ETV Bharat / city

IT: 'వర్క్​ ఫ్రం హోం'కు ఫుల్​స్టాప్​.. ఆఫీసులకు రప్పించేందుకు ఐటీ సంస్థల ప్రణాళికలు

author img

By

Published : Sep 20, 2021, 6:18 AM IST

కరోనా భయంతో సుమారు ఏడాదిన్నరగా ఐటీ ఉద్యోగులకు ‘ఇంటి నుంచి పని(WORK FROM HOME)’ అవకాశం కల్పించిన ఐటీ(IT) కంపెనీలు.. నెమ్మదిగా వారందరినీ కార్యాలయాలకు రప్పించే ప్రణాళికలు రచిస్తున్నాయి. విడతల వారీగా తమ ఉద్యోగులు కార్యాలయాలకు రావాలని కోరుతున్నాయి. ఐటీ ఉద్యోగులు, కుటుంబసభ్యులకు నూరు శాతం వ్యాక్సినేషన్‌ త్వరలో ముగియనున్న నేపథ్యంలో ఈ మేరకు కసరత్తు చేస్తున్నాయి.

it companies
ఐటీ కంపెనీలు

ఐటీ(IT) ఉద్యోగులకు కరోనా వ్యాక్సినేషన్(CORONA VACCINATION)​ రెండు డోసులు పూర్తవుతుండటంతో ఇక వారిని కార్యాలయాలకు రప్పించేందుకు ఐటీ సంస్థలు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఈ మేరకు ఎప్పటిలోగా రావాలో గడువు చెబుతూ వారికి ఈ మెయిల్స్​ ద్వారా సమాచారం అందిస్తున్నారు. మార్చి నాటికి 70శాతం ఉద్యోగులు హాజరయ్యేలా లక్ష్యం నిర్దేశించుకున్నాయి. ఇప్పటికే కొన్ని దేశీయ పెద్ద కంపెనీలు, చిన్న, మధ్యతరహా ఐటీ సంస్థలు దసరా నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించనున్నాయి. ఈ ఏడాది చివరికల్లా కనీసం 50శాతం ఉద్యోగులు కార్యాలయాల్లో పనిచేసేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. మరోవైపు విదేశీ ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లోని తమ ఉద్యోగులు జనవరి నాటికి కార్యాలయాలకు వచ్చేందుకు సిద్ధం కావాలని ఇప్పటికే ఈ-మెయిల్‌ ద్వారా సమాచారం అందిస్తున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఆరు లక్షల మంది

రాష్ట్రంలోని 1500కు పైగా ఐటీ కంపెనీల్లో దాదాపు 6.28లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో ప్రస్తుతం 90 శాతం మంది ఇంటి నుంచి పని(WORK FROM HOME) విధానంలో సేవలందిస్తున్నారు. ఈ పరిశ్రమపై ఆధారపడి అనేక ఇతర వర్గాలు జీవనం సాగిస్తున్నాయి. ప్రభుత్వం ఐటీ ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యమిచ్చింది. పలు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌లో సహకరించాయి. ఈ క్రమంలో మరో నెలలోగా ఐటీ ఉద్యోగులు, వారి కుటుంబాలకు రెండు డోసుల వ్యాక్సినేషన్‌ దాదాపు ముగియనున్నట్లు తెలిసింది. దీంతో నెమ్మదిగా సిబ్బందిని ఆఫీసులకు రప్పించాలని కంపెనీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. 2022 మార్చికల్లా 70 శాతం మంది ఉద్యోగులను కార్యాలయాలకు తీసుకురావాలన్న లక్ష్యంలో భాగంగా వారిని అప్రమత్తం చేస్తున్నాయి.

తిరిగి కుదురుకోవాలంటే..

ఇంటి నుంచి పని విధానంలో భాగంగా హైదరాబాద్‌ ఐటీ ఉద్యోగుల్లో దాదాపు 40 శాతం మంది నగరానికి దూరంగా సొంతూళ్లలో ఉన్నారు. వారంతా తిరిగి వచ్చి, అద్దె ఇళ్లు వెతుక్కోవడం, వసతి గృహాల్లో చేరడానికి సమయం పట్టనుంది. ఈ నేపథ్యంలో ముందస్తు అప్రమత్త చర్యల్లో భాగంగా కంపెనీలు సమాచారమిస్తున్నట్లు ఐటీ వర్గాలు చెబుతున్నాయి. ‘‘ప్రస్తుతం కార్యాలయాలకు పది శాతం మంది ఉద్యోగులు వస్తున్నారు. మిగతా వారు విడతల వారీగా అక్టోబరు నుంచి ఆరంభించి డిసెంబరు నాటికి కనీసం 40శాతం మంది వచ్చేలా ఐటీ కంపెనీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఐటీ ఉద్యోగుల రెండు డోసుల వ్యాక్సినేషన్‌ త్వరలో పూర్తికానుంది.’’ అని హైసియా అధ్యక్షుడు భరణికుమార్‌ ఆరోల్‌ తెలిపారు. ‘‘ప్రభుత్వ ఒత్తిడితో కంపెనీలు తమ ఉద్యోగులను కార్యాలయాలకు రావాలంటూ సమాచారం ఇస్తున్నాయి. వారలా వచ్చినా కరోనా చేదు అనుభవాల నేపథ్యంలో ధారాళంగా గాలి, వెలుతురు ఉండేలా ఆఫీసు వాతావరణాన్ని రీ డిజైన్‌ చేయాలి. ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లతో పాటు ఆరోగ్య భద్రత బాధ్యతను ఐటీ సంస్థలు, ప్రభుత్వం తీసుకోవాలి’’ అని ఫోరం ఫర్‌ ఐటీ ప్రొఫెషనల్స్‌ అధ్యక్షుడు కిరణ్‌చంద్ర పేర్కొన్నారు.

ఇదీ చదవండి: KTR: డబ్ల్యూఈఎఫ్​ నుంచి కేటీఆర్​కు ఆహ్వానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.