ETV Bharat / city

Laser Speed Guns in Hyderabad : అతివేగానికి లేజర్​ స్పీడ్​ గన్లతో చెక్

author img

By

Published : Feb 4, 2022, 9:09 AM IST

Laser Speed Guns in Hyderabad : అతివేగం.. ప్రమాదకరం.. ప్రాణాంతకం అని ఎన్నిచోట్ల సైను బోర్డులు కనిపిస్తున్నా.. అధికారులు ఎన్నిరకాలుగా అవగాహన కల్పిస్తున్నా వాహనదారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా యువత.. స్పీడ్​లో వెళ్తేనే కిక్కు అనుకుంటూ.. హైస్పీడ్​లో వెళ్లి అదే స్పీడ్​లో ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రాణాలు కోల్పోయి వారి తల్లిదండ్రులకు శోకం మిగులుస్తున్నారు. ఇలా వేగంగా వెళ్లే వాహనదారులకు అడ్డుకట్ట వేసేందుకు ట్రాఫిక్ పోలీసులు లేజర్ స్పీడ్ గన్లను తీసుకొచ్చారు. మితిమీరిన వేగంతో వెళ్తున్న వారిని గుర్తించి వారి ఫొటో తీసి జరిమానాతో కూడిన మెసేజ్​ను వారి మొబైల్​ఫోన్​కు పంపిస్తున్నారు.

Laser Speed Guns in Hyderabad
Laser Speed Guns in Hyderabad

వాహనదారుల వేగానికి లేజర్​ గన్​తో చెక్

Laser Speed Guns in Hyderabad : రహదారులపై రయ్యిమంటూ వాయు వేగంతో దూసుకెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు లేజర్‌ స్పీడ్‌ గన్లతో కళ్లెం వేస్తున్నారు. వాహనదారుల నిర్లక్ష్య ధోరణికి చెక్ పెట్టేందుకు వినియోగిస్తున్నారు. మితిమీరిన స్పీడ్‌తో వెళ్తున్న వాహనచోదకులను గుర్తించి.. ఆయా వాహనాల వేగాన్ని రికార్డు చేసి నిమిషాల్లో ఫొటో, జరిమానాతో కూడిన సంక్షిప్త సందేశాన్ని నిబంధనలు ఉల్లంఘించిన వారి చరవాణులకు పంపుతున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిల్లో రోజుకు రెండు వేలకుపైగా వాహనాలకు జరిమానాలు విధిస్తున్నారు.

స్పీడ్ పెంచితే.. క్లిక్​మనిపిస్తుంది..

Laser Speed Guns for Vehicles : స్పీడ్‌ గన్‌ కెమెరాలను సాఫ్ట్‌వేర్‌ సాయంతో అత్యాధునికంగా మార్చారు సాంకేతిక నిపుణులు. జాతీయ, రాష్ట్ర రహదారులపై వాహనాల వేగపరిమితిని కెమెరాలో నిక్షిప్తమయ్యేలా మార్పులు చేశారు. రవాణా శాఖ సర్వర్‌కు అనుసంధానం చేయడం వల్ల వాహనాల నంబర్లు, వాటి యజమానులు.. వారి చరవాణుల వివరాలన్నీ కెమెరాలో ఉంటాయి. వాహనచోదకులు పరిమితికి మించిన వేగంతో వెళ్తుంటే కన్నుమూసి తెరిచేలోపు వాహనాన్ని వేర్వేరు కోణాల్లో కెమెరా ఫొటో తీస్తుంది. వాహన యజమాని ఫోన్ నంబర్‌కు సంక్షిప్త సందేశంతో పాటు ఫొటో వెళ్లిపోతుంది. ఇలా ఒక నిమిషానికి సగటున 200 వాహనాల ఫొటోలను తీయడంతో పాటు వాటి వేగాన్ని విశ్లేషిస్తుందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

'రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి మేం చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నాం. అందులో ఒకటే.. ఈ లేజర్ స్పీడ్ గన్. ఈ లేజర్ స్పీడ్​ గన్.. అతివేగంతో వెళ్లే వాహనాల ఫొటోను క్లిక్​మనిపిస్తుంది. ఆ ఫొటోకు జరిమానాను జతచేసి మేం సదరు వ్యక్తి మొబైల్​ నంబర్​కు పంపిస్తాం. ఈ రకంగా మేం వాహనదారులు వేగంగా వెళ్లకుండా నియంత్రించేందుకు కృషి చేస్తున్నాం. దీనివల్ల ప్రమాదాలు కూడా తగ్గుతాయి.'

- ట్రాఫిక్ పోలీసు అధికారి

గన్​తో స్పీడ్​కు చెక్..

laser speed gun with camera : ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా.. హైదరాబాద్ శివారుల్లో ప్రమాదాలను తగ్గించేందుకు లేజర్‌ స్పీడ్ గన్లను వినియోగించుకోవాలని అధికారులు నిర్ణయించారు. కొన్నాళ్లుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో రాత్రివేళల్లో ఉపయోగిస్తున్నారు. ట్యాంక్‌బండ్‌, పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే, హబ్సిగూడ, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, మలక్‌పేట సహా ఓఆర్​ఆర్​పై లేజర్‌ స్పీడ్‌ గన్‌లను ఏర్పాటు చేశారు. వేగంగా వెళ్తున్న వాహనదారులు తమకు ఈ−చలాన్ అందలేదంటూ బుకాయించకుండా కోర్టులో వారిపై అభియోగ పత్రాలను సమర్పించేందుకు ఉల్లంఘనుల చరవాణులకు పంపించిన సంక్షిప్త సందేశాల వివరాలను సాక్ష్యంగా నమోదు చేస్తున్నారు.

వేగపరిమితిని పదేపదే ఉల్లఘించిన వారి వివరాలు భద్రపరిచి భవిష్యత్తులో వారి డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేయించేందుకు ఉపయోగించుకోనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.