ETV Bharat / city

GANDHI ISSUE: 'రేపిస్టు అన్న వార్తలు కలిచివేశాయి.. జీవితంపై ఆశ కోల్పోయా'

author img

By

Published : Aug 21, 2021, 5:52 AM IST

Updated : Aug 21, 2021, 9:17 AM IST

రేపిస్టు అని వార్తలు, కథనాలు రావటం తననేంతో బాధించాయని ఆవేదన వ్యక్తం చేశాడు గాంధీ ఆసుపత్రి రేడియోగ్రాఫర్‌ ఉమామహేశ్వర్‌. దూరపు బంధువులని సాయం చేసినందుకు ఇలా ఎలా నాపై ఇంతటి ఘోరమైన ముద్ర వేస్తారని కన్నీరుమున్నీరయ్యారు. నిజాన్ని తెలుసుకుని తనను వదిలిపెట్టినందుకు పోలీసులకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు.

gandhi hospital radiographer umamaheshwar  sad moments with etv bharat
gandhi hospital radiographer umamaheshwar sad moments with etv bharat

‘‘ఆగస్టు 16.. మధ్యాహ్నం భోంచేస్తుండగా.. చిలకలగూడ పోలీసులు ఫోన్‌ చేసి రావాలన్నారు. భోజనం వదిలేసి వెళ్లా.. ఆసుపత్రిలో ఏదైనా విషయం కోసమనుకున్నా.. ఠాణా సమీపంలో మీడియా ప్రతినిధులుండడంతో కంటపడకుండా లోపలికి తీసుకెళ్లారు. అక్కడ మా దూరపు బంధువు ఉంది. ఏం జరిగిందమ్మా.. అంటూ పోలీసులు అడగ్గా.. నా వైపు చూపించి అతను, మరికొందరు సామూహిక అత్యాచారం చేశారంటూ చెప్పింది. కంగుతిన్నా.. ఆ క్షణం.. జీవితంపై ఆశ కోల్పోయా.. 2 గంటలపాటు నన్ను కఠినంగా ఇంటరాగేట్‌ చేశారు. తమదైన శైలిలో ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు. నేను ఏ నేరం చేయలేదని మొత్తుకున్నా.. అనుమానంతో అన్నిరకాలుగా ప్రశ్నించారు. ఇక జైలేగతి అనుకున్నా.. కొన్నిగంటల తరువాత పోలీసు ఉన్నతాధికారి ‘ఆ ఘటనకు నీకు సంబంధం లేకపోతే ధైర్యంగా ఉండు’ అనడంతో ఊపిరి పీల్చుకున్నా. నిర్దోషిగా తేలిన తరువాత బుధవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌ సీపీ కార్యాలయానికి తీసుకెళ్లారు. కమిషనర్‌ అంజనీకుమార్‌ గదిలోకి పంపారు.. నీకు.. సామూహిక అత్యాచారానికి సంబంధంలేదు. సంతోషంగా ఇంటికి వెళ్లు అన్నారు. బయటకొచ్చి గట్టిగా ఊపిరి పీల్చుకున్నా. లాంఛనాలన్నీ పూర్తిచేశాక గురువారం రాత్రి వదిలేశారు. ఇంటికెళ్లగానే.. కుమారుడు, కుమార్తెను గట్టిగా గుండెలకు హత్తుకున్నా.. అరగంటపాటు ఏడుస్తూనే ఉన్నా. అమ్మ, నా భార్య ఓదార్చడంతో ఈ లోకంలోకి వచ్ఛా. రేపిస్టు అన్న వార్తలు కలిచివేశాయి. ఇప్పుడిప్పుడే బయటపడుతున్నా’’ అని గాంధీ ఆసుపత్రి రేడియోగ్రాఫర్‌ ఉమామహేశ్వర్‌ కన్నీరుమున్నీరయ్యారు.

సాయం చేయడమే తప్పా..

"మహబూబ్‌నగర్‌లో ఉంటున్న దూరపు బంధువుకు మూత్రపిండాల వ్యాధి ఉందంటే గాంధీ ఆసుపత్రిలో చేర్పించా. అతనికి సాయంగా వచ్చిన ఇద్దరు మహిళలకు ఏం కావాలన్నా అడగండని చెప్ఫా. కల్లు తాగుతారని బంధువు చెప్పడంతో ఆసుపత్రిలో దొరకదని చెప్ఫా. ఒక మహిళా సెక్యూరిటీ గార్డును వారిని గమనిస్తూ ఉండమని అభ్యర్థించా. ఆగస్టు 13న రోగి మరదలు ఆసుపత్రిలో కనిపించడంతో రోగి కొడుకుకు ఫోన్‌చేసి ఇంటికి తీసుకెళ్లమని చెప్ఫా. 15న గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో రోగి మరదలు అరకొర దుస్తులతో ఉండడాన్ని గమనించి ఆమెకు దుస్తులు వేయించడని ఫోన్‌ చేశా. అదే రోజు సాయంత్రం రోగి కొడుకు వచ్చి ఆమెను తీసుకెళ్లాడు. మరుసటిరోజు సామూహిక అత్యాచారం చేశారంటూ పోలీసులకు చెప్పడంతో సాయం చేసినందుకు ఇదా బహుమతి అంటూ బాధపడ్ఢా. గ్యాంగ్‌ రేప్‌కేస్‌ అంటే జీవితాంతం జైల్లోనే ఉండాలంటూ పోలీసులు అనడంతో చేష్టలుడిగిపోయా.

కొత్వాల్‌ అంజనీకుమార్‌, డీసీపీ కల్మేశ్వర్‌లకు సలాం..

ఇంటరాగేషన్‌లో రెండో రోజు రాత్రి టాస్క్‌ఫోర్స్‌ సీఐ నాగేశ్వరరావు గంటసేపు ప్రశ్నించారు. సంబంధం లేకపోతే నిజాలు చెప్పు అన్నారు. మూడోరోజు ఆయన టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావ్‌కు నా మాటలు చెప్పారు. అదేరోజు రాత్రి డీసీపీ కల్మేశ్వర్‌ శింగన్వార్‌ పిలిపించారు. ఈ కేసులో నీకు సంబంధం లేదని ఆధారాలు లభించాయని చెప్పారు. సీపీ అంజనీకుమార్‌ వద్దకు తీసుకెళ్లారు. నే చెప్పింది విన్న ఆయన.. మీకు సంబంధం లేదు.. ఇంటికి వెళ్లండన్నారు. ఎంతో సౌమ్యంగా మాట్లాడారు. సీపీకి, డీసీపీ కల్మేశ్వర్‌కు నా సలాం..

ఇద్దరికీ కృతజ్ఞతలు...

నన్ను అరెస్ట్‌ చేశారని తెలిసి అనారోగ్యంతో ఉన్న అమ్మ.. 11 నెలల కుమార్తెతో నా భార్య చిలకలగూడ ఠాణాకు వచ్చారు. నా భర్త అలాంటి వాడు కాదు.. మీ కాళ్లు పట్టుకుంటా వదిలేయండంటూ వేడుకున్నారు. సర్దిచెప్పి వారిని పంపించేసి, నన్ను టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయానికి తీసుకెళ్లారు. మూడు రోజులు చిత్రవధ అనుభవించాను. ఇరుగుపొరుగు ఇదేంటని అడిగితే.. అంతా అబద్ధమని.. నిజం నిలకడ మీద తెలుస్తుందని చెప్పారు. నా భార్య తన కుటుంబ సభ్యులకూ చెప్పలేదు. వారిద్దరికీ లక్షల కృతజ్ఞతలు." - గాంధీ ఆసుపత్రి రేడియోగ్రాఫర్‌ ఉమామహేశ్వర్‌

ఇదీ చూడండి:

Gandhi Hospital Rape: గాంధీ ఘటనపై వీడిన మిస్టరీ.. అక్కాచెల్లెల్లపై ఆత్యాచారం కల్పితమే..!

Last Updated :Aug 21, 2021, 9:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.