ETV Bharat / city

KTR Latest News: 'దేశ జీడీపీకి 5 శాతం ఇస్తున్న తెలంగాణకు కేంద్రం ఏమిస్తోంది..?'

author img

By

Published : Nov 16, 2021, 4:37 AM IST

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ నిర్వహించిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక శాఖ మంత్రుల వీడియో కాన్ఫరెన్స్​లో ప్రగతి భవన్ నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుతో కలిసి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ వాదనను కేంద్రానికి మంత్రి బలంగా వినిపించారు.

minister ktr and harish rao participated in nirmala seetharaman meeting
minister ktr and harish rao participated in nirmala seetharaman meeting

రాష్ట్రాల బలమే దేశ బలమని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. దేశంలోని రాష్ట్రాలు ఆర్థిక ప్రగతిలో అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా కేంద్రం సహకరించాలన్నారు. దేశ జీడిపీకి దోహదపడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో నిలవడం దేశం గర్వించదగ్గ విషయమన్నారు. సామర్థ్యం ఉన్న తెలంగాణ వంటి రాష్ట్రాలను కేంద్రం ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సహకరిస్తే దేశాభివృద్ధి మరింత వేగవంతమౌతుందన్నారు.

దేశ జీడీపీకి 5శాతం..

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ నిర్వహించిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక శాఖ మంత్రుల వీడియో కాన్ఫరెన్స్​లో ప్రగతిభవన్ నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుతో కలిసి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ వాదనను కేంద్రానికి మంత్రి బలంగా వినిపించారు. దేశంలో తెలంగాణ.. ఏడేళ్ల కింద ఏర్పడ్డ అతి పిన్న వయసున్న రాష్ట్రమని తెలిపారు. ఇటీవల ఆర్బీఐ ప్రచురించిన నివేదిక ప్రకారం.. దేశ జనాభాలో 2.5శాతం ఉన్న తెలంగాణ దేశ జీడీపీకి 5 శాతాన్ని అందిస్తున్నదన్నారు.

పేపర్లకే పరిమితమైన ఫ్యాక్టరీలు..

రాష్ట్రం ఏర్పడే నాటికి తలసరి ఆదాయం 1.24 లక్షలుండగా..నేడు అది 2.37 లక్షలకు చేరుకున్నదని కేటీఆర్​ తెలిపారు. ఆరు పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని పదే పదే అడిగినా.. మంజూరు చేయలేదని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, ఫార్మాస్యూటికల్స్ పరిశ్రమలలో తెలంగాణకు అవసరమైన ఎకో సిస్టమ్ ఉన్నందున తమ విజ్జప్తిని ఇప్పటికైనా పరిగణించాలని కేంద్రాన్ని సమావేశంలో కోరారు. కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ ఇంతవరకూ మంజూరు చేయలేదని.. అవి కేవలం పేపర్లకే పరిమితమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

అమలు కాని 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు..

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94(1) ప్రకారం పారిశ్రామిక ప్రమోషన్ కోసం పన్ను రాయితీలు తప్పనిసరిగా అందించాలన్నారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94(2) ప్రకారం తెలంగాణలో వెనకబడిన జిల్లాలకు రెండు విడతలుగా 900 కోట్లు చెల్లించాల్సి ఉందనీ.. ఆ నిధులను వెంటనే విడుదల చేయాలని స్పష్టం చేశారు. తెలంగాణకు ప్రత్యేక గ్రాంట్‌లకు సంబంధించి 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఇంకా పూర్తిగా అమలు కాలేదని.. వాటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

పన్ను రాయితీలివ్వాలి..

"దేశ ఆర్థిక ప్రగతిరథానికి రాష్ట్రాలే చోదకశక్తులు. రాష్ట్రాలు అంతర్జాతీయస్థాయిలో పోటీపడేలా కేంద్రం సహకరించాలి. దేశ జీడీపీకి దోహదపడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉంది. 2014లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1.24 లక్షలు. ప్రస్తుతం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2.37 లక్షలకు చేరింది. విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధి కోసం పన్ను రాయితీలివ్వాలి. తెలంగాణలో వెనకబడిన జిల్లాలకు రూ.900 కోట్లు ఇవ్వాలి. రాష్ట్రానికి 15వ ఆర్థికసంఘం సిఫార్సులు పూర్తిగా అమలు కాలేదు. కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వెంటనే ఇవ్వాలి." - మంత్రి కేటీఆర్​.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.