ETV Bharat / city

Dharani Portal Issue : భూముల వారసత్వ బదిలీలో గందరగోళం

author img

By

Published : Dec 14, 2021, 7:58 AM IST

Dharani Portal Issue : ధరణి పోర్టల్​లో మరో కీలక సమస్య బయటపడింది. అదే భూముల వారసత్వ బదిలీ ప్రక్రియ. ఈ పోర్టల్​ ద్వారా.. ఆటోమేటిక్​ విధానంలో వారసత్వ బదిలీ పూర్తి చేసి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేస్తున్న తీరుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వారసత్వ బదిలీ హక్కుల విషయంలో గందరగోళం నెలకొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం నూతన విధానాన్ని అమలులోకి తెస్తుందని గతేడాది ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించినా.. రెవెన్యూశాఖ అమల్లోకి తేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Dharani Portal Issue
Dharani Portal Issue

Dharani Portal Issue : ‘నేను కొన్న భూమిని నా కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్‌ చేశాను. అతను ఆకస్మికంగా మరణించాడు. ఆ భూమిని కోడలి పేరుపై వారసత్వ బదిలీ చేశారు. కుటుంబంలో భాగపంపిణీ జరగనేలేదు. నేను ఉండగా ఏకపక్షంగా ఎలా చేస్తారు. నాకు నోటీసైనా ఇవ్వలేదు. ఇది అన్యాయం’ అంటూ ఓ పెద్దావిడ ఉమ్మడి నల్గొండ జిల్లాలో న్యాయ పోరాటానికి దిగారు. ఇలా కుటుంబ సభ్యులందరి ఆమోదం లేకుండానే వారసత్వ బదిలీ చేశారంటూ పలు జిల్లాల్లో జరిగిన లావాదేవీలకు సంబంధించి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి.

Transfer Inherited Property : భూముల వారసత్వ బదిలీ ప్రక్రియలో స్పష్టత లేకపోవడం గందరగోళానికి తావిస్తోంది. ధరణి పోర్టల్‌ ఆధారంగా ఆటోమేటిక్‌ విధానంలో వారసత్వ బదిలీ (సక్సెషన్‌) పూర్తి చేసి రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ చేస్తున్న తీరుపై పలు విమర్శలు వస్తున్నాయి. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా ఆన్‌లైన్‌లో ఉన్న సమాచారం ఆధారంగా ధరణిలో సులువుగా, ఆటోమేటిక్‌ విధానంలో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలు పూర్తిచేస్తున్న తీరు బాగున్నా.. అదే తీరును వారసత్వ బదిలీలో అమలు చేయడంపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

అమలుకాని ముఖ్యమంత్రి ఆదేశాలు

Inherited Property Transfer Issues : వారసత్వ బదిలీ హక్కుల విషయంలో గందరగోళం నెలకొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం నూతన విధానాన్ని అమలులోకి తెస్తుందని గతేడాది ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ప్రభుత్వం జారీ చేసే పాసుపుస్తకాల్లో ముందుగానే కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేస్తారని, తద్వారా వారసత్వ వివాదాలు ఉండవని సూచించారు. సీఎం నిర్ణయంపై హర్షం వ్యక్తమైనప్పటికీ రెవెన్యూశాఖ అమల్లోకి తేలేదు. పోర్టల్‌ అమల్లోకి వచ్చి ఏడాది దాటినా దీనిపై ఒక నిర్ణయం తీసుకోలేదు. దీంతో వారసత్వంపై అభ్యంతరాలు ఉన్నచోట వివాదాలు వస్తూనే ఉన్నాయి. వారసత్వ బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలంటే రెవెన్యూ అధికారులకు క్షేత్రస్థాయి విచారణ అధికారం కల్పించాలని, లేనిపక్షంలో కుటుంబ ధ్రువీకరణ పత్రం(ఫ్యామిలీ సర్టిఫికెట్‌) తప్పనిసరి చేయడమనే నిబంధనను జోడించాలంటూ రెవెన్యూ సంఘం ప్రభుత్వాన్ని కోరుతోంది.

గతంలో ఇలా..

Land Transfer Issues : గతంలో భూయజమాని తదనంతరం వారసత్వ బదిలీకి క్షేత్రస్థాయి విచారణ ఉండేది. యజమాని కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసేవారు. పది రోజుల వ్యవధిలో నోటీసులకు వచ్చిన వివరణ, క్షేత్రస్థాయి అధికారుల విచారణ నివేదిక ఆధారంగా తహసీల్దారు వారసులెవరనేది తేల్చి.. రెవెన్యూ రికార్డుల్లో యాజమాన్య హక్కులు బదలాయించేవారు. గతేడాది నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రెవెన్యూ చట్టం అనంతరం ఈ విచారణ చేపట్టడం లేదు. పైగా స్లాటు నమోదై తహసీల్దారు-సంయుక్త సబ్‌ రిజిస్ట్రారు వద్దకు వస్తే అడ్డుచెప్పకుండానే రిజిస్ట్రేషన్‌ చేయాలని చట్టం సూచిస్తోంది. దీంతో తహసీల్దార్లు వారసత్వ బదిలీని పూర్తి చేసేస్తున్నారు.

ఏడు రోజుల వ్యవధి ఎందుకో?

Dharani Portal Problems : ధరణి పోర్టల్‌లో నిర్వహిస్తున్న వారసత్వ బదిలీ ప్రక్రియపై రెవెన్యూ అధికారుల్లోనూ స్పష్టత కొరవడింది. భూయజమానులు మీసేవలో లాగిన్‌ అయ్యాక.. 7 రోజులకు స్లాట్‌ నమోదు జరుగుతోంది. తరువాత తహసీల్దారు-సంయుక్త సబ్‌ రిజిస్ట్రారు వద్దకు వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు. మిగిలిన సేవలు ఒకట్రెండు రోజుల్లోనే పూర్తవుతున్నాయి. వారసత్వ బదిలీకి సంబంధించి భూయజమాని లాగిన్‌ అయినదీ, స్లాట్‌ నమోదు చేసుకున్నదీ తహసీల్దారు వద్దకు చేరేదాకా వారికి ఏ సమాచారం ఉండటంలేదు. ధరణి పోర్టల్‌ అమలు తర్వాత కూడా మార్గదర్శకాలు విడుదల కాకపోవడంతో.. దీనిలో స్పష్టత కొరవడిందని కొందరు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ధరణి సేవల అమలు మినహా తహసీల్దార్లకు అధికారాలేవీ లేవు. గతేడాది పాత ఆర్‌ఓఆర్‌ చట్టం రద్దు చేశాక క్షేత్రస్థాయి విచారణ అధికారాలన్నీ రద్దయ్యాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.