ETV Bharat / city

ఆర్థిక ఇబ్బందులతో కుమార్తెను అమ్మకానికి పెట్టిన అమ్మ..!

author img

By

Published : Sep 5, 2020, 6:00 PM IST

ఆర్థిక ఇబ్బందులతో ఎవరూ చేయరాని పని చేసింది ఓ తల్లి. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో ఆర్థిక ఇబ్బందులు తాళలేక..తన కుమార్తెను అమ్మకానికి పెట్టింది. చిన్నతనంలో ఆమెకు తల్లితండ్రులు చనిపోయారు. కొద్దిరోజు తర్వాత ఆశ్రయం ఇచ్చిన అక్కా, బావ కూడా మరణించడంతో వారి కొడుకు భారాన్ని భుజానికెత్తుకుంది. తనను పెళ్లిచేసుకున్న భర్త..కూతురు పుట్టగానే వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమెకు దూరమయ్యాడు. అత్తగారు ఇంట్లోకి రావద్దన్నారు. తనలాంటి కష్టం తన బిడ్డకు రాకూడదని..పాపను అమ్మకానికి పెట్టిన ఓ తల్లి దీనగాథ!

Mother sold her daughter in west godavari district in Andhra Pradesh
ఆర్థిక ఇబ్బందులతో కుమార్తెను అమ్మకానికి పెట్టిన అమ్మ..!

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో పొట్టకూటి కోసం ఓ తల్లి తన శిశువును అమ్మకానికి పెట్టింది. ఓ స్వచ్ఛంద సంస్థ దీన్ని అడ్డుకొని... పాపను శిశు గృహానికి తరలించింది. గుంటూరు జిల్లా పెదకూరపాడుకు చెందిన శిరీష తల్లిదండ్రులు చనిపోయాక... అక్కాబావ దగ్గర ఉండేది. వారూ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. వారి కుమారుడు తేజ్ సాయి పోషణ ఈమెపై పడింది. గ్రామంలో ఉపాధి లేక... మూడేళ్ల క్రితం ఏలూరు చేరుకుంది.

ఏలూరులో చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్న ఆమెకు బుద్దాని రవి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. శిరీషతో పాటు తేజ్​ని జాగ్రత్తగా చూసుకుంటానని నమ్మబలికి వివాహం చేసుకున్నాడు. తర్వాత వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని శిరీషను వేధించసాగాడు. ఇంతలో గర్భందాల్చిన శిరీష ఆడపిల్లకు జన్మనిచ్చింది. భర్త వేధింపులు తట్టుకోలేని ఆమె.. పోలీసులను ఆశ్రయించింది.

ఆడపిల్ల పుట్టడం, శిరీష తనపై కేసు పెట్టడాన్ని భరించలేని ఆమె భర్త రవి వేరే మహిళతో వెళ్లిపోయాడు. రవి వెళ్లిన పోయిన వెంటనే అతని తల్లి.. శిరీషను ఇంటి నుంచి గెంటేసింది. దిక్కుతోచని స్థితిలో శిరీష రోడ్డున పడింది. పనుల్లేక రోజుల తరబడి ముగ్గురూ పస్తులున్నారు. చంటి బిడ్డకు పాలు చాలక గుక్కపెట్టి ఏడ్చేది.

చేతిలో బిడ్డను ఎవరికైనా విక్రయిస్తే పసిపాప సురక్షితంగా ఉంటుందని భావించింది. ఆ వచ్చిన డబ్బుతో అక్క బిడ్డకు, తనకు కొన్ని రోజులు తిండి గింజలు దొరుకుతాయని ఆలోచించింది.

దెందులూరులో తెలిసిన వారికి తన దీనస్థితి వివరించి... ఎవరైనా పిల్లలను కొనేవారు ఉంటే చెప్పాలని వేడుకుంది. ఆమె దుస్థితి తెలిసినా... బిడ్డలను అమ్మడం తప్పని భావించిన ఆమె పరిచయస్థులు... సేవ్ మిషన్ వారికి సమాచారం అందించారు. ఆ సంస్థ అధ్యక్షుడు మేడిది నికోలా సంఘటన స్థలానికి చేరుకొని ఆమెకు ధైర్యం చెప్పారు. బిడ్డ భవిష్యత్తుకై 2 నెలల పాపను శిశు గృహానికి చేర్చారు. స్థానిక అంగన్వాడీ కార్యకర్తలు, పోలీసులు శిరీష నుంచి వివరాలు తెలుసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.