ETV Bharat / city

Farmers Problems in Telangana: కొనుగోళ్లలో జాప్యం.. రైతన్నకు అదనపు భారం

author img

By

Published : Nov 21, 2021, 11:59 AM IST

అసలే అకాల వర్షాలు.. ఆపై కొనుగోలు కేంద్రాల్లో (Farmers Problems in Telangana) ఇబ్బందులు.. రైతన్నలను మరింత అవస్థకు గురిచేస్తున్నాయి. ఫలితంగా వేల రూపాయల అదనపు భారం రైతులపై పడుతోంది.

Farmers Problems in Telangana:
Farmers Problems in Telangana:

ధాన్యం కొనుగోలులో జాప్యం, అకాల వర్షం కారణంగా రైతుపై వేల రూపాయల అదనపు భారం పడుతోంది. టార్పాలిన్లు కప్పడం, తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడం, కూలీలు, ట్రాక్టర్ల కిరాయిల కోసం ఒక్కో రైతు రూ.పదివేలకు (Farmers Problems in Telangana) పైగా అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అసలే ధాన్యం దిగుబడి తగ్గి, వర్షానికి తడిసి నష్టపోయే రైతుకు ఇది మరింత భారంగా మారింది. పంట కోసే సమయంలో వర్షం వచ్చి పంట నీటిలో ఉంటే దీనిని కోయడానికి వినియోగించే యంత్రానికీ ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తోంది. ధాన్యం విక్రయానికి కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులుగాస్తున్న ఏ రైతును కదిపినా ధాన్యాన్ని రక్షించుకోవడానికి వేల రూపాయలు అదనంగా ఖర్చవుతున్నాయని, ఈ భారం మరింత కుంగదీస్తోందని వాపోతున్నారు.

కోతకే రెట్టింపు ఖర్చు

కోత కోసే సమయంలో వర్షం వచ్చి నీళ్లు నిలవడంతో సమస్య ప్రారంభమైందని కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం లక్ష్మిదేవపల్లికి చెందిన రైతు శ్రీనివాసరెడ్డి తెలిపారు. ‘ఆరు ఎకరాల్లో వరి సాగు చేస్తే వర్షం, ధాన్యం కోనుగోలులో జాప్యం వల్ల రూ.20 వేలకు పైగా అదనంగా ఖర్చయింది. మామూలుగా కోతకు టైర్లమిషన్‌ వినియోగిస్తాం. దీనికి గంటకు రూ.1600 నుంచి రూ.1800 తీసుకొంటారు. వర్షంవచ్చి నీరు నిల్వ ఉండటంతో చైన్‌ ఉన్న మిషన్‌ వాడాల్సి వచ్చింది. దీనికి గంటకు రూ.3200 తీసుకున్నారు. ఆరుగంటల్లో కోయాల్సింది ఏడుగంటలు పట్టింది. కోత కోయడానికే రెట్టింపు వ్యయం చేయాల్సి వచ్చింది. ఈ ఒక్కదానికే రూ.9800 అదనపు ఖర్చు వచ్చింది. ధాన్యంపైన కప్పడానికి రూ.ఆరువేలు పెట్టి మూడు షీట్లు కొన్నా. ధాన్యం కింద వేయడానికి ఒక్కో షీటు రూ.15 కిరాయితో తేవడంతో పదిరోజులకు రూ.రెండువేల దాకా ఖర్చు వచ్చింది. రోజుకు ఒకటి రెండుసార్లు ఆరబెట్టడం, మళ్లీ కుప్ప పోయడం, తాలు లేకుండా శుభ్రం చేసే పనులకు కూలీలకు ఆరువేల దాకా ఖర్చు వచ్చింది’ అని వాపోయారు.

టార్పాలిన్లకే రూ.12 వేల ఖర్చు

ఐదు ఎకరాల్లో సాగు చేయగా వచ్చిన ధాన్యాన్ని కాపాడుకోవడానికి టార్పాలిన్లకే రూ.12 వేలు ఖర్చయిందని, ఆరబెట్టడానికి, శుభ్రం చేయడానికి కూలీలకు రూ.ఆరువేల దాకా ఖర్చు వచ్చిందని సిరిసిల్ల జిల్లా రుద్రంగికి చెందిన నరసయ్య తెలిపారు. 15 రోజుల్లో ఐదుసార్లు ఆరబెట్టడానికి, శుభ్రం చేయడానికే రూ.4 వేలు ఖర్చు పెట్టాల్సి వచ్చిందని నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం కేశరాజుపల్లికి చెందిన కోటేశ్‌ అనే రైతు తెలిపారు. తేమశాతం సరిగా లేదని రోజూ ఆరబెట్టాల్సి వస్తోందన్నారు. ఎకరా దిగుబడి మీద వచ్చే ఆదాయం అదనపు ఖర్చు కింద పోతోందని మరో రైతు తెలిపారు.

తూకం వేసేదాకా ఖర్చే..!

దిగుబడి తగ్గి, కౌలు పోనూ ఏమీ మిగలదని ఆందోళన చెందుతుంటే, వర్షం నుంచి కాపాడుకోవడానికి అదనపు ఖర్చు భారంగా మారిందని కామారెడ్డి జిల్లా లింగంపేటకు చెందిన కౌలు రైతు జలీల్‌ తెలిపారు. ‘పది ఎకరాలు కౌలుకు సాగు చేశా.ఎకరాకు 25 నుంచి 30 బస్తాలొచ్చేది. ఈ ఏడాది 20 బస్తాలే వచ్చింది. మొదట పది ట్రాక్టర్లు విక్రయ కేంద్రానికి తెచ్చా. వర్షానికి తడవడంతో పొలం దగ్గరే ఆరబెట్టి నిన్న విక్రయ కేంద్రానికి తేగా మళ్లీ వర్షానికి తడిసింది. ఆరుగురు కూలీలతో ఆరబెట్టించా. కింద వేయడానికి 30 షీట్లు కిరాయికి తీసుకున్నా. ఇప్పటికే రూ.నాలుగువేలు ఖర్చయ్యాయి. తూకం వేసి తీసుకునేదాకా అదనపు ఖర్చు వస్తూనే ఉంటుంద’ని జలీల్‌ వాపోయారు.

అదనంగా రూ.15 వేలు...

విక్రయకేంద్రానికి తెచ్చి 20 రోజులైంది, ఇప్పటికి నాలుగుసార్లు వర్షానికి తడిసింది. ఎండబెట్టడం, కుప్పపోయడం, శుభ్రం చేయడానికి, వర్షం నుంచి కాపాడుకోవడానికే రూ.15 వేల దాకా అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిందని కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం పందికుంటకు చెందిన మొగిలిపాలెం రమేష్‌ తెలిపారు. ‘రెండున్నర ఎకరాలు సొంతం, రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తే వంద క్వింటాళ్లు వచ్చింది. మిల్లర్‌ను కేటాయించకపోవడంతో కొనుగోలు ఆగిపోయింది. ధాన్యం కింద వేసే షీట్లకు ఇప్పటివరకు రూ.మూడువేలు వెచ్చించా. టార్పాలిన్‌కు రూ.మూడు వేలయింది. ఎండబెట్టడానికి, శుభ్రం చేయడానికి కూలీలకు మరో రూ.నాలుగువేలు ఖర్చయ్యింది. రోజూ ఊరి నుంచి రెండు, మూడుసార్లు వచ్చిపోతే లీటర్‌ పెట్రోల్‌ ఖర్చు రూ.వందవుతోంది. ఇలా అన్నీ కలిపి రూ.15 వేల దాకా అదనపు ఖర్చు వచ్చింది. ఈ కేంద్రంలో ఇప్పటివరకు 13 మంది రైతులవి మాత్రమే తీసుకెళ్లారు. 140 మందికి చెందిన 70 లారీలకు పైగా ధాన్యం నిల్వ ఉంది’ అని తెలిపారు.

చందాలు వేసుకొని కల్లం

మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం పోతులమడుగు గ్రామంలో రైతులు సొంతంగా రూ.70 వేలకు పైగా ఖర్చుచేసి ఏర్పాటు చేసుకున్న కల్లం ఇది. ఈ ఏడాది వానాకాలంలో గ్రామంలో 300 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో వరిని సాగుచేశారు. దిగుబడి బాగానే వచ్చింది. కానీ కొనుగోళ్లు లేకపోవడంతో గత కొన్ని రోజులుగా ధాన్యాన్ని ఆరబోసుకోడానికి స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఒక్కో రైతు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు వసూలు చేసి.. గ్రామాన్ని ఆనుకుని జాతీయ రహదారి పక్కనే ఉన్న ప్రైవేటు వ్యక్తుల ప్లాట్లను డోజర్‌తో చదును చేయించుకుని కల్లం ఏర్పాటు చేసుకున్నారు. పదిహేను రోజులుగా రైతులు, వారి కుటుంబసభ్యులు ధాన్యాన్ని ఆరబోసుకుంటూ అక్కడే కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.

ఇదీచూడండి: AP flood news today : ఏపీలో వరద కష్టాలకు కారణమిదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.