ETV Bharat / city

ఆనంద్‌లో నాకు నాన్న ముకేశ్​ అంబానీ కనిపిస్తారు...

author img

By

Published : Sep 6, 2020, 10:17 AM IST

‘జియో’ డిజిటల్‌ విప్లవం వెనకున్న కీలక వ్యక్తుల్లో ఈశా అంబానీ పిరమాల్‌ ఒకరు. 2020కిగానూ ఫార్చ్యూన్‌ మ్యాగజైన్‌ విడుదల చేసిన ‘40 అండర్‌ 40’ ప్రపంచ జాబితా(టెక్నాలజీ)లో సోదరుడు ఆకాశ్‌తో కలసి స్థానం సంపాదించింది ఈశా. జియోలో బోర్డు డైరెక్టర్‌ అయిన ఈశా... తన కుటుంబం, వ్యాపారం, ఇష్టాల గురించి ఏం చెబుతుందంటే...

jio company director isha ambani piramal about her journey
ముకేశ్ అంబానీ కుమార్తె ఈశా అంబానీ పిరమాల్

అనుబంధాల కుటుంబం...

మా చిన్నపుడు నాన్న ముకేశ్‌ కంపెనీ పనుల్లో చాలా బిజీగా ఉండేవారు. ఎంత బిజీగా ఉన్నాసరే అవసరమైనప్పుడు అందుబాటులో ఉండేవారు. అమ్మ నీతా చాలా స్ట్రిక్ట్‌. ఎప్పుడైనా స్కూల్‌కి వెళ్లనంటే నాన్న సరే అనేవారు. అమ్మ మాత్రం ఒప్పుకునేది కాదు. తిండి, చదువు, ఆట... అన్నీ టైమ్‌కి జరగాలనేది.

తాతయ్యతోనూ నాకు చాలా జ్ఞాపకాలున్నాయి. స్వాతంత్య్ర పోరాటం గురించి చెప్పేవారు. అవన్నీ విని పెద్దయ్యాక సైన్యంలో చేరాలనుకునేదాన్ని. నాన్నమ్మ కోకిలాబెన్‌ కుటుంబాన్ని ఒకే తాటిమీద ఉంచే వ్యక్తి. స్టాన్‌ఫర్డ్‌లో ఎంబీఏ చేస్తున్నపుడు నాతోపాటు రెండు నెలలు ఉంది. నా పెళ్లిలో కబుర్లు చెబుతూ, పాటలు పాడుతూ, గర్బా డ్యాన్స్‌ చేస్తూ చాలా హడావుడి చేసింది. వీరందరూ డబ్బు విలువనీ, కష్డపడే తత్వాన్నీ, అణకువగా ఉండటాన్నీ చిన్నప్పట్నుంచీ నేర్పారు.

అమెరికాలో చదువు...

యేల్‌ యూనివర్సిటీలో అండర్‌ గ్రాడ్యుయేషన్‌ చేశా. ఇంట్లో సౌకర్యాల్ని వదిలి బంక్‌ బెడ్‌ మీద నిద్రపోవడం, కమ్యూనిటీ టాయిలెట్స్‌ ఉపయోగించడం, మ్యాగీ నూడిల్స్‌తో ఆకలి తీర్చుకోవడం... ఇలా ఎన్నో అనుభవ పాఠాలు నేర్చుకున్నానక్కడ. యేల్‌, స్టాన్‌ఫర్డ్‌లలో చదువూ, మెకన్సీలో ఉద్యోగం... జీవితంలో మర్చిపోలేను. మెకన్సీలో ఎంతో ప్రతిభావంతులతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఆ అనుభవాలు నా ఆలోచనా పరిధిని పెంచాయి.

జియోనే జీవితం

మెకన్సీలో ఏడాదిన్నర పనిచేశాక 2014లో భారత్‌ తిరిగొచ్చిన వెంటనే జియో ప్రారంభించాం. ఆలోచన దశ నుంచి ‘జియో’లో భాగంగా ఉన్నా. సిబ్బంది నియామకం, మార్కెటింగ్‌, బ్రాండింగ్‌... ఈ పనులన్నీ చూసుకున్నా. రెండేళ్లపాటు నిద్రలో తప్ప మేల్కొని ఉన్న ప్రతి నిమిషం జియో గురించే ఆలోచించేదాన్ని.

2015లో జియో సేవలు మొదలైన ఏడాది తరువాత ఎంబీఏ చేయడానికి మరోసారి అమెరికా వెళ్లా. అక్కణ్నుంచీ డైరెక్టర్‌గా పనిచేశా. రెండేళ్లలో చివరి ఆరు నెలలు మాత్రమే పూర్తిగా ఎంబీఏ పరీక్షల మీద దృష్టిపెట్టా. తిరిగొచ్చాక మళ్లీ జియోతో బిజీ అయిపోయా. నా కలల ప్రాజెక్టుగా జియోకి ఎప్పటికీ మనసులో చోటుంటుంది.

జియో యూనివర్సిటీ వస్తోంది..

నా సమయాన్ని జియోతోపాటు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఫౌండేషన్‌లకీ కేటాయిస్తున్నా. రోజులో 14 గంటలు పని చేస్తా. పనిలోపడి తెల్లవారుజాము మూడు, నాలుగింటివరకూ నిద్రపోని రోజులూ ఉన్నాయి. భారతీయ కళల్ని ప్రపంచానికి చూపించడానికీ, విదేశీ కళల్ని మన దేశానికి తెచ్చేందుకూ రిలయన్స్‌ ఆర్ట్స్‌ ఫౌండేషన్‌ ఏర్పాటుచేశా.

నాకు పిల్లలన్నా, విద్యారంగమన్నా చాలా ఇష్టం. ‘ధీరూబాయ్‌ స్కూల్‌’ అంటే పని ప్రదేశం కాదు, ప్రేమించే ప్రదేశం. పిల్లల ఆలోచనా విధానాన్ని తీర్చిదిద్దే గొప్ప అవకాశం స్కూల్‌ ద్వారా వస్తోంది. ప్రపంచస్థాయి స్కూళ్లకు ధీటుగా మరో కొత్త క్యాంపస్‌ను నిర్మిస్తున్నాం. రిలయన్స్‌ ఫౌండేషన్‌ స్కూల్స్‌నీ నిర్వహిస్తున్నాం. ప్రపంచస్థాయి ప్రమాణాలతో జియో యూనివర్సిటీ రాబోతుంది. రిలయన్స్‌ను ప్రపంచ టాప్‌-10 కంపెనీల్లో నిలబెట్టడమే నా లక్ష్యం.

విశిష్టమైన వస్త్ర సంపద భారతీయుల సొంతం. మన సంప్రదాయ దుస్తులంటే నాకెంతో ఇష్టం. ఆఫీసుకి బ్లాక్‌ ప్రింట్స్‌ ఉండే కాటన్‌ కుర్తాలనే వేసుకుంటా. పార్టీలకి వేలంటినో, అబూ జైన్‌, సందీప్‌ ఖోస్లా, మనీష్‌ మల్హోత్రా, సవ్యసాచి మొదలైన డిజైనర్లవి ఎంచుకుంటా. ఇంట్లో మాత్రం సల్వార్‌ కమీజ్‌లూ, ట్రాక్‌ ప్యాంట్స్‌, టీషర్టులూ వేసుకుంటా. డ్యాన్సింగ్‌, ట్రావెలింగ్‌ ఇష్టం. ఏకాంతమూ నచ్చుతుంది.

ఖాళీగా ఉండటం కష్టం...

మా కుటుంబంలో అందరికీ పనే మొదటి ప్రాధాన్యం. మేం మాల్దీవులకు హనీమూన్‌కి వెళ్లాం. మూడు రోజులు సేదదీరాక ఖాళీగా ఉంటున్నాననే ఆలోచన మొదలైంది. నేనే కాదు ఇంట్లో అందరూ ఇంతే. ఈ విషయంలో అమ్మానాన్న మాకెంతో స్ఫూర్తి. నాన్నకి వ్యాపారం అంటే మ్యాథ్స్‌. పెట్టుబడి, రాబడి, ప్రభావం... వీటి లెక్క పక్కాగా ఉండాల్సిందే.

అమ్మ ఆలోచనల్లో సృజనాత్మకత ఎక్కువ. మాకు అయిదేళ్లు వచ్చేంతవరకూ పూర్తిగా ఇంట్లోనే ఉండేది. మేం పెద్దయ్యాక ఫుల్‌టైమ్‌ ఆఫీసుకే కేటాయిస్తోంది. మహిళలకు ఏ వయసులో ఏది ముఖ్యమో అమ్మని చూశాకే అర్థమైంది.

ఆకాశ్‌ కూడా పని విషయంలో చాలా చురుకు. తన మనసు చాలా విశాలమైంది. నాపెళ్లి కోసం తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు. తమ్ముడు అనంత్‌ని ఓ తల్లిలా గారాబం చేస్తా.

నా భర్త ఆనంద్‌ పిరమాల్‌కి మంచి సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ ఉంది. ఆధ్యాత్మిక భావనలూ ఎక్కువే. పెళ్లి వేడుకల్ని నేనెంతో ఎంజాయ్‌ చేశా. తనకి హంగామా నచ్చదు. కుటుంబానికి ప్రాధాన్యమిస్తారు. ఆహారప్రియులు కూడా. చాలా విషయాల్లో ఆనంద్‌లో నాకు నాన్న కనిపిస్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.