ETV Bharat / city

Police Recruitment: పోస్టులెన్నైనా ఒకేసారి శారీరక సామర్థ్య పరీక్షలు

author img

By

Published : May 22, 2022, 8:10 AM IST

physical tests in police department
పోలీస్​ శాఖలో ఫిజికల్​ టెస్ట్స్​

Police Recruitment: రాష్ట్రంలో పోలీస్​ ఉద్యోగాలకు పోటీపడుతున్న అభ్యర్థులకు నియామక మండలి శుభవార్త చెప్పింది. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఒకేసారి శారీరక దారుఢ్య పరీక్షలకు హాజరైతే సరిపోతుందని వెల్లడించింది. ఈ మేరకు కార్యాచరణ రూపొందించింది. దీంతో సుమారు 5 లక్షల మంది అభ్యర్థులకు ఊరట కలగనుంది.

Police Recruitment: పోలీస్‌ కొలువుల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులకు పోలీస్‌ నియామక మండలి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసినా ఒకేసారి పీఎంటీ, పీఈటీలాంటి శారీరక సామర్థ్య పరీక్షలకు హాజరైతే సరిపోయేలా కార్యాచరణ రూపొందించింది. గతంలో జరిగిన నియామకాల్లో ఎన్ని పోస్టులకు దరఖాస్తు చేస్తే అన్ని మార్లు ఈ పరీక్షలకు హాజరు కావాల్సివచ్చేది. 2018లో తొలిసారిగా మండలి ఒక అభ్యర్థి ఎన్ని పోస్టులకు దరఖాస్తు చేసినా ఒకేసారి శారీరక సామర్థ్య పరీక్షలకు హాజరయ్యేలా చూసింది.

అయితే తాజాగా చేపట్టిన నియామకాల్లో ఈ విధానంలో మార్పు వస్తుందని ప్రచారం జరిగింది. కానీ క్రితం సారి విధానాన్నే కొనసాగించనున్నట్లు మండలి ప్రకటించింది. అభ్యర్థులు ఒకసారి పాల్గొన్న పరుగుపందెం, షాట్‌పుట్‌, లాంగ్‌జంప్‌ లాంటి పోటీలే కాకుండా వారి శారీరక కొలతల ఫలితాల్ని మూడు నెలలపాటు పరిగణనలోకి తీసుకోనున్నట్లు మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు తెలిపారు.

ఒకటికంటే ఎక్కువ పోస్టులకు 40శాతం మంది: మండలి తాజా నోటిఫికేషన్లకు దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. క్రితం సారి దాదాపు 6 లక్షల వరకు రాగా ఈసారి ఇప్పటికే పది లక్షలకుపైగా వచ్చాయి. గడువు మరో అయిదు రోజులు మిగిలి ఉండటానికి తోడు వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం శుక్రవారమే ఉత్తర్వులు జారీ చేయడంతో దరఖాస్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. వయోపరిమితి పెంపుతో లక్ష వరకు దరఖాస్తు చేస్తారని మండలి అంచనా వేస్తోంది. ఈ క్రమంలో క్రితం సారితో పోల్చితే దాదాపు రెట్టింపు దరఖాస్తులు నమోదయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఒకేసారి శారీరక సామర్థ్య పరీక్షల కారణంగా సుమారు 40 శాతం(5లక్షల) మందికి ఊరట కలిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. క్రితం సారి వచ్చిన దరఖాస్తుల తీరుతెన్నుల దృష్ట్యా ఈ అంచనా నెలకొంది.

ఇవీ చదవండి: 'త్వరలోనే దేశంలో ఓ సంచలనం జరగబోతోంది.. అది మీరంతా చూస్తారు..'

'దేశంపై భాజపా కిరోసిన్ చల్లింది.. ఒక్క నిప్పురవ్వ చాలు..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.