ETV Bharat / city

tsrtc cargo services : ఆగస్టు నుంచి ప్రతి ఇంటికి కార్గో సేవలు

author img

By

Published : Jun 29, 2022, 10:16 AM IST

tsrtc cargo services : ఆర్టీసీ కార్గో పార్శిల్‌...! ఏ వస్తువైనా... ఎక్కడికైనా పంపించేందుకు సులువైనా మార్గంగా మారింది..! నిన్న మెన్నటివరకు బుకింగ్‌ కౌంటర్ల వరకే సేవలందించినా...ఇప్పుడు డోర్‌ డెలివరీలు చేస్తున్నారు...! హైదరాబాద్‌లో దాదాపు 24 ప్రాంతాల్లో ఇంటింటికి పార్శిళ్లు అందిస్తున్నారు. ఆగస్టు నాటికి రాష్ట్రవ్యాప్తంగా తీసుకువచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అంతేకాదు...24 గంటల్లోనే గమ్యస్థానాలకు చేర్చాలని యోచిస్తున్నారు.

tsrtc cargo services
tsrtc cargo services

ఆగస్టు నుంచి ప్రతి ఇంటికి కార్గో సేవలు

tsrtc cargo services : రాష్ట్ర వ్యాప్తంగా కార్గో సేవలను ఆర్టీసీ విస్తరించబోతుంది. ఇందుకోసం వడివడిగా అడుగులు వేస్తోంది. బుకింగ్ కౌంటర్ నుంచి బుకింగ్ కౌంటర్‌కు మాత్రమే పార్శిళ్లు రవాణా చేసిన ఆర్టీసీ.. ఇప్పుడు డోర్‌ డెలివరీలు చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి ఆరు పిన్ కోడ్‌లలో కొరియర్ సేవలు ప్రారంభించారు. ప్రస్తుతం మొత్తం 24 ప్రాంతాల్లో ఇంటింటికి సేవలను అందిస్తున్నారు.

హైదరాబాద్‌లోని బేగంపేట్, ఎంజీ రోడ్, ప్యారడైజ్‌, సికింద్రాబాద్, హబ్సీగూడ, బోయిన్ పల్లి, అంబర్ పేట్, తిరుమలగిరి, తార్నాక, హిమాయత్ నగర్, ఉప్పల్, సహా మరికొన్ని ప్రాంతాల్లో డోర్ డెలివరీ సేవలు ప్రారంభించారు. మరో 30 నుంచి 35 ప్రాంతాలకు సేవలను విస్తరిస్తామని కార్గో కొరియర్‌ పార్శిల్‌ ఇన్‌ఛార్జ్‌ జీవన్‌ ప్రసాద్‌ తెలిపారు.

ఆర్టీసీపై ప్రజల్లో ఉన్న నమ్మకమే సంస్థకు ఆదాయ వనరుగా మారింది. 2020 జూన్‌ 19న కార్గో సేవలను ప్రారంభించారు. ఇప్పటి వరకు 78లక్షల 55వేల పార్శిళ్లను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చారు. ఆర్టీసీకి 195 కార్గో వాహనాలు ఉన్నాయి. వాటిలో ప్రభుత్వ బల్క్ లోడ్‌లను బుక్ చేయడంపైనా దృష్టిసారించారు. గత నెల నుంచి ఇప్పటివరకు మూడు వేల టన్నుల విజయ ఆయిల్స్ ను సరఫరా చేశారు. 35వేల పైచిలుకు అంగన్ వాడీ కేంద్రాలకు బాలామృతం, మురుకులు చేరవేశారు. ప్రభుత్వం ముద్రించిన పాఠ్య పుస్తకాలను పాఠశాలలకు తీసుకెళ్తున్నారు. ఇంటర్మీడియల్ పాఠ్యపుస్తకాలు రవాణా చేసేందుకు చర్చలు జరుపుతున్నామని అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో 10 వేల 344 గ్రామాలు ఉండగా...అందులో 9 వేల 377 చోట్లకు ఆర్టీసు బస్సులను తిప్పుతోంది. ఆ భరోసాతోనే కార్గో సేవలు ప్రారంభించి 120 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఏడాదికి సగటున 60 కోట్ల వరకు రాబట్టింది. పార్శిళ్ల బట్వాడా ద్వారా 88.68 కోట్లు... కార్గో రవాణా ద్వారా 31.84 కోట్లు సమకూరింది. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రల్లోని నగరాలకూ సేవలు అందిస్తోంది. ఇప్పుడు హైదరాబాద్‌లో ఇంటికే పార్శిళ్లను చేరవేస్తున్న ఆర్టీసీ....ఆగస్ట్ 1 నాటికి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. అన్నీ అనుకూలిస్తే వీలైనంత త్వరగా ఇంటివద్దనే పికప్...డెలివరీ చేసే దిశగా కసరత్తులు చేస్తుంది. మరోవైపు 24 గంటల్లో బుక్ చేసిన వస్తువులను డెలివరీ చేసే దిశగా దృష్టిసారించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.