ETV Bharat / city

'కేసుల దర్యాప్తులో అవే కీలకం'.. నివేదికలో సిర్పూర్కర్ కమిషన్ సిఫార్సులు

author img

By

Published : May 20, 2022, 6:51 PM IST

Sirpurkar Commission recommendations
సిర్పూర్కర్ కమిషన్ సిఫార్సులు

Sirpurkar Commission: పోలీసు శాఖలో శాంతి భద్రతల నిర్వహణకు.. దర్యాప్తునకు వేర్వేరు విభాగాలు ఉండాలని జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ సిఫార్సు చేసింది. దర్యాప్తు క్రమంలో అన్ని దశలను వీడియో చిత్రీకరించాలని సూచించింది. మహిళలు, చిన్నారులపై నేరాలు జరిగినప్పుడు పోలీసులు తమ స్టేషన్ పరిధిలోకి రాకపోయినప్పటికీ కేసు నమోదు చేసి వెంటనే దర్యాప్తు ప్రారంభించాలని జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ పేర్కొంది. ఎఫ్ఐఆర్ నుంచి ఛార్జ్​షీట్ వరకు పోలీసులు అనుసరించాల్సిన తీరుపై సిర్పూర్కర్ కమిషన్ పలు సిఫార్సులు చేసింది.

Sirpurkar Commission: దిశ నిందితుల ఎన్​కౌంటర్​పై విచారణ జరిపిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్.. కేసుల దర్యాప్తులో పోలీసులు అనుసరించాల్సిన సాధారణ సిఫార్సులను కూడా చేసింది. అనేక మందిని విచారణ జరిపిన కమిషన్.. ఎఫ్ఐఆర్ నమోదు నుంచి ఛార్జ్​షీట్ వరకు పలు లోపాలను గుర్తించింది. వాటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న కమిషన్ ఈ కేసుకు సంబంధించిన సిఫార్సులతో పాటు సాధారణ సూచనలు కూడా నివేదికలో పేర్కొంది. అవేంటంటే..

  1. మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించిన సమాచారం అందగానే తమ స్టేషన్ పరిధిలోకి రాకపోయినప్పటికీ కేసు నమోదు చేయడంతో పాటు వెంటనే దర్యాప్తు ప్రారంభించాలని కమిషన్ తెలిపింది. తర్వాత సంబంధిత పోలీసు స్టేషన్​కు బదిలీ చేయాలని సూచించింది.
  2. పోలీసు శాఖలో శాంతిభద్రతల నిర్వహణకు, కేసుల దర్యాప్తునకు వేర్వేరు విభాగాలు ఉండాలని కమిషన్ అభిప్రాయపడింది. నిందితులను అరెస్టు చేసేటప్పుడు రాజ్యాంగ, చట్టబద్ధమైన నిబంధనలను కచ్చితంగా అమలుచేయడంతో పాటు వాటన్నింటినీ లిఖిత పూర్వకంగా నమోదు చేయాలని కమిషన్ సూచించింది.
  3. పంచనామా, నేర ఘటన పరిశీలన, అక్కడ ఆయుధాలు లేదా వస్తువుల స్వాధీనం వంటి... దర్యాప్తులోని అన్ని దశలను వీడియో చిత్రీకరించాలని సిర్పూర్కర్ కమిషన్ సిఫార్సు చేసింది. నేర ఘటనకు సంబంధించిన సీసీ కెమెరాల దృశ్యాలను తప్పనిసరిగా సేకరించి భద్రపరచాలని తెలిపింది.
  4. పరిసరాలన్నీ చిత్రీకరించేలా పోలీసుల దుస్తులపై, వాహనాలపై కెమెరాలు అమర్చాలని కమిషన్ సిఫార్సు చేసింది. సాక్షుల విచారణ, వాంగ్మూలాల నమోదు ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డింగు చేయాలని తెలిపింది. నేర ఘటనను పరిశీలన, వస్తువుల స్వాధీనం, విశ్లేషణ, చిత్రీకరణపై పూర్తి బాధ్యతలను క్లూస్ టీం లేదా ఫోరెన్సిక్ బృందాలకు అప్పగించాలని జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ పేర్కొంది. ఫోరెన్సిక్ సాక్ష్యాల సేకరణ, నిర్వహణ, భద్రపరచడంపై ప్రత్యేకంగా విధివిధానాలను రూపొందించాలని కమిషన్ సిఫార్సు చేసింది. దర్యాప్తు అధికారులు కస్టడీ పిటిషన్లు దాఖలు చేసినప్పుడు నిందితులను కూడా పిలిపించి వారి సమక్షంలోనే విచారణ జరపాలని కమిషన్​ సూచించింది.
  5. జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులకు ఇన్​ఛార్జిగా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండరాదని కమిషన్ పేర్కొంది. కస్టోడియల్ మరణాలపై స్థానిక జ్యుడిషీయల్ మెజిస్ట్రేట్లు మాత్రమే విచారణ జరపాలని... ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్లకు ప్రభుత్వం అప్పగించవద్దని తెలిపింది. సమాచారం అందిన వెంటనే స్థానిక మెజిస్ట్రేట్ జిల్లా జడ్జికి సమాచారం ఇచ్చి వెంటనే ఘటనాస్థలికి వెళ్లాలని... పోలీసులు అప్పటివరకు మృతదేహాలను కదిలించవద్దని కమిషన్ పేర్కొంది.
  6. కేసుల దర్యాప్తు పూర్తయ్యే వరకు పోలీసు అధికారులు మీడియా సమావేశాలు నిర్వహించరాదని జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ సూచించింది. కేసు అప్​డేట్లను పోలీస్ స్టేషన్ నుంచి ప్రెస్​నోట్ రూపంలో ఇవ్వొచ్చునని... అయితే దర్యాప్తులో సేకరించిన వివరాలను వెల్లడించవద్దని స్పష్టం చేసింది.

ఇవీ చదవండి: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ బూటకం: సుప్రీంకు సిర్పూర్కర్ కమిషన్​ నివేదిక

నల్ల బంగారం గనుల్లో 'కేజీయఫ్'​ తరహా కుంభకోణం.. వీడియో వైరల్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.