలీసుశాఖలో అవినీతి, అక్రమాలపై పలు ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో జిల్లా పోలీసు అధికారి ఎన్‌.కోటిరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇంత జరిగినా పోలీసు అధికారులు, సిబ్బందిలో ఆశించిన మార్పు రావడం లేదు.

* భూ తగాదాల్లో జోక్యం చేసుకుని పోలీస్‌ఠాణాల్లోనే రాజీ కుదిర్చి రూ.లక్షల్లో దండుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు ఇస్తేనే డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐ స్థాయి పోలీసు అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తున్నారని వారు చెప్పిన విధంగానే పరిధి దాటి అక్రమ కేసులు బనాయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

నిధులిస్తున్నా..: పోలీస్‌ఠాణాల నిర్వహణకు ప్రభుత్వం ప్రతి నెలా నిధులు ఇస్తోంది. నేరాల సంఖ్యకు అనుగుణంగా వీటిని విడుదల చేస్తున్నారు. జిల్లాలోని వికారాబాద్‌, తాండూర్‌, పరిగి, కొడంగల్‌, మోమిన్‌పేట పోలీస్‌ఠాణాలకు నెలకు రూ.50 వేలు, మిగతా స్టేషన్లకు రూ.25 వేల చొప్పున నిధులు విడుదల చేస్తున్నారు. సిబ్బంది స్టేషన్‌ ఖర్చుల పేరుతో బాధితుల ముందు చేతులు చాస్తున్నారు. ఏదైనా కేసుల నిమిత్తం బాధితుల ఫిర్యాదుల మేరకు పోలీసులు క్షేత్రస్థాయి విచారణకు వెళ్తే ఎంతో కొంత ముట్టజెప్పాల్సి వస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలువురు రక్షకభట నిలయాధికారులు సైతం డబ్బులను నేరుగా తీసుకోకుండా పెట్రోలు బంకుల్లో ఇవ్వాలని సూచిస్తున్నారు.

కొన్ని ఉదాహరణలు..

* రెండు రోజుల క్రితమే కొడంగల్‌ సీఐ సివిల్‌ కేసుల్లో తలదూర్చడం, వివిధ కేసుల్లో అవినీతికి పాల్పడటం వంటి ఆరోపణలతో సస్పెండ్‌కు గురయ్యారు.

* ఇటీవల యాలాల్‌ ఎస్‌ఐ.. ఇంటి ముందు ఇసుక మామూళ్లకు సంబంధించి ఇరు వర్గాలు ఘర్షణ పడి బండారం బయట పడటంతో ఎస్‌ఐని జిల్లా పోలీసు కార్యాలయానికి అనుసంధానం చేశారు.

* గతంలో జిల్లాలో విధులు నిర్వహించిన ధారూర్‌ ఎస్‌ఐ లాక్‌డౌన్‌ తరుణంలో రోడ్డుపైకి వచ్చిన ద్విచక్ర వాహనదారుల నుంచి రూ.3 వేల చొప్పున వసూలు చేయడం, ఓ కొట్లాట కేసులో రూ.50 వేలు వసూలు చేయడం వంటి ఆరోపణలతో జిల్లా పోలీసు కార్యాలయానికి అనుసంధానం చేశారు.

* కోట్‌పల్లి ఎస్‌ఐ పోలీస్‌ఠాణాకు వచ్చిన ఇరు వర్గాల నుంచి డబ్బులు వసూలు చేయడం, ఆ ఠాణా మీదుగా వెళ్లే ఒక్కో ఇసుక లారీ నుంచి రూ.5 వేలు వసూలు చేయడం వంటి ఆరోపణలతో బదిలీ వేటు పడింది. ఇలాంటి కేసులు తరచూ జిల్లాలో చోటుచేసుకోవడం విస్మయం కలిగిస్తోందని ప్రజలు పేర్కొంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.