ETV Bharat / city

రైల్వేవంతెనకు చిక్కులు.. చివరి దశకు వచ్చాక ఆగిపోయిన పనులు..

author img

By

Published : Feb 25, 2022, 5:44 AM IST

Updated : Feb 25, 2022, 6:31 AM IST

Problems to Railway Over bridge works in kukatpally
Problems to Railway Over bridge works in kukatpally

Railway Over bridge Problems: హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు పై వంతెనలు నిర్మిస్తున్నారు. కొన్నిచోట్ల నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నప్పటికీ మరికొన్ని చోట్ల చిక్కులు తప్పడం లేదు. కూకట్‌ పల్లి నియోజకవర్గ పరిధిలోని అల్లాపూర్-ఖైతలాపూర్ మధ్య నిర్మిస్తున్న రైల్వే పైవంతెన నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చొంది. నలుగురు ఇళ్ల స్థలాల యజమానులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో చివరి దశలో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. దీనివల్ల ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రైల్వేవంతెనకు చిక్కులు.. చివరి దశకు వచ్చాక ఆగిపోయిన పనులు..
Railway Over bridge Problems: విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం హైటెక్ సిటీ, గచ్చిబౌలీ, మియాపూర్, కూకట్ పల్లి, బోరబండ, మూసాపేట్, జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాలకు రాకపోకలు కొనసాగించే వాళ్లు లక్షల్లో ఉంటున్నారు. ప్రజల సౌకర్యార్థం కూకట్ పల్లి నియోజకవర్గంలో పలు రహదారులను తీర్చిదిద్దారు.ఖైతలాపూర్ వద్ద రైల్వే ట్రాక్ ఉండటం వల్ల రాకపోకలు కొనసాగించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలపై వెళ్లే వాళ్లు అయ్యప్ప సొసైటీ, వివేకానంద నగర్, యూసుఫ్ నగర్ మీదుగా ఆరు కిలోమీటర్లు తిరిగి కూకట్ పల్లి వెళ్లాల్సి వస్తోంది. హైటెక్ సిటీ, మాదాపూర్, అయ్యప్ప సొసైటీకి వెళ్లేందుకు కొంత మంది ప్రజలు సాహసంతో రైల్వే ట్రాక్‌ను దాటి వెళ్తున్నారు. దీనివల్ల రైలు ఢీకొని పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.

చిన్నపాటి చిక్కులతో..

ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఏడాదిన్నర క్రితం రైల్వే పై వంతెన నిర్మాణాన్ని ప్రారంభించారు. 90శాతం పనులు ఏడాది వ్యవధిలో ముగిశాయి. కైతలాపూర్ వైపు 10శాతం నిర్మాణం పనులు ఆగిపోయాయి. వంతెన కోసం సేకరించిన భూమిలో తమ ఇళ్ల స్థలాలు ఉన్నాయంటూ నలుగురైదుగురు కలిసి హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం కేసు కోర్టు విచారణలో ఉంది. కళ్ల ముందు పైవంతెన కనిపిస్తున్నా.. చిన్నపాటి చిక్కుల వల్ల పనులు పూర్తికాకపోవడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు.

చొరవ తీసుకున్నా పెండింగ్​..

పలు కాలనీవాసుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రైల్వే పైవంతెన నిర్మాణం చేయాలని సంకల్పించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదించి నిధులు మంజూరు చేయించారు. సుమారు 90 కోట్ల వ్యయంతో ఏడాదిన్నర క్రితం నిర్మాణాన్ని ప్రారంభించారు. రైల్వే అధికారులతో చర్చించి పై వంతెన వేగంగా పూర్తయ్యేలా చొరవ తీసుకున్నారు. వివేకానందనగర్ వైపు వంతెన పూర్తైనప్పటికీ ఖైతలాపూర్ వైపు మాత్రం పెండింగ్‌లో పడటంతో పైవంతెన అందుబాటులోకి రాలేదు.

న్యాయస్థానం ఆదేశాలతో..

స్థల సేకరణ సందర్భంగా జీహెచ్​ఎంసీ ఆధ్వర్యంలో పరిహారం చెల్లించారు. ఖైతలాపూర్ వైపు వంతెన పక్కన ఉన్న స్థల యజమానులు మాత్రం పరిహారం ఎక్కువగా ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం విచారణ దశలో ఉండటంతో పనులు జరగటం లేదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు పరిహారం చెల్లించి వీలైనంత త్వరలో పైవంతెన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకోస్తామని తెలిపారు. స్థల యజమానులు ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని పైవంతెన నిర్మాణానికి సహకరించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చూడండి:

Last Updated :Feb 25, 2022, 6:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.