AP flood news today : ఏపీలో వరద కష్టాలకు కారణమిదే!

author img

By

Published : Nov 21, 2021, 10:46 AM IST

ap floods news

ఏపీలో భారీ వర్షాలు ముంచెత్తాయి. ఫలితంగా నగరాల్లో పలు ప్రాంతాలు (AP Floods News 2021) సెలయేర్లుగా మారాయి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది. చెరువుల్లో భారీగా నిర్మాణాలు చేయడంతో వర్షపు నీరంతా నగరాలను చుట్టేస్తోంది. కడప, తిరుపతి, నెల్లూరు నగరాల వరద కష్టాలకు కారణమిదేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

  • నగరం: కడప

సమస్య: కడప నగరాన్ని అయిదు నెలల వ్యవధిలో రెండుసార్లు (AP rain updates 2021) భారీ వర్షాలు ముంచెత్తాయి. జులైలో కురిసిన వర్షంతో రెండు రోజుల్లో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నా... తాజా వర్షాలతో నగరం సెలయేరుగా మారింది. దాదాపు 3 వేల కుటుంబాలు పునరావాస కేంద్రాల్లో ఉంటున్నాయి.

ఏం చేయాలి?: బుగ్గ జలాశయంలోకి సామర్థ్యానికి మించి చేరిన వరదను కిందికి వదిలినప్పుడల్లా నగరంలోని వివిధ ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. బుగ్గవంక ప్రవాహం ‘పెన్నా’లో కలిసే క్రమంలో కడప నగర పరిధిలో బుగ్గవంకకు రెండువైపులా రెండు కి.మీ. పొడవునా రక్షణ గోడలు నిర్మిస్తే ముంపు తప్పుతుంది. ఇప్పటికే ఆరు కిలోమీటర్లలో రక్షణ గోడలు నిర్మించారు. మిగిలిన పనుల పూర్తికి ప్రభుత్వం రూ.49 కోట్లు కేటాయించింది. వీటికి టెండర్లు పిలవాల్సి ఉంది. నగరంలో రూ.60 కోట్లతో వరదనీటి కాలువల ప్రతిపాదనలూ కార్యరూపం దాల్చలేదు.

  • నగరం: నెల్లూరు

సమస్య: సోమశిల డ్యాం(somasila dam news) గేట్లు ఎత్తినప్పుడల్లా నెల్లూరులోని పెన్నా పరివాహక ప్రాంతాలు ఏడాదిలో రెండుసార్లు ముంపునకు గురవుతున్నాయి. ప్రస్తుతం 12 ప్రాాంతాల ప్రజలు అల్లాడుతున్నారు. నగర పరిధిలో 14 పంట కాలువలను ఆక్రమించడంతో భారీ వర్షాలు కురిసినపుడల్లా మాగుంట లేఅవుట్‌, ఆత్మకూరు బస్టాండ్‌, రామలింగాపురంలో నీరు భారీగా చేరుతోంది.

ఏం చేయాలి?: సమస్య పరిష్కారానికి పెన్నా నది పరివాహక ప్రాంతంలో రక్షణ గోడలు నిర్మించాలి. ఆక్రమణకు గురైన 14 పంట కాలువలను విస్తరించాలి. గత ప్రభుత్వ హయాంలో సర్వే నిర్వహించి ఆక్రమణలు గుర్తించారు. వీటిని తొలగించి బాధితులకు టిడ్కో ఇళ్లు కేటాయించేలా అప్పట్లో ప్రణాళిక రూపొందించినా అమలవలేదు. కాలువల నవీకరణకు 2019లో రూ.60 కోట్లు కేటాయించారు. ఈ పనులూ నత్తనడకన సాగుతున్నాయి.

  • నగరం: తిరుపతి

సమస్య: భారీ వర్షాలతో తిరుపతి నగరం ఈ ఏడాది (heavy rains in ap) రెండుసార్లు జలమయమైంది. ప్రస్తుత వర్షాలకు అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. మల్వాడి గుండం, కపిలతీర్థం నుంచి వచ్చే వర్షపు నీటితో నగరంలోని ముఖ్యమైన ప్రాంతాలు ముంపు బారిన పడటం రివాజుగా మారింది.

ఏం చేయాలి?: వరదనీటి కాలువలను నిర్మించాలి. ప్రస్తుతం డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. 2015 నవంబరులో కురిసిన భారీ వర్షాల తర్వాత నగరంలో డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసేందుకు ప్రయత్నం జరిగినా సాకారం కాలేదు.

చెరువుల ఆక్రమణ..

చెరువుల్లో భారీగా నిర్మాణాలు చేయడంతో వర్షపు నీరంతా నగరాలను చుట్టేస్తోంది. కడప, తిరుపతి, నెల్లూరు నగరాల వరద కష్టాలకు కారణమిదేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నగరాల్లో వరదలపై అధ్యయనం చేసిన పట్టణ ప్రణాళిక విభాగం విశ్రాంత ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ... ఈ 3 నగరాల్లో ఇళ్ల నిర్మాణాలకు 18కిపైగా చెరువులను పూడ్చి వేశారని వెల్లడించారు. ప్రత్యేకించి చెరువుల నగరం (సిటీ ఆఫ్‌ లేక్స్‌)గా పిలిచే తిరుపతి పరిధిలోని అక్కారంపల్లె పెద్ద చెరువు, పూలవానిగుంట, ఉప్పరపాలెం చెరువులు ఆక్రమణకు గురైనట్లు అధికారులు తేల్చారు. అవిలాల చెరువును ఉద్యావనంలా మార్చారు. ఈ చెరువులో నిర్మాణాలపై కోర్టులో కేసు నడుస్తోంది. తిరుపతి గ్రామీణ మండలంలో 1577 ఎకరాలు, రేణిగుంట మండలంలో 3,405 ఎకరాల్లో చెరువులున్నాయి. విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, గుంటూరు, రాజమహేంద్రవరం, కాకినాడలో మరో 25 చెరువులు ఆక్రమణలకు గురైనట్లు గుర్తించారు.

12 నగరాల్లో ప్రతిపాదనల్లోనే వరదనీటి కాలువలు

‘చెెరువుల్లో వెలసిన ఆక్రమణలను తొలగించే అవకాశం లేదు. నగరంలోకి వచ్చే వరద నీరు కిందనున్న నదులు, సముద్రంలోకి నేరుగా వెళ్లేలా విశాలమైన వరదనీటి కాలువలే సరైన పరిష్కారం’ అని ప్రజారోగ్య ఇంజినీరింగ్‌ విభాగం విశ్రాంత ఈఎన్‌సీ ఒకరు అభిప్రాయపడ్డారు. విజయవాడలో రూ.461 కోట్లతో గతంలో ప్రారంభించిన కాలువల పనులు 71% పూర్తయ్యాయి. విశాఖలో 35% ప్రాంతాల్లో వరద నీటి కాలువల వ్యవస్థ అందుబాటులో ఉంది. 12 ప్రధాన నగరాల్లో కాలువల నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో రూ.2,500 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించినా కార్యరూపం దాల్చలేదు.

ఇదీచూడండి: Tirumala news today : తిరుమల కనుమ రహదారులు పునరుద్ధరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.