ETV Bharat / city

మన్యం వీరుడికి జాతీయస్థాయి గుర్తింపు.. మురిసిపోతున్న పశ్చిమగోదావరి

author img

By

Published : Jul 3, 2022, 7:14 AM IST

Alluri Sitaramaraju : మన్యం వీరుడికి జాతీయస్థాయి గుర్తింపు వస్తుండటంతో.. ఆయన చిన్నతనంలో నడయాడిన పశ్చిమగోదావరి మురిసిపోతోంది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ.. రేపు ఏపీలోని భీమవరంలో అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అల్లూరి నడయాడిన నేలగా ఉన్న మోగల్లును పర్యాటక కేంద్రంగా మార్చి.. ఆయన జీవిత విశేషాలను ఇక్కడ పొందుపర్చాలని గ్రామస్థులు కోరుతున్నారు. గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు

మన్యం వీరుడికి జాతీయస్థాయి గుర్తింపు
మన్యం వీరుడికి జాతీయస్థాయి గుర్తింపు

Alluri Sitaramaraju : మన్యం వీరుడు, విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజుకు జాతీయస్థాయి గుర్తింపు వస్తుండటంతో ఆయన చిన్నతనంలో నడయాడిన పశ్చిమగోదావరి మురిసిపోతోంది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ జులై 4న భీమవరంలో అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా భీమవరం సమీపంలోని పెదఅమిరంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. విశాఖ జిల్లా పాండ్రంగిలో 1897 జులై 4న సీతారామరాజు జన్మించారు. చిన్నతనంలో ఆయన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పరిసర ప్రాంతాల్లో విద్యాభ్యాసం చేశారు. భీమవరం సమీపాన కొవ్వాడ, వెంప గ్రామాలతో పాటు పాలకోడేరు మండలం మోగల్లు, నరసాపురాల్లో కొంతకాలం ఉన్నారు. భీమవరం మండలం కొవ్వాడలో పినతల్లి అప్పల వెంకటనరసమ్మ వద్ద ఉండి ఏడాదిపాటు పట్టణంలోని లూథరన్‌ పాఠశాలలో చదివారని ఇక్కడి పెద్దలు చెబుతుంటారు.

ఈ గ్రామ ప్రధాన కూడలిలో ఉన్న లక్ష్మీనారాయణస్వామి ఆలయం సమీపాన వాళ్ల ఇల్లు ఉండేది. అప్పట్లో చాలా దూరం అయినా, కాలి నడకనే పాఠశాలకు వెళ్లేవారని, తర్వాత రాజమహేంద్రవరంలో విద్యను కొనసాగించారని.. ఆంగ్ల విద్య అంటే బానిస విద్యగా రామరాజు భావించేవారని చరిత్రకారులు చెబుతున్నారు. మోగల్లులో ఉండగా సూరి సుబ్బయ్యశాస్త్రి దగ్గర రఘువంశం, కుమార సంభవం, మేఘసందేశం కావ్యాలను అభ్యసించారు. సీతారామరాజు చిన్నాన్న సూర్యనారాయణరాజు నరసాపురంలో రెవెన్యూ శాఖలో పనిచేసేవారు. రామరాజు ఆయన వద్ద ఉంటూ నరసాపురం టేలర్‌ ఉన్నత పాఠశాలలో థర్డ్‌ఫాం (ఎనిమిదో తరగతి) చదివారు. అనంతరం చిన్నాన్నకు రంపచోడవరం బదిలీ కావడంతో ఆయనతోపాటు అక్కడికి వెళ్లిపోయారు. తర్వాతి నుంచి ఆ ప్రాంతంలోనే సీతారామరాజు కార్యకలాపాలు కొనసాగాయి.

...

మోగల్లు వాసుల సంబరాలు
అల్లూరి సీతారామరాజు 124వ జయంతిని జులై 4న ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా ఆయన విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భీమవరం సమీపంలో అల్లూరి కుటుంబ సభ్యులు నివసించిన మోగల్లు వాసులు సంబరాలు చేసుకుంటున్నారు. తమ గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంతోపాటు ఆయన జీవిత విశేషాలను తెలియజెప్పే స్మారక నిర్మాణాలు చేపట్టాలని కోరుతున్నారు.

...

స్వగ్రామంలో జ్ఞానమందిరం
మోగల్లులో సీతారామరాజు కుటుంబం నివసించిన ప్రాంతంలో అల్లూరి పేరిట జ్ఞాన మందిరం నిర్మాణాన్ని ఇటీవల చేపట్టారు. దీన్ని 100 రోజుల్లో పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని అల్లూరి సీతారామరాజు స్మారక సంస్థ అధ్యక్షుడు దండు శ్రీనివాసరాజు తెలిపారు. పార్టీలకు అతీతంగా అల్లూరి స్మారక నిర్మాణాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

మ్యూజియం ఏర్పాటు చేయాలి

'అల్లూరి సీతారామరాజు కుటుంబం నివసించిన ప్రాంతంలో నేను 8 ఏళ్లుగా సేవ చేస్తున్నా. ఈ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతా. ఈ స్థలం చుట్టూ కంచె ఏర్పాటుచేసి మొక్కలు పెంపకం చేపట్టా. ఇక్కడ మ్యూజియం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నా.' - కొత్తపల్లి సీతారామరాజు, మోగల్లు

అదే ప్రజల ఆకాంక్ష

'మోగల్లులో అల్లూరి పేరిట నిర్మాణాలు చేపడతామని నాయకులు చెప్పడమే తప్ప ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంతోపాటు అల్లూరి ఘనతను చాటే నిర్మాణాలు చేపట్టాలన్నదే మోగల్లు ప్రజల ఆకాంక్ష' - కె.భీమరాజు, మోగల్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.