ETV Bharat / city

justice sirpurkar commission : ఈనెల 29న సిర్పుర్కర్ కమిషన్​ ఎదుటకు సజ్జనార్!

author img

By

Published : Sep 26, 2021, 7:22 AM IST

ఈనెల 29న సిర్పుర్కర్ కమిషన్​ ఎదుటకు సజ్జనార్!
ఈనెల 29న సిర్పుర్కర్ కమిషన్​ ఎదుటకు సజ్జనార్!

దిశ హత్యాచార కేసు నిందితుల ఎన్​కౌంటర్​పై సిర్పుర్కర్ కమిషన్ విచారణ వేగవంతం చేసింది. దిశ అత్యాచారానికి గురైందని ఎలా నిర్ధారణకు వచ్చారని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డిని ప్రశ్నించింది. ఆయన ఇచ్చిన సమాధానంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో ఇప్పటికే సిట్ ఛైర్మన్ మహేశ్ భగవత్​ను విచారించిన కమిషన్.. ఎన్​కౌంటర్​ జరిగిన సమయంలో సైబరాబాద్ సీపీగా ఉన్న సజ్జనార్​ను​ వచ్చే బుధవారం ప్రశ్నించనున్నట్లు సమాచారం.

‘దిశ’ హత్యాచార కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనలో పాల్గొన్న పోలీసులు వినియోగించిన తూటాల లెక్క తేల్చేందుకు సంబంధిత ఠాణాల్లోని ఆయుధాల రిజిస్టర్‌ను తనిఖీ చేశారా? అని వనపర్తి ఎస్పీ అపూర్వారావును సిర్పుర్కర్‌ కమిషన్‌ ప్రశ్నించింది. తనిఖీ చేయలేదని ఆమె బదులిచ్చారు. చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌ ఘటనపై ఏర్పాటైన సిట్‌కు సంబంధించి కేస్‌ డైరీ రాసిన అపూర్వారావును శనివారం కమిషన్‌ విచారించింది.

కమిషన్ అసహనం..

ఎన్‌కౌంటర్‌లో గాయపడినట్లుగా చెబుతున్న పోలీసులకు చికిత్స చేసిన ఆసుపత్రిని సందర్శించిన సమయంలో క్షతగాత్రులు ఐసీయూలో ఉన్నారా? సాధారణ వార్డులో ఉన్నారా అని ప్రశ్నించగా.. సాధారణ వార్డులోనే ఉన్నారని ఆమె బదులిచ్చారు. తీవ్రమైన గాయాలతో ఉన్నారని సిట్‌ నివేదికలో ఉందని.. అలాంటి వారిని సాధారణ వార్డులో ఎలా ఉంచారని కమిషన్‌ సభ్యులు ప్రశ్నించారు. ఐసీయూ, ఐసీసీయూ, సాధారణ వార్డులకు తేడా తెలుసా అని అసహనం వ్యక్తం చేశారు.

ఎలా నిర్ధారించారు..

అనంతరం శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డిని కమిషన్‌ ప్రశ్నించింది. ‘దిశ’ అత్యాచారానికి గురైందని మీరు ఎలా నిర్ధారణకు వచ్చారు అని అడిగింది. ఘటనాస్థలిలో ‘దిశ’ చున్నీ, లాకెట్‌, దుస్తులు పడి ఉండటంతోపాటు నిందితులు పురుషులు కావడంతో అత్యాచారం జరిగిందని ఊహించామన్నారు. ఆ వస్తువులు దొరికినంత మాత్రాన అత్యాచారం జరిగినట్లు ఎలా భావిస్తారని కమిషన్‌ ప్రశ్నించగా.. మౌనంగా ఉండిపోయారు. ఎన్‌కౌంటర్‌ తర్వాత మెజిస్ట్రేట్‌ వచ్చేవరకు ఘటనాస్థలి నుంచి మృతదేహాల్ని తరలించొద్దనే విషయం మీకు తెలియదా? అని అడగ్గా.. అలా చేయడం సరికాదని అంగీకరించారు.

కమిషన్‌ విచారణకు సజ్జనార్‌!

ఇంతకు ముందు సిట్ ఛైర్మన్ మహేశ్ భగవత్​ను ప్రశ్నించిన కమిషన్.. దర్యాప్తు అధికారిగా ఉండిఎన్​కౌంటర్​ జరిగిన సమయంలో సీపీగా ఉన్న సజ్జనార్​నుస, స్థానిక డీసీపీని ఎందుకు ప్రశ్నించలేదని నిలదీసింది. నిందితులు ఎదురు దాడికి దిగినప్పుడు పోలీసులకు గాయాలయ్యాయని నివేదికలో రాసినా.. వాటి వివరాలు ఎందుకు పొందుపర్చలేదని ప్రశ్నించింది. కేసు దర్యాప్తుపై రాసిన డైరీపై కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది.

‘దిశ’ హత్యాచారం, నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగిన సమయంలో సైబరాబాద్‌ కమిషనర్‌గా ఉన్న సజ్జనార్‌ వచ్చే బుధవారం కమిషన్‌ విచారణకు హాజరు కానున్నట్లు సమాచారం.

సంబంధిత కథనాలు :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.