ETV Bharat / city

మరియమ్మ మృతిపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. గుండె ఆగిపోయేలా కొడతారా?

author img

By

Published : Nov 10, 2021, 5:04 PM IST

Updated : Nov 10, 2021, 8:47 PM IST

High Court hearing on Mariamma's death in Adadgudur PS
High Court hearing on Mariamma's death in Adadgudur PS

17:02 November 10

మరియమ్మ మృతిపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. గుండె ఆగిపోయేలా కొడతారా?

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పీఎస్‌లో మరియమ్మ మృతి కేసు(mariamma lockup death case)పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పాస్టర్ ఇంట్లో చోరీ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న మరియమ్మ మృతిపై న్యాయవిచారణ జరిపి బాద్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు.. ఆమె కుటుంబానికి పరిహారం చెల్లించాలని కోరుతూ పీయూసీఎల్ ప్రధాన కార్యదర్శి జయ వింధ్యాల దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ఇవాళ మరోసారి విచారణ జరిపింది. ఆలేరు మెజిస్ట్రేట్ సీల్డు కవర్​లో సమర్పించిన నివేదికను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్​ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం పరిశీలించింది.

గుండె ఆగిపోయేలా కొడతారా..?

మరియమ్మ మృతి కేసు(mariamma lockup death case)లో ఎస్సై, కానిస్టేబుల్​ను ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు.. ఆమె కుటుంబానికి పరిహారం చెల్లించినట్లు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు. పరిహారంతో ప్రాణాలు తిరిగి రాలేవని వ్యాఖ్యానించిన ధర్మాసనం... బాధ్యులపై క్రిమినల్ చర్యలు ఏం తీసుకున్నారని ప్రశ్నించింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మరియమ్మ... గుండె ఆగి మరణించారని ఏజీ పేర్కొన్నారు. న్యాయ విచారణకు ఆదేశించిన తర్వాత జరిగిన రెండో శవపరీక్షలో.. మరియమ్మ శరీరంపై గాయాలున్నట్లు తేలిందని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. గుండె ఆగిపోయేలా ఎవరైనా కొడతారా..? అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

సీబీఐ ఎస్పీకి నోటీసులు..

మరియమ్మ కస్టోడియల్ మృతి.. సీబీఐ వంటి స్వతంత్ర సంస్థలు దర్యాప్తు జరపాల్సిన అంశమని ధర్మాసనం అభిప్రాయపడింది. సీబీఐ, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చి.. నోటీసులు జారీ చేసింది. పిల్, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్​కు అప్పగించాలని ఏజీని ధర్మాసనం ఆదేశించింది. కేసు విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు... ఆ రోజున హైదరాబాద్ సీబీఐ ఎస్పీ వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పష్టం చేసింది. 

అసలేం జరిగిందంటే..

అడ్డగూడూర్ పోలీస్​స్టేషన్‌ పరిధిలోని ఓ పాస్టర్​ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడకు చెందిన మరియమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ పేరుతో.. మరియమ్మను పోలీసులు కొట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. జూన్​ 18న మరియమ్మ పోలీస్​స్టేషన్​లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తీవ్రస్థాయిలో ఆందోళనలు వెల్లువెత్తగా.. పోలీసుల వైఖరిపై సీఎం కేసీఆర్​ ఫైరయ్యారు. బాధ్యులైన పోలీసులను విధుల నుంచి తొలిగించాలని డీజీపీకి ఆదేశాలిచ్చారు. ఓ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను అధికారులు డిస్మిస్​ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున నగదు పరిహారంతో పాటు.. మరియమ్మ కుమారునికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. 

సంబంధిత కథనాలు:

Last Updated :Nov 10, 2021, 8:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.