ETV Bharat / city

పీసీసీ చీఫ్​ ఎంపికపై వీడని ఉత్కంఠ... సీనియర్లలో ఆందోళన

author img

By

Published : Dec 13, 2020, 6:48 PM IST

అభిప్రాయ సేకరణ ముగిసినా... అధ్యక్షుడి ఎంపికపై ఓ స్పష్టత మాత్రం రాలేదు. శ్రేణుల్లో పెరుగుతున్న ఉత్కంఠ ఓ వైపు... సీనియర్​ నేతల్లో ఆందోళన మరోవైపు... వెరసి కాంగ్రెస్ పార్టీలో వేడి రాజుకుంటోంది. మెజార్టీ అభిప్రాయం కాదు... ఏకాభిప్రాయంతోనే పీసీసీ అధ్యక్షుని ఎంపిక జరగాలని పలువురు నేతలు బహిరంగంగానే తమ అభిప్రాయాన్ని వెల్లగక్కుతున్నారు.

పీసీసీ చీఫ్​ ఎంపికపై వీడని ఉత్కంఠ... సీనియర్లలో ఆందోళన
పీసీసీ చీఫ్​ ఎంపికపై వీడని ఉత్కంఠ... సీనియర్లలో ఆందోళన

రాష్ట్రంలో పీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ కాంగ్రెస్‌ పార్టీలో వేడిని రాజేస్తోంది. నాలుగు రోజుల పాటు అభిప్రాయ సేకరణ జరిగినప్పటికీ.. ఎంపిక న్యాయబద్ధంగా జరిగే అవకాశం లేదని అనుమానిస్తున్న ఆ పార్టీ సీనియర్ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం రోజున సీఎల్పీ కార్యాలయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఎంపీ కోమటరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, పొదెం వీరయ్య, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. పార్టీ ప్రయోజనాలను కాపాడాలని.. ఇందుకోసం సీనియర్లంతా ఒక తాటిపైకి రావాలని నిర్ణయించినట్లు సీనియర్‌ నేత ఒకరు వెల్లడించారు.

రేవంత్​ అయితే పార్టీకి నష్టమే...

పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్లకే పీసీసీ పీఠం కట్టబెట్టాలని తమ అభిప్రాయం తెలిపారు. ఇదే విషయాన్ని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి కలిసి.. మాణిక్కం ఠాగూర్‌కు తెలియజేశారు. పార్టీలోకి వచ్చి రెండేళ్లు కూడా కాకుండానే.. ఎంపీ రేవంత్‌ రెడ్డికి పార్టీ పగ్గాలు కట్టబెడితే కాంగ్రెస్‌ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్న విషయాన్ని ఏఐసీసీకి నివేదించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకోసం సీనియర్లందరి తరఫున ఒక ప్రతినిధి బృందం దిల్లీ వెళ్లాలని కూడా నిశ్చయించుకున్నారు.

దిల్లీలోనే తేల్చుకుంటాం..

రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌లను కలిసి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను వివరించాలని నిర్ణయంతీసుకున్నారు. అపాయింట్‌మెంటు కోరి వెళ్లాలా...? లేదా... వెళ్లిన తరువాత అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నం చేయాలా? అన్న అంశంపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని ఆ నాయకుడు స్పష్టం చేశారు. ఇదే సమయంలో రేవంత్​రెడ్డి అనుకూల వర్గానికి చెందిన సీనియర్‌ నాయకులు కూడా దిల్లీ వెళ్లే యోచనలో ఉన్నట్లు ఆ వర్గానికి చెందిన నాయకుడు ఒకరు తెలిపారు.

ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే పీసీసీ ఎంపిక వ్యవహారం దిల్లీకి చేరినందున అక్కడనే రెండు వర్గాలు మకాం వేసి అధిష్ఠానం పెద్దలను కలిసి తమ తమ వాదనలను వినిపించే అవకాశం కనిపిస్తోంది. మెజార్టీ అభిప్రాయంతో కాదు... ఏకాభిప్రాయంతోనే పీసీసీ అధ్యక్షుడి ఎంపిక జరగాలని కోరనున్నట్లు సీనియర్‌ నేత ఒకరు ఈటీవీ భారత్​కు తెలియజేశారు.

ఇదీ చూడండి: అందరూ ఒప్పుకుంటేనే పీసీసీ ఇవ్వాలి: కాంగ్రెస్​ సీనియర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.