కృష్ణమ్మా.. ఎప్పుడు తీరేను మా కష్టాలు..?

author img

By

Published : Sep 20, 2022, 8:27 AM IST

Updated : Sep 20, 2022, 11:23 AM IST

Gurramgadda Island People Hardships

Gurramgadda Island : ఒక ఊరు నుంచి మరో ఊరు వెళ్లాలంటే రహదారులుండాలి. గతుకుల రోడ్లు ఉంటునే అడుగు ముందుకు పడదు. అలాంటిది ఆ ఊరు దాటాలంటే మాత్రం ఏకంగా ఏరే దాటాలి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తీరం చేరితేగాని బతుకు గడవదు. బోటులో ప్రయాణించే ప్రయాణికులకు కనీసం లైఫ్‌ జాకెట్లు కూడా లేకపోవడం ఇక్కడి అధికారుల నిరక్ష్యానికి అద్దం పడుతోంది. వానాకాలం వచ్చినా.....నది ఉప్పొంగిన బాహ్యప్రపంచంతో ఆ ఊరికి సంబంధాలు తెగిపోతాయి. కాంట్రక్టర్‌ అలసత్వంతో.... వంతెన నిర్మాణం జరగక దశాబ్దాలుగా కష్టాల కడలిని ఈదుతోంది జోగులాంబ గద్వాల జిల్లాలోని గుర్రంగడ్డ దీవి..

గుర్రంగడ్డ దీవి ప్రజలు పడుతున్న కష్టాలు

Gurramgadda Island : చుట్టూ ఏరు.. మధ్యలో ఊరు.. ఊరు నుంచి బయటికి వెళ్లాలంటే నది దాటాల్సిందే. అందుకోసం నిత్యం సాహసకృత్యాలు చేయక తప్పదు. బ్రిడ్జి నిర్మిస్తామని దశాబ్దాలుగా పాలకులు ఇస్తున్న హామీలు నీటి ముటలుగానే మిగిలిపోయాయి. రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలోని కృష్ణానది మధ్యలో ఉన్న గుర్రంగడ్డ దీవి ప్రజలు పడుతున్న కష్టాలివి.

Gurramgadda Island People Hardships : 900 మంది జనాభా ఉండే ఈ గ్రామంలో 2500 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 1050 ఎకరాల్లో నీటి ఆధారిత పంటలను, 350 ఎకరాల్లో వర్షధార పంటలు సాగుచేస్తున్నారు. నది మధ్యలో ఉన్న ఈ గ్రామానికి బయటి ప్రాంతాలతో సంబంధం లేదు. సరకులు కొనాలన్నా, పాఠశాలకు , ఆస్పత్రికి వెళ్లాలన్నా.. ముందుగా నదిని దాటాలి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బోటులో ప్రయాణాలు సాగిస్తున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కానరాని వంతెన నిర్మాణం.. వర్షకాలంలో నది ఉప్పొంగే సమయంలో బయటికి సంకటంగా మారుతోంది. ఎగువ ప్రాంతాల్లోని వర్షాలతో గత కొన్ని రోజులుగా జూరాల ప్రాజెక్టు ఉగ్రరూపం దాల్చింది. దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోతున్నారు. 2009లో ఇనుప రాళ్ల వంతెనను ప్రభుత్వం మంజూరు చేసింది. కొన్నాళ్లకు అది రద్దు చేసి కాంక్రిట్‌ వంతెనకు రూపకల్పన చేసినా అది కార్యరూపం దాల్చలేదు.

ఇంకా నేరవేరని ముఖ్యమంత్రి హామీ.. 2018లో సీఎం కేసీఆర్ 6 నెలల్లో వంతెన నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించినప్పటికీ ఏడాది వరకు పనులు ప్రారంభం కాకపోవడం విడ్డూరంగా అనిపిస్తోంది. 2019లో పనులు ప్రారంభించినప్పటికీ కాంట్రక్టర్‌ నిర్లక్ష్యం కారణంగా 15 పిల్లర్లు మాత్రమే వేసి చేతులు దులుపుకున్నారు. వరద వచ్చే సమయంలో పనులు ప్రారంభించి, వరద సాకు చూపించి పనులు పెండింగ్‌ పెడుతూ కాంట్రక్టర్‌ నత్తనడత వంతెన పనులు సాగిస్తున్నారు.

బ్రిడ్జి నిర్మాణం పనులు నత్తనడకగా సాగుతుండటంపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి వెంటనే వంతెన నిర్మాణం పూర్తి చేయాలని గుర్రంగడ్డవాసులు కోరుతున్నారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే తమ పిల్లలు చదువుకోవడానికి వీలుగా ఉంటుందని, వారి భవిష్యత్​ బాగుంటుందని తెలిపారు.

Last Updated :Sep 20, 2022, 11:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.