ETV Bharat / city

Pawan kalyan comments: 'గంజాయి మొక్కను ఏపీ చిహ్నంగా వైకాపా ప్రభుత్వం మార్చేసింది'

author img

By

Published : Nov 3, 2021, 8:48 AM IST

ఆంధ్రప్రదేశ్​ విశాఖలో జనసేన అధినేత పవన్ మూడో రోజు పర్యటన సందర్భంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కార్యకర్తలతో సమావేశమయ్యారు. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంటే...ఏపీ మాత్రం గంజాయి అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందని పవన్ మండిపడ్డారు.

Pawan kalyan comments, janasena party news
జనసేన పార్టీ, పవన్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్​లో వైకాపా ప్రభుత్వం ప్రకటించిన మూడు రాజధానుల విధానం ఒక మిథ్య అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించి కనీసం దామోదరం సంజీవయ్య ఇంటిని స్మారక కేంద్రంగానైనా మార్చలేకపోయారని దుయ్యబట్టారు. ‘ఏపీ-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి సాగు అధికంగా ఉంది. కొన్నేళ్లుగా ఇది జరుగుతున్నా వైకాపా హయాంలోనే రెట్టింపు అయింది. అది ఎంతకు పెరిగిందనేది పోలీసులే చెప్పాలి’ అని పేర్కొన్నారు.‘గంజాయి మొక్కను ఆంధ్రప్రదేశ్ చిహ్నంగా వైకాపా ప్రభుత్వం మార్చేసింది. ఏకంగా గంజాయి కలిపిన సారాను అమ్ముతున్నారు. ఏపీలో విక్రయిస్తున్న మద్యం నాణ్యతపై అనుమానాలున్నాయి’ అని పవన్‌ కల్యాన్‌ ఆరోపించారు. ‘విశాఖలో ప్రభుత్వ ఆస్తులను తనఖా పెడుతున్నారు. ఎక్కడ చూసినా ఈ నాయకులకు భూమి పిచ్చే కనిపిస్తోంది. ముంబయి నుంచి గోవా వెళ్తున్న క్రూయిజ్‌ నౌకలో తక్కువ మోతాదులో ఓ వ్యక్తి నుంచి మత్తు పదార్థాలు లభ్యమైతే కొన్ని ఆధారాలతో అనుమానించి షారుక్‌ఖాన్‌ కుమారుణ్ని కొద్ది రోజులు జైల్లో పెట్టారు. అటువంటిది ఒక పంట కాలంలో దాదాపు నాలుగు వేల టన్నుల గంజాయి బయటకు వెళ్తుంటే ఎంతమంది నాయకులను, ఎన్ని రోజులు జైల్లో పెట్టాలి’ అని పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. విశాఖలో మంగళవారం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల జనసేన కార్యకర్తలతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. జన సైనికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొందరు ఆయన దృష్టికి తీసుకువెళ్లగా.. 2024 నుంచి వచ్చే అయిదు సార్వత్రిక ఎన్నికల్లో తమతో పోరాడడానికి సిద్ధమైతేనే బెదిరించండని హెచ్చరించారు.

ఏపీ ప్రభుత్వంపై పవన్ కామెంట్స్

అన్ని రాష్ట్రాలు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయి. ఏపీ మాత్రం గంజాయి అభివృద్ధి వైపు అడుగులు. ఏవోబీలో గంజాయి సాగు ఇప్పుడు బాగా పెరిగింది. మద్య నిషేధం అంటే వైకాపా వాళ్లే అమ్ముతారని అర్థం. జగనన్న ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేశారు. ఇళ్ల లబ్ధిదారులకు కొండలు, శ్మశానాలు చూపించారు.- -పవన్‌ కల్యాణ్‌, జనసేన అధినేత

పిల్లలకు పాలు తాగించినట్లు:

చంటి పిల్లలకు పాలు తాగించినట్లు ఏపీలో మద్యం తాగిస్తున్నారని పవన్‌ మండిపడ్డారు. ‘మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన వైకాపా ప్రభుత్వం బూమ్‌బూమ్‌ బీరు తాగుతావా? ప్రెసిడెంట్‌ మెడల్‌ తాగుతావా అని అమ్ముతోంది’ అని ఆక్షేపించారు. ‘ఎయిడెడ్‌ పాఠశాలలను స్వాధీనం చేసుకోవాలని వైకాపా ప్రభుత్వం చూస్తోంది. నెల్లూరులో నేను ఇంటర్‌ చదివిన కళాశాలపైనా దృష్టిపెట్టారు. ప్రతి విద్యార్థికి మేనమామగా ఉంటానని ఎన్నికల్లో చెప్పారు. ఇప్పుడు ఆ పిల్లలు చదువుతున్న ఎయిడెడ్‌ పాఠశాలలను అమ్మేయాలని చూస్తున్నారు. అటువంటి వ్యక్తి మళ్లీ అధికారంలోకి వస్తే మీ ఇళ్లు కూడా తీసుకుంటారు’ అని ఆరోపించారు.

దివ్యాంగులతో మాట్లాడుతున్న పవన్‌ కల్యాణ్‌

అన్నీ సజ్జలే మాట్లాడతారు:

‘ఏపీలో వైకాపా మంత్రులు, ఎంపీల పేర్లు ఎవరికీ గుర్తుండవు. ఫలానా మంత్రి ఎవరంటే చాలాసేపు ఆలోచించాలి. ఎంపీల గురించి అడిగితే రఘురామకృష్ణరాజు తప్ప ఇంకెవరూ తెలియరు’ అని పవన్‌ ఆక్షేపించారు. ‘ ఏ శాఖ గురించి స్పందించాలన్నా వైకాపా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డే మాట్లాడతారు. బలమైన సామాజికవర్గానికి చెందిన బొత్స సత్యనారాయణ గతంలో పీసీసీ అధ్యక్షుడిగా, ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కోల్పోయిన వ్యక్తి ..ఆయన పరిస్థితి వైకాపాలో చాలా దయనీయంగా మారింది. కనీసం హోంమంత్రి, పరిశ్రమలు, ఆర్థికశాఖనైనా ఇవ్వలేదు. ఇప్పుడు పురపాలకశాఖ చూస్తున్నా సహాయ మంత్రిలా కొనసాగుతున్నారు. ఆయన ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని పవన్‌ అన్నారు. పలువురు వికలాంగుల బాధలు తెలుసుకున్నారు. ఉత్తరాంధ్రను సొంత జిల్లాగా చూసుకుంటానని హామీ ఇచ్చిన ఏపీ ముఖ్యమంత్రి ఎక్కడా కనిపించరని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. ఓ ప్రమాదంలో మృతిచెందిన క్రియాశీల కార్యకర్త ప్రశాంత్‌ కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చెక్కు అందజేశారు.

ఇదీ చదవండి: private bus accident today: ప్రైవేటు బస్సు బోల్తా.. 17 మందికి తీవ్రగాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.