ETV Bharat / city

చారిత్రక తావు.. ఆక్రమణలు జోరు

author img

By

Published : Feb 1, 2021, 7:54 AM IST

భాగ్యనగరంలోని చారిత్రక ప్రదేశాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. వారసత్వ సంపద పరిరక్షణకు కృషి చేయాల్సిన యంత్రాంగం చోద్యం చూస్తోందని పలువురు వాపోతున్నారు. ఆక్రమిత స్థలంలో కొందరు నల్లా, విద్యుత్తు కనెక్షన్‌ తీసుకొని పాగా వేస్తున్నారు.

Historic monuments of Hyderabad are getting occupied
చారిత్రక తావు.. ఆక్రమణలు జోరు

హైదరాబాద్​ గోల్కొండ కోట ప్రధాన ద్వారం నుంచి ఫతేదర్వాజ, కుతుబ్‌షాహీ టూంబ్స్‌ మార్గం వైపు.. ప్రహరీని ఆనుకొని వందలాది అక్రమ నిర్మాణాలు వెలిశాయి. ఆ వైపు ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. గతంలో ఫతేదర్వాజ వద్ద కమాన్‌ గోడను కూల్చేసి రెండంతస్తుల భవనాన్ని నిర్మించారు. ఆ నిర్మాణాన్ని కూల్చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. గోల్కొండ పరిసరాల్లో ఎలాంటి నిర్మాణం చేపట్టాలన్నా పురావస్తుశాఖ నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) తీసుకోవాలి. జీహెచ్‌ఎంసీ, జలమండలి నుంచి అనుమతి తీసుకొని రోడ్లు, తాగునీటి నిర్మాణాలు చేపట్టాలి. కానీ ఇక్కడి నిర్మాణాలు ఏవీ అనుమతులు పొందిన దాఖలాలు లేవు.

సమాధుల పక్కనే వ్యాపారం

170 ఏళ్ల పాటు సాగిన కుతుబ్‌షాహీ పాలనలోని ఏడుగురు పాలకులకు గుర్తుగా వారి వారసుల సమాధులను ఒకే ప్రాంగణంలో నిర్మించారు. వంశస్థుల సమాధులు ఒకే చోట ఉండటం ఇక్కడ మినహా ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. సమాధులున్న ప్రాంతంలో కొంత భూమికి తాము హక్కుదారులమని కొందరు స్థానికులు గతంలో కోర్టును ఆశ్రయించారు. అయితే ఇక్కడ కొందరు ఇసుక వ్యాపారం చేపడుతున్నారు.

20 ఎకరాలు ఏమైనట్టు..!

ఆస్మాన్‌గఢ్‌లో కొండపై 18వ శతాబ్దంలో స్మారక స్తూపాన్ని నిర్మించారు. నిజాం పాలనలో ఫిరంగి సేనలను తీర్చిదిద్దిన ఘనచరితలో ఫ్రెంచ్‌ దేశస్థుడైన జనరల్‌ మాన్సియర్‌ రేమండ్‌ కృషి ఉంది. ఆయన స్మారకంగా దీన్ని నిర్మించారని చెబుతారు. రేమండ్‌ సంబంధికుల సమాధులు ఇక్కడున్నాయి. 27.20 ఎకరాల ఈ ప్రదేశం కబ్జాలతో 7.20 ఎకరాలకే పరిమితమైంది.

ప్రధాన ద్వారం ముందే..

నిజాం దర్బార్‌లో రాజనర్తకి అయిన మహలఖ్‌ చందాబాయి 24 ఏళ్ల వయసులో, తన తల్లి రాజ్‌కున్వర్‌బాయి జ్ఞాపకార్థం మౌలాలిలోని చందాబాగ్‌లో 1793లో సమాధులు నిర్మింపజేసింది. ఎందరో విదేశీయులు సందర్శించారు. నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుతున్నాయి. ప్రధాన ద్వారం ముందే ఆక్రమణలు వెలిశాయి. 2011లో హెరిటేజ్‌ పురస్కారం వచ్చింది. అభివృద్ధి చేస్తామన్న అధికారుల మాటలు అమలవలేదు.

రాష్ట్ర సర్కారు పర్యవేక్షించాలి

నగరంలోని చారిత్రక కట్టడాల పర్యవేక్షణను కేంద్ర, రాష్ట్ర పురావస్తుశాఖలు, హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఉన్నాయి. గోల్కొండతో పాటు అనేక చారిత్రక కట్టడాలు ఆక్రమణలు, పర్యవేక్షణ లోపంతో ఉనికిని కోల్పోతున్నాయి. ఏఎస్‌ఐకు కేవలం ఫిర్యాదులు, రిపోర్టులు ఇచ్చే అధికారం మాత్రమే ఉంది. రక్షణ బాధ్యత అంతా పోలీసులు, రెవెన్యూ, కలెక్టర్లు చూసుకోవాలి. నూతన హెరిటేజ్‌ చట్టం ప్రకారం చారిత్రక కట్టడాలకు ప్రభుత్వం సరిహద్దులపై ఎటువంటి నిర్ణయం వెలువరించలేదు. రక్షణ, పర్యవేక్షణ వ్యవస్థ పటిష్ఠంగా ఉండాల్సిన అవసరం ఉంది. లాక్‌డౌన్‌ సమయంలో ఆక్రమణలు ఎక్కువైపోయాయని సమాచారం అందింది.

- అనురాధ, ఇంటాక్‌ కన్వీనర్‌, హైదరాబాద్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.