ETV Bharat / city

పోడు భూముల సమస్యపై మంత్రివర్గ ఉపసంఘం

author img

By

Published : Sep 16, 2021, 4:47 PM IST

Updated : Sep 16, 2021, 5:42 PM IST

Cabinet Sub-Committee on Podu Lands Issue
Cabinet Sub-Committee on Podu Lands Issue

16:46 September 16

పోడు భూముల సమస్యపై మంత్రివర్గ ఉపసంఘం

రాష్ట్రంలో ఎప్పటి నుంచో పెండింగ్​లో ఉన్న పోడు భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం నడుం కట్టింది. ఈ మేరకు పోడు భూముల సమస్యపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ కేబినెట్​ నిర్ణయం తీసుకొంది. ఈ ఉపసంఘానికి ఛైర్‌పర్సన్‌గా మంత్రి సత్యవతి రాఠోడ్​ వ్యవహరిస్తారు. సభ్యులుగా మంత్రులు జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి ఉన్నారు.  

సీఎం హామీ..

అటవీ భూముల సర్వే చేపట్టడంతో పాటు త్వరలోనే పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని గత నెలలో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రకృతిలో భాగమై నివసించే అడవి బిడ్డలు, అత్యంత స్వచ్ఛమైన మనుషులని.. మానవ సమాజంలో ఇంకా తరిగిపోని మమతానురాగాలు, స్వచ్ఛమైన, కల్మషం లేని మానవీయ సంబంధాలకు ఆదివాసీ బిడ్డలు ప్రతీకలని ఈ సందర్భంగా సీఎం ప్రశంసించారు.  

ఎన్నాళ్ల నుంచో సమస్యలు..

హరితహారం సహా ఇతర కార్యక్రమాల్లో భాగంగా పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్లిన ప్రతి సందర్భంలోనూ.. అటవీ, పోలీసు అధికారులతో పోడు భూముల్లో సాగు చేస్తున్న రైతులు తగాదాలకు దిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ పోడు భూముల సమస్యలపై ప్రతిపక్షాలు అనేక సార్లు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాయి.  

ఈనెల 7న.. హైదరాబాద్​ సోమాజిగూడలోని ప్రెస్​క్లబ్​లో పోడు భూముల సమస్యపై ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశంలో.. పోడు భూముల సమస్య పరిష్కారానికి 'పోడు రైతు పోరాట కమిటీ'గా ఏర్పడి పోరాటం చేయాలని నిర్ణయించినట్లు తెజస అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి, కాంగ్రెస్​ ఎమ్మెల్యే సీతక్క వెల్లడించారు. పోడు రైతులకు హక్కులు కల్పించే వరకూ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. పోడు సమస్యలు ఉన్న ప్రాంతాల్లో అక్టోబర్​ 5న పెద్ద ఎత్తున రాస్తారోకో చేపడతామని పేర్కొన్నారు.

తాజా ఘటనలు..

ఈనెల 11న.. నాగర్​కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం మాధవానిపల్లి సమీప అటవీ ప్రాంతంలోని తాటి చెలుక పోడు భూముల్లో మొక్కలు నాటుతున్న అటవీశాఖ అధికారులను పోడు రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అధికారులకు, రైతులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తాటి చెలుక ప్రాంతంలోని పోడు భూములను కొన్నేళ్లుగా.. తమ తాతలు, తండ్రులు సాగు చేస్తున్నారని వారి వారసులు తెలిపారు. ఏళ్ల తరబడి నమ్ముకున్న భూముల్లో మొక్కలు నాటి తమ పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈనెల 12న.. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లిలో పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీశాఖ సిబ్బందిని స్థానిక దళిత రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అటవీశాఖ అధికారులు, స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగి.. తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామంలోని దాదాపు వందకు పైగా దళిత కుటుంబాలు సుమారు 80 ఎకరాల పోడు భూముల్లో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మూడు నెలల క్రితం అటవీ శాఖ అధికారులు ఈ భూముల్లో హరితహారం పనులు చేపట్టేందుకు రాగా.. దళిత రైతులు అడ్డుకున్నారు. దీంతో అధికారులకు, రైతులకు మధ్య వివాదం జరిగింది. రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవడంతో అధికారులు హరితహారం పనులు తాత్కాలికంగా నిలివేస్తున్నామని ప్రకటించారు.


ఇవీచూడండి: 

Last Updated :Sep 16, 2021, 5:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.