ETV Bharat / city

ఏడాది తర్వాత మెట్రోకు జైపాల్‌రెడ్డి పేరు పెట్టి చూపిస్తాం: రేవంత్‌రెడ్డి

author img

By

Published : Sep 30, 2022, 3:54 PM IST

Jaipal Reddy Statue Unveiling Program: ఏ సిద్ధాంతాలు, విలువలతో జైపాల్‌రెడ్డి ముందుకు సాగారో... అవి ప్రస్తుత రాజకీయాల్లో లోపించాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ మెట్రో రైల్‌కు జైపాల్‌రెడ్డి పేరు పెట్టే బాధ్యత మాది అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. 12నెలల తర్వాత మెట్రోకు ఆయన పేరు పెట్టి చూపిస్తామని పేర్కొన్నారు.

Jaipal Reddy Statue Unveiling Program
Jaipal Reddy Statue Unveiling Program

Jaipal Reddy Statue Unveiling Program: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లో ఉన్న మెట్రో శ్రమ అంతా జైపాల్‌రెడ్డిదే అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. 12నెలల తర్వాత మెట్రోకు జైపాల్‌రెడ్డి పేరు పెట్టి చూపిస్తామన్నారు. దివంగత కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. రంగారెడ్డి జిల్లాలోని జైపాల్‌రెడ్డి స్వగ్రామమైన మాడ్గులలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులు హాజరయ్యారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దివంగత నేత విగ్రహాన్ని ఆవిష్కరించారు.

'విద్యార్థి దశలో జైపాల్‌రెడ్డి, నేను మొదటిసారిగా కలుసుకున్నాం.జైపాల్‌రెడ్డి విగ్రహం ఆవిష్కరించడం గౌరవంగా భావిస్తున్నా. 3 దశాబ్దాలు రాజకీయాల్లో ఇద్దరం కలిసి పనిచేశాం. ప్రస్తుత రాజకీయాల్లో సిద్ధాంతాలు, విలువలు లోపించాయి. చివరి వరకు విలువలకు కట్టుబడిన నాయకుడు జైపాల్‌రెడ్డి. దేశంలో 4 స్తంభాలపై చాలా దాడులు జరుగుతున్నాయి' -సీతారాం ఏచూరి, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి

'మెట్రోరైల్‌తో హైదరాబాద్‌ కీర్తి ప్రపంచవ్యాప్తంగా మరింత పెరిగింది. పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హైదరాబాద్‌లో మెట్రో కోసం కృషిచేశారు. మెట్రోకు అనుమతులు తెచ్చి రూ.1500కోట్ల మంజూరు చేశారు. ఇవాళ హైదరాబాద్‌లో ఉన్న మెట్రో శ్రమ అంతా జైపాల్‌రెడ్డిదే. హైదరాబాద్‌ మెట్రో రైల్‌కు జైపాల్‌రెడ్డి పేరు పెట్టే బాధ్యత మాది. 12నెలల తర్వాత మెట్రోకు జైపాల్‌రెడ్డి పేరు పెట్టి చూపిస్తాం' -రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

'జైపాల్‌రెడ్డి ఒక గొప్ప రాజకీయవేత్త. జైపాల్‌రెడ్డి విగ్రహం చూడగానే యువతకు ఆయన స్ఫూర్తి గుర్తుకురావాలి. జైపాల్‌రెడ్డి నియమావళి అందరికీ ఆచరణీయమని' జస్టిస్‌ సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. గ్రామంలో శిలాఫలకంతో పాటు జైపాల్‌రెడ్డి జీవితచరిత్ర బ్రోచర్‌ను జస్టిస్‌ సుభాష్‌రెడ్డి విడుదల చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ముందు జైపాల్‌రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తీర్మానించారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్న నేతలు... చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.

ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు ఆర్​.కృష్ణయ్య, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సుభాష్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, భాజపా నేత ఆచారితో పాటు పెద్దసంఖ్యలో నేతలు హాజరయ్యారు. రాజకీయ పార్టీల ప్రముఖ నేతల రాకతో పాటు అభిమాన నాయకుడి విగ్రహావిష్కరణ సందర్భంగా ఆయన అభిమానులు, వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు వేలాదిగా తరలివచ్చారు.

12నెలల తర్వాత మెట్రోకు జైపాల్‌రెడ్డి పేరు పెట్టి చూపిస్తాం: రేవంత్‌రెడ్డి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.