ETV Bharat / city

హైదరాబాద్​లో రోడ్డు దాటాలంటే.. దడదడ

author img

By

Published : Jun 18, 2021, 11:29 AM IST

నిరంతరం రద్దీగా ఉండే రాష్ట్ర రాజధాని రహదారులు దాటాలంటే పాదచారులు శ్రమపడాల్సిందే. వేగంగా దూసుకొచ్చే వాహనాలతో.. ముందుకెళ్లాలన్నా.. వెనక్కెళ్లాలన్న కాస్త తటపటాయించాల్సిందే. నిత్యం వాహనాలతో కిటకిటలాడే రోడ్లు దాటడానికి పాదచారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Pedestrian problems in Hyderabad, pedestrian problems, Hyderabad roads
హైదరాబాద్​లో పాదచారుల ఇబ్బందులు, పాదచారుల ఇబ్బందులు, హైదరాబాద్ రహదారులు

హైదరాబాద్​ నగరంలో రోడ్లు దాటాలంటే పద్మవ్యూహం నుంచి బయటపడినంత శ్రమ పడాల్సిందే. వేగంగా దూసుకొచ్చే వాహనాలు, సరిగా పనిచేయని సూచికలతో రోడ్లు దాటేందుకు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్‌ పరిధిలో పాదచారుల భద్రతను పరిగణనలోకి తీసుకుని హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధుల్లో వందచోట్ల పెలికాన్‌ సిగ్నళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఏడాది గడిచినా ఒకటి, రెండు చోట్ల మినహా ఎక్కడా వీటిని అమర్చలేదు. మెహిదీపట్నం వద్ద ఉన్న పెలికాన్‌ సిగ్నల్‌ తరచూ సాంకేతిక లోపాలతో మొరాయిస్తోంది.

దాటాలంటే దడ దడ

మెట్రోనగరాలు దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరులో పాదచారుల సంఖ్యకు అనుగుణంగా ఫుట్‌పాత్‌లు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దిల్లీలో నమోదవుతున్న రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందుతున్న వారిలో 69శాతం పాదచారులే. మెట్రోనగరాల్లో పాదచారులు దాటేందుకు వీలుగా కొన్ని చోట్ల పెలికాన్‌ సిగ్నళ్లను ఏర్పాటు చేశారు. వాటికి అదనంగా మరికొన్ని ఏర్పాటు చేయాలని, వీటితో పాటు నాగపూర్‌, పుణె, లఖ్‌నవూ, జైపూర్‌, మధురై, విజయవాడ, విశాఖపట్నం, మైసూరు వంటి నగరాల్లో పాదచారులు దాటేందుకు పెలికాన్‌ సిగ్నళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ట్రాఫిక్‌, పురపాలకశాఖ అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. అవి ప్రణాళికల దశలను దాటలేదు. దిల్లీలో 47 పెలికాన్‌ సిగ్నళ్లలో కేవలం నాలుగు మాత్రమే పనిచేస్తున్నాయి. దీంతో వేర్వేరు పనుల నిమిత్తం మెట్రోనగరాలకు వస్తున్న పాదచారులు రోడ్లు దాటేందుకు భయపడుతున్నారు. హైదరాబాద్‌లో రోజూ సగటున 8లక్షల మంది పాదచారులు రోడ్లు దాటుతున్నారు. వీరికి కూడళ్ల వద్ద మాత్రమే దాటేందుకు అనువైన పరిస్థితులున్నాయి. పాఠశాలలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులున్న చోట్ల విద్యార్థులు రోగులు, వారి బంధువులు రోడ్డు దాటాలంటే దడే. రాత్రివేళల్లో చాలామంది రోడ్డు దాటుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు.

కాగితాలకే పరిమితం..

రద్దీ రహదారులు.. పాదచారులకు అవసరమైన ప్రాంతాలను ట్రాఫిక్‌ పోలీసులు ఎంపిక చేశారు. అక్కడ పెలికాన్‌ సిగ్నళ్లను ఏర్పాటు చేయాలనుకున్నారు. మర్చిపోయారు. వీటిని త్వరలో ప్రారంభిస్తామంటూ తెలిపేందుకు హడావుడిగా రోడ్డుకు అటూఇటూ తెలుపు, ఎరుపు రంగులతో కూడిన గీతలను గీశారు. పాదచారులు దాటేప్పుడు ప్రమాదాలు జరక్కుండా వాహనదారులకు పెలికాన్‌ సిగ్నల్‌ కనిపించేలా చర్యలు తీసుకోవాలనుకున్నారు. ఇవి కాగితాలకే పరిమితమయ్యాయి. దీంతో సికింద్రాబాద్‌, ఆబిడ్స్‌, అమీర్‌పేట, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, కూకట్‌పల్లి, మియాపూర్‌, హైటెక్‌సిటీ, షేక్‌పేట, అంబర్‌పేట, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ ప్రాంతాల్లో తరచూ జరుగుతున్న ప్రమాదాల్లో పాదచారులు తీవ్రంగా గాయపడుతున్నారు. కొందరు మరణిస్తున్నారు.

ప్రమాదాలు.. పాదచారుల మరణాలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.