ETV Bharat / city

Weather news: భారీ వర్షాలు.. ఉప్పొంగుతున్న జలాశయాలు

author img

By

Published : Nov 12, 2021, 2:48 PM IST

Updated : Nov 12, 2021, 3:56 PM IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో కుండపోత వానలు(heavy rains) కురుస్తున్నాయి. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు ప్రమాదక స్థితికి చేరాయి. అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.

Weather news, rains today news
వర్షాల వార్తలు, వాతావరణ నివేదిక

అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్​లో భారీ వర్షాలు(heavy rains) కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల జనవాసాల్లోకి వరద నీరు చేరటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

కడప జిల్లా..
అల్పపీడన ప్రభావం వల్ల కడప జిల్లాలో రెండు రోజులగా భారీ వర్షాలు(heavy rains in kadapa district) కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నగరంలోని పలు రోడ్లు కాలువను తలపిస్తున్నాయి. జిల్లాలోని బుగ్గవంక ఉదృతంగా ప్రవహిస్తోంది. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు... బుగ్గవంక ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి 1,600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మరో రెండు గేట్లు ఎత్తే అవకాశం ఉందన్నారు. పలు మార్గాల్లో వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

తూర్పు గోదావరి జిల్లా
తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు (heavy rains in east godavari district)కురుస్తున్నాయి. అమలాపురం, కాకినాడ, రామచంద్రపురం,పెద్దాపురం, రాజమహేంద్రవరం, రంపచోడవరం డివిజన్లలో భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షాలుకు వరి పొలాలు నేల వాలాయి.

నెల్లూరు జిల్లా
అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు(heavy rains in nellore district) కురుస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో చెరువులు ప్రమాదకర పరిస్థితికి చేరాయి. సైదాపురం మండలం కలిచేడు గ్రామ చెరువుకు గండిపడి.. నీరంతా వృథాగా పోతోంది. మనుబోలులో కండలేరువాగు ఉరకలేస్తోంది. రోడ్డుపై నుంచి వరద ప్రవహిస్తుండటం వల్ల పెళ్లకూరు మండలంలోని వివిధ గ్రామాలకు రాకపోకలను నిలిపివేశారు.

శ్రీకాకుళం జిల్లా
శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు(heavy rains in srikakulam district) కురుస్తున్నాయి. శ్రీకాకుళం, గార, పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, భామిని, కొత్తూరు, సారవకోట, జలుమూరు మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఆమదాలవలస, సరుబుజ్జిలి, హిరమండలం, నరసన్నపేట, కోటబొమ్మాళి, లావేరు మండలాల్లో తేలికపాటి వాన పడుతోంది. వర్షాలకు అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు
కాగా.. రాగల 24 గంటల్లోనూ ఏపీవ్యాప్తంగా చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టు ఆ రాష్ట్రవిపత్తు నిర్వహణశాఖ కమిషనర్ కె.కన్నబాబు వెల్లడించారు. అత్యవసర సహాయ చర్యల కోసం చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పంపించినట్టు స్పష్టం చేశారు.

మరో అల్పపీడనం
మరోవైపు ఈ నెల 13 తేదీన అండమాన్ తీరప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు వెల్లడించారు. నవంబరు 17 తేదీనాటికి ఇది మరింత బలపడి కోస్తాంధ్ర వద్ద తీరాన్ని దాటే అవకాశమున్నట్టు విపత్తు నిర్వహణశాఖ అంచనా వేస్తోంది.

గురువారం తీరాన్ని దాటిన వాయుగుండం
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం చెన్నైకి సమీపంలో తీరాన్ని దాటింది. గడచిన 6 గంటలుగా గంటకు 4 కిలోమీటర్లవేగంతో కదిలిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ చెన్నైకి దిగువన తీరాన్ని దాటినట్టు వాతావరణశాఖ స్పష్టం చేసింది. వాయుగుండం భూభాగంపైకి వచ్చిన అనంతరం క్రమంగా బలహీనపడుతుందని వాతావరణశాఖ పేర్కొంది.

ఇదీ చదవండి: Harish rao Dharna: 'జై కిసాన్‌ను భాజపా ప్రభుత్వం నై కిసాన్‌గా మార్చింది'

Last Updated : Nov 12, 2021, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.