ETV Bharat / city

నల్లా కనెక్షన్స్​లో తెలంగాణకు మొదటి స్థానం

author img

By

Published : Feb 21, 2021, 3:11 PM IST

తెలంగాణ రాష్ట్రం మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. పాఠశాలలు, అంగన్​వాడీ కేంద్రాల్లో 100 శాతం నల్లా కనెక్షన్స్​ పూర్తి చేసిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నట్టు కేంద్రం ప్రకటించింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్​కే ఈ ఘనత దక్కుతుందని గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు తెలిపారు.

hundred percent water tap connections complete in school and anganwadi
పాఠశాలలు, అంగన్​వాడీలకు నల్లా కనెక్షన్స్​లో తెలంగాణకు మొదటి స్థానం

పాఠశాలలు, అంగన్​వాడీ కేంద్రాల్లో 100 శాతం నల్లా కనెక్షన్స్ పూర్తి చేసిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణను మొదటి రాష్ట్రంగా కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలు, ఆశ్రమాల్లో 100 శాతం న‌ల్లా కనెక్షన్ కల్పించాలని గతేడాది మ‌హాత్మాగాంధీ జయంతి రోజున ప్రధాని నరేంద్ర మోదీ 100 రోజుల ప్రణాళికను ప్రారంభించారు. బ‌డి పిల్లలు క‌లుషిత నీరు తాగి వ్యాధుల బారిన పడడం, క‌రోనా నివారణలో పదేపదే చేతులు కడుక్కునే అవసరం ఉన్నందున... పైప్​లైన్, తాగు నీరు కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నిర్ధిష్ట సమయంలో ఈ ప్రణాళికను తెలంగాణ‌, ఏపీ, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, గోవా, హర్యానాలో పూర్తి చేసినట్టు కేంద్ర జలశక్తి శాఖ నివేదించింది. ఈ మిషన్ అమలుకు మరింత సమయం కావాలని చాలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సూచించాయి. రాష్ట్రాల సూచన మేరకు 100 రోజుల ప్రణాళిక ప్రచారాన్ని మార్చి 31 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.

సీఎం కేసీఆర్, మొదట్లో మిషన్ భగీరథను నిర్వహించిన మంత్రి కేటీఆర్​కే ఈ క్రెడిట్ దక్కుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ సరఫర శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ఇప్పటికే అనేక అవార్డులు, రివార్డులు దక్కించుకున్న మిషన్ భగీరథ పథకం మరో ప్రశంసను పొందడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కీసీఆర్ ఆలోచన, ముందు చూపు, చొరువ, తెగువ వల్లే ఇది సాధ్యమైందన్నారు. వంద శాతం నల్లా కనెక్షన్లు ఇచ్చిన, వంద శాతం ఫ్లోరైడ్ రహిత మంచి నీటిని సరఫరా చేస్తూ... వంద శాతం భూ ఉపరితల శుద్ధి చేసిన మంచినీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఇప్పటికే చరిత్ర సృష్టించిందని మంత్రి తెలిపారు. అవార్డులు, ప్రశంసలతో పాటు కేంద్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకానికి నిధులు కూడా ఇవ్వాలని మంత్రి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: 'దొంగ పాస్‌పోర్టులపై పోలీసుల దృష్టి ఏది?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.