ETV Bharat / city

Crop Insurance : పంట బీమా అమల్లో ఉన్నా.. అన్నదాతలకు అన్యాయం

author img

By

Published : Jul 26, 2021, 7:52 AM IST

పంట బీమా అమల్లో ఉన్నా.. అన్నదాతలకు అన్యాయం
పంట బీమా అమల్లో ఉన్నా.. అన్నదాతలకు అన్యాయం

రైతు దేశానికి వెన్నెముక అంటూనే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ వెన్నెముక విరుస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట.. ప్రకృతి విలయానికి నాశనమైతే.. కనీసం పరిహారం(crop insurance) అందడం లేదు. కర్షకుల కోసం ఎన్నో బీమా పథకాలు(crop insurance) ప్రారంభించామని.. ప్రభుత్వాలు డప్పు కొట్టుకోవడమే కానీ.. వాటిని అమలు చేసే పరిస్థితి లేదు. అహోరాత్రులు శ్రమించి పండించిన పంట కళ్లముందే నాశనమవుతుంటే.. చూస్తూ ఉండటమే తప్ప ఏమీ చేయలేని రైతు దీనస్థితి.. ఏ ప్రభుత్వానికి పట్టడం లేదు.

వర్షాలతో పంటలు నాశనమై గత కొద్ది రోజులుగా రైతులు నష్టపోతున్నారు. అయినా.. వారికి ఏ పథకం కిందా పరిహారం వచ్చే అవకాశం లేదు. ‘పంటల బీమా(crop insurance)’ అమలులో అన్నదాతలకు జరుగుతున్న అన్యాయమే ఇందుకు ప్రధాన కారణం. కేంద్రం ‘ప్రధానమంత్రి పంటలబీమా యోజన’ (పీఎంఎఫ్‌బీవై), ‘సవరించిన వాతావరణ పంటల బీమా’ (ఆర్‌డబ్ల్యూబీసీఐ) పేరుతో అమలుచేస్తున్న రెండు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయడం లేదు. ‘జాతీయ వ్యవసాయ బీమా సంస్థ’ (ఏఐసీ) రాష్ట్రంలో ‘వర్ష బీమా-2021’ పేరుతో 7 పంటలకు బీమా పథకాన్ని అమలుచేస్తోంది. సొంత నిబంధనలతో అమలుచేయడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీమా ప్రీమియం కింద ఇచ్చే రాయితీలు రైతులకు అందడం లేదు. ఏఐసీ నిర్ణయించిన ధరల ప్రకారం రైతులు మొత్తం ప్రీమియం చెల్లిస్తేనే వారి పంటలకు బీమా వర్తిస్తుంది.

రైతులెలా నష్టపోతున్నారంటే..

ప్రస్తుత వానాకాలంలో తెలంగాణలో ఎకరా విస్తీర్ణంలో సాగైన వరి పంట బీమా(crop insurance) విలువ రూ.28 వేలుగా ఏఐసీ వర్ష బీమా కింద నిర్ణయించింది. దీనిపై మూడు శాతం కింద రూ.840 చొప్పున ప్రీమియం నిర్ణయించింది. ఈ ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ రూ.151.20తో కలిపి మొత్తం రూ.991.20 చొప్పున రైతుల నుంచి ఒక్కో ఎకరానికి వసూలు చేస్తోంది.

కేంద్ర నిబంధల ప్రకారం వరి పంట పీఎంఎఫ్‌బీవై కిందకు వస్తుంది. పంట విలువ ఎంత ఉన్నా దానిలో 2 శాతమే రైతు నుంచి వసూలుచేయాలనేది పీఎంఎఫ్‌బీవై కింద కేంద్రం షరతు పెట్టింది. పంట విలువ రూ.28 వేలలో 2 శాతమే అంటే రూ.560 మాత్రమే రైతు చెల్లించాలి. ఆ నిబంధన ప్రకారమైతే ఈ రూ.560పై 18 శాతం జీఎస్టీ రూ.100.80తో కలిపి రూ.660.80 మాత్రమే రైతు కట్టాలి. కానీ పీఎంఎఫ్‌బీవై అమలును రాష్ట్ర ప్రభుత్వ నిలిపివేయడంతో వర్షబీమా కింద ఎకరానికి రూ.991.20 ఏఐసీ వసూలు చేస్తోంది. దీనివల్ల ఒక్కో ఎకరానికి రైతుపై పడుతున్న అదనపు భారం రూ.330.40. మొత్తం 50 లక్షల ఎకరాల్లో సాగయ్యే వరికి బీమా చేయిస్తే రైతులు అదనంగా చెల్లించే సొమ్ము రూ.165.20 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం పీఎంఎఫ్‌బీవైని అమలుచేస్తే ఈ రూ.165.20 కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం రాయితీగా భరించేవి. రాష్ట్రం ఈ పథకం అమలు ఆపివేసి రూ.82.60 కోట్లు ఇవ్వనందున కేంద్రం నుంచి కూడా అంతే మొత్తం రావడం లేదు. రైతులే సొంతంగా రూ.165.20 కోట్లు చెల్లించాలి.

ఇప్పటికే అధిక వర్షాలతో పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతున్నారు. వర్ష బీమా(crop insurance) పథకం ప్రకారం పత్తికి ఆగస్టు 1 నుంచి, మిరప, మొక్కజొన్న, వరి, సోయా, పసుపు, కంది పంటలకు వచ్చే సెప్టెంబరు 1 తర్వాత పడే వర్షాలకు పంటలు దెబ్బతింటనే పరిహారం ఇస్తామని ఏఐసీ నిబంధన పెట్టింది.

పంట విలువ.. ప్రీమియం రేట్లు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.