ETV Bharat / city

నోటిఫికేషన్ల పర్వం నుంచే మొదలైన గందరగోళం

author img

By

Published : Mar 30, 2021, 6:35 AM IST

ప్రతి ఏటా వివిధ కోర్సుల్లో సీట్ల సంఖ్య ఎంతన్నది చివరి నిమిషం వరకు స్పష్టత రాక, కౌన్సెలింగ్‌ ప్రక్రియ వాయిదాలతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యేవారు. ఈసారి ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ల పర్వం నుంచే అది మొదలైంది. మరోవైపు ఆర్థికంగా వెనకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) రిజర్వేషన్‌ ఎలా అమలు చేస్తారన్న దానిపైనా స్పష్టత రాలేదు.

entrance exams, EAMCET, EDCET, EWS reservation
ఎంసెట్ పరీక్ష, ఎడ్​సెట్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్

ఈ ఏడు వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ల పర్వం నుంచే గందరగోళం మొదలైంది. ఓ వైపు ఎంసెట్‌ దరఖాస్తు ప్రక్రియ ఆలస్యమవుతుంటే.. మరోవైపు ఎడ్​సెట్ ప్రవేశ ప్రకటన ఇప్పటికీ విడుదల కాలేదు. ఇంకోవైపు ఆర్థికంగా వెనకబడిన వర్గాల రిజర్వేషన్ ఎలా అమలు చేస్తారనేదానిపై స్పష్టత రాలేదు.

ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలు విధానంపై అస్పష్టత

ఎంసెట్‌ ప్రవేశ ప్రకటన ఈ నెల 18వ తేదీన వెలువడింది. 20వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం హాల్‌టికెట్లు జారీ చేస్తేనే దరఖాస్తు చేసుకోవడానికి వీలవుతుంది. ఇంటర్‌బోర్డు ఇప్పటివరకు వాటిని ఆన్‌లైన్‌లో పెట్టలేదు. విద్యాసంస్థలను మూసివేయడంతో హాల్‌టికెట్ల జారీపై సందిగ్ధత నెలకొంది. ఇంటర్‌ బోర్డు వర్గాలు మాత్రం త్వరలోనే ఇస్తామని చెబుతున్నాయి. ఫలితంగా 10 రోజులుగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. ఏటా దాదాపు 2.40 లక్షల మంది దరఖాస్తు చేస్తుంటారు.

ఎడ్‌సెట్‌.. జీఓ వచ్చేవరకు నోటిఫికేషన్‌ రాదు

బీఈడీ సీట్ల భర్తీకి నిర్వహించే ఎడ్‌సెట్‌-2021లో ఈసారి పలు సంస్కరణలు చేశారు. ఒక్కో మెథడాలజీకి ఒక్కో ప్రశ్నపత్రం కాకుండా అన్ని సబ్జెక్టుల వారికి ఉమ్మడి ప్రశ్నపత్రం లాంటి మార్పులు చేశారు. ఈ నెల 23 లేదా 24న నోటిఫికేషన్‌ విడుదల కావాల్సి ఉంది. ఎడ్‌సెట్‌ కమిటీ చేసిన మార్పులకు సంబంధించి గతంలో ఉన్న జీఓల్లో సవరణలు చేసి ప్రభుత్వం కొత్తగా జీఓలు జారీ చేయాల్సి ఉంది.
విద్యాశాఖకు ప్రతిపాదనలు వెళ్లినా జీఓ మాత్రం జారీ కాలేదు. నోటిఫికేషన్‌లో స్వల్ప మార్పులు చేశామని, వారంలోపు కొత్త కాలపట్టిక విడుదల చేస్తామని ఎడ్‌సెట్‌ అధికారులు ఈ నెల 21న ప్రకటించారు. వారం దాటినా జీఓ వెలువడలేదు. ఫలితంగా నోటిఫికేషన్‌ రాలేదు. దాదాపు 40 వేల మంది అభ్యర్థులు దానికోసం ఎదురుచూస్తున్నారు.

ఈబ్ల్యూఎస్‌ కోటా.. అమలు ఎలా?

ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 10 శాతం అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం జనవరి 21న నిర్ణయం తీసుకుంది. ఆ ప్రకారం సాధారణ పరిపాలన శాఖ జీఓ కూడా జారీ చేసింది. అయితే 10 శాతం సీట్లను ఎలా కేటాయిస్తారన్న అంశంపై రెండు నెలలు గడిచినా స్పష్టత రాలేదు. ఏపీ తదితర కొన్ని రాష్ట్రాలు ఒక కళాశాలలోని మొత్తం సీట్లు 10 శాతం పెంచి.. పెరిగిన వాటిని కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 20 శాతం పెంచి అమలు చేస్తోందని, అందులో 10 శాతం ఈడబ్ల్యూఎస్‌కు ప్రత్యేకంగా, మిగిలిన 10 శాతాన్ని అందరికీ కేటాయిస్తోందని.. ఈ ప్రకారం ఈడబ్ల్యూఎస్‌కు 13 శాతం సీట్లు వస్తాయని ఉన్నత విద్యామండలి వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండింట్లో దేన్ని ఎంచుకోవాలన్న దానిపై ఇంకా నిర్ణయం వెలువడలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.