ETV Bharat / city

కేంద్ర మంత్రికి కేటీఆర్​ లేఖ.. బయోటెక్​ రంగం బలోపేతానికి సూచనలు

author img

By

Published : Aug 6, 2020, 10:01 PM IST

Updated : Aug 6, 2020, 10:24 PM IST

కొవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. క్లినికల్ ట్రయల్స్, తయారీ, అనుమతుల విషయంలో మరింత చురుగ్గా వ్యవహరించాలని సూచించారు. వ్యాక్సిన్​ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఫండింగ్ మద్దతు ఇవ్వాలని కోరారు. సంక్లిష్ట సమయంలో కచ్చితమైన నిర్ణయాలను వేగవంతంగా తీసుకోపోతే.. వ్యాక్సిన్ల తయారీలో అగ్రస్థానాన్ని కోల్పోవాల్సి వస్తుందన్నారు. వ్యాక్సిన్ ప్రయత్నాలు విజయవంతమయ్యాక అందరికీ అందుబాటులో ఉండేలా అవసరమైన విధానాన్ని ఇప్పుడే రూపొందించాలని కేటీఆర్ సూచించారు.

KTR LETTER TO CENTRAL MINSTER HARSHVARDHAN AND GIVEN SUGGESTION TO STRENGTHEN BIOTECH INDUSTRY
కేంద్ర మంత్రికి కేటీఆర్​ లేఖ.. బయోటెక్​ రంగం బలోపేతానికి సూచనలు

కొవిడ్ వ్యాక్సిన్ తయారీ ప్రయత్నాలు, బయోటెక్ రంగ సమస్యలు, ప్రభుత్వాల నుంచి అందాల్సిన సాయంపై మంత్రి కేటీఆర్.. కేంద్ర ప్రభుత్వం దృష్టికి పలు విషయాలను తీసుకెళ్లారు. ఈమేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్​కు లేఖరాశారు. బయోటెక్ పరిశ్రమ వర్గాలతో ఇటీవల ప్రత్యేకంగా సమావేశమైన కేటీఆర్... బయోటెక్ రంగంలో భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఉన్న అవకాశాలు, తీసుకోవాల్సిన చర్యలను లేఖలో ప్రస్తావించారు.

ఇది మూడో వంతు..

తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి ప్రయత్నాలను లేఖలో సవివరంగా ప్రస్తావించారు. ప్రపంచానికి హైదరాబాద్ వ్యాక్సిన్ క్యాపిటల్​గా ఉందని, ఇక్కడి నుంచి సుమారు ఐదు బిలియన్ డోసుల వ్యాక్సిన్లు ఏటా ఉత్పత్తవుతున్నాయన్నారు. ప్రపంచం మొత్తం ఉత్పత్తిలో ఇది మూడో వంతుగా పేర్కొన్నారు.

హైదరాబాద్​ నుంచే వ్యాక్సిన్​..

కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమ గట్టి ప్రయత్నాలు చేస్తోందని కేటీఆర్​ వివరించారు. ఇప్పటికే ఫలవంతమైన భాగస్వామ్యాన్ని అందించిందని గుర్తుచేశారు. నగరానికి చెందిన మూడు కంపెనీలు.. కొవిడ్ వ్యాక్సిన్ తయారీకి ప్రయత్నాలు చేస్తున్నాయని.. హైదరాబాద్​ నుంచి త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్న ఆశ ఉందని.. అదే తనకు గర్వంగా ఉందని కేంద్రమంత్రికి రాసిన లేఖలో కేటీఆర్​ పేర్కొన్నారు.

ప్రత్యేక ఫండింగ్ ..

ఇతర ఫార్మా కంపెనీలు కరోనా చికిత్సలో ఉపయోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ వంటి మందుల తయారీలో పాలు పంచుకుంటున్నాయని తెలిపారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలను ప్రస్తావించిన మంత్రి... వ్యాక్సిన్ అనుమతులు, టెస్టింగ్, ట్రాకింగ్ వ్యవస్థను మరింత వికేంద్రీకరణ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తద్వారా క్లినికల్ ట్రయల్స్, వ్యాక్సిన్ల తయారీలో మరింత సులభంగా కంపెనీలు ముందుకు పోయే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు. దీంతో పాటు వ్యాక్సిన్ అభివృద్ధి కోసం ప్రత్యేక ఫండింగ్ మద్దతు ఇవ్వాలని కేటీఆర్ లేఖలో కోరారు.

సెంట్రల్ డ్రగ్ లేబొరేటరీ హిమాచల్​ప్రదేశ్​లోని కసౌలిలో ఉందని, బ్రిటిష్ హయాంలో ఏర్పాటు చేసిన ప్రయోగకేంద్రం ఇప్పటికీ అక్కడే కొనసాగడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న ఇతర బయోటెక్ పరిశ్రమలకు ఇబ్బందిగా మారిందని మంత్రి అన్నారు. లాక్​డౌన్ సమయంలో సెంట్రల్ డ్రగ్ లేబొరేటరీకి శాంపిళ్లను పంపడం బయోటెక్ పరిశ్రమలకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. వ్యాక్సిన్ తయారిని వేగవంతం చేసే ఉద్దేశంతో ఉన్న కంపెనీలకు సులభంగా అనుమతులు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని కోరారు.

అదనపు నిధులివ్వండి..

ప్రస్తుతం తాత్కాలికంగా ఇచ్చిన వెసులుబాటు శాశ్వతంగా ఉండేలా చూడాలని కోరారు. ప్రపంచ బయోటెక్ రంగంలో భారత దేశాన్ని మరింత ఉన్నతస్థానంలో నిలపాలని, అక్కడున్న పోటీతత్వాన్ని తట్టుకోవాలంటే అనుమతుల విషయంలో మరింత సులభంగా ఉండేలా నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆదిశగా వికేంద్రీకరణ కోసం కేంద్రం చర్యలు తీసుకొని... సీడీఎస్సీవో ప్రాంతీయ కార్యాలయాన్ని హైదరాబాద్​లో ఏర్పాటు చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ జోనల్ కార్యాలయానికి మరిన్ని అధికారాలు, నిధులిచ్చి బలోపేతం చేయాలని కోరారు. తద్వారా కంపెనీలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు.

మార్గదర్శకాలకు వినతి..

వాక్సిన్​ల తయారీలో సుమారు ఆరు కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర స్థాయిలోనూ అనుమతుల ప్రక్రియ ఉంటుందన్న కేటీఆర్... ప్రపంచ పోటీతత్వాన్ని తట్టుకోవాలంటే ఈ ప్రక్రియను కొంత సులభతరం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇందుకు కొత్త విధానాన్ని రూపొందించాలని సూచించారు. కొవిడ్ వ్యాక్సిన్​కు సంబంధించిన అనుమతుల ప్రక్రియపై ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఎఫ్​డీఏఏ వంటి సంస్థలు మార్గదర్శకాలను జారీ చేశారన్నారు. ఆ ప్రమాణాలకు అనుకూలంగా దేశీయంగానూ మార్గదర్శకాలను త్వరగా రూపొందించాలని కేటీఆర్ కోరారు.

త్వరలోనే వ్యాక్సిన్ వస్తుందన్న నమ్మకం ఏర్పడుతున్న నేపథ్యంలో వాక్సిన్ ప్రొక్యూర్మెంట్ పాలసీని సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని కేటీఆర్​ అభిప్రాయపడ్డారు. పీఎం కేర్స్ నిధి ద్వారా సుమారు వందకోట్ల రూపాయలను వ్యాక్సిన్ తయారీ చేస్తున్న కంపెనీల కోసం కేటాయించిన నేపథ్యంలో వాటికి మార్గదర్శకాలను సిద్ధం చేయాలని లేఖలో ప్రస్తావించారు. వ్యాక్సిన్ తయారీలో ముందువరుసలో ఉన్న సంస్థలకు మరిన్ని నిధులు ఇచ్చేలా నూతన నిధిని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని..కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ కోరారు. తద్వారా వాక్సిన్ తయారీ మరింత వేగవంతమయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఈ విషయమై వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్​కు విజ్ఞప్తి చేశారు.

ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగం మరింత బలోపేతం కావాలని కోరుకునే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటన్న కేటీఆర్​.. ఆ దిశగా అవసరమైన సాయం చేసేందుకు రాష్ట్రప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని కేంద్ర మంత్రికి హామీ ఇచ్చారు.

ఇవీచూడండి: భారత్ బయోటెక్​ ల్యాబ్​ను సందర్శించిన మంత్రి కేటీఆర్

Last Updated : Aug 6, 2020, 10:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.