ETV Bharat / city

ఆర్థిక సంఘం నియమాల అమలుకు కసరత్తు

author img

By

Published : Apr 10, 2021, 6:26 AM IST

finance commission
ఆర్థిక సంఘం నియమాల అమలుకు కసరత్తు

రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలు 15వ ఆర్థిక సంఘం నిధులు అందుకోవడానికి ప్రత్యేక కసరత్తును ప్రారంభించాయి. స్థానిక సంస్థలు ప్రాథమిక లెక్కలను ఆన్‌లైన్‌లో ఉంచితేనే జూన్‌లో కేంద్రం నుంచి నిధులు విడుదల కానున్నాయి.

రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలు 15వ ఆర్థిక సంఘం నిధులు అందుకోవడానికి ప్రత్యేక కసరత్తును ప్రారంభించాయి. మే 15లోపు కనీసం 25 శాతం గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలు ప్రాథమిక లెక్కలను ఆన్‌లైన్‌లో ఉంచితేనే జూన్‌లో కేంద్రం నుంచి నిధులు విడుదల కానున్నాయి. మొదటి రెండేళ్లు నిధులు అందుకోవడానికి ప్రత్యేక నిబంధనలు పాటించాలి. తర్వాత రెండేళ్లు అదనపు నిబంధనలుంటాయి. చివరి సంవత్సరం మరికొన్ని తోడవుతాయి. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్‌, పురపాలక శాఖలు వివరాలను సిద్ధం చేస్తున్నాయి. ఆర్థిక సంఘం రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు రూ.13,111 కోట్లను సిఫార్సు చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.2,037 కోట్లు అందనున్నాయి.

గ్రామీణ స్థానిక సంస్థల్లో ఇలా

  • 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాలకు నిధులు పొందాలంటే రాష్ట్రంలోని 25 శాతం స్థానిక సంస్థలు గత ఆర్థిక సంవత్సరం ప్రాథమిక లెక్కలను, అంతకుముందు సంవత్సరానికి ఆడిట్‌ చేసిన గణాంకాలను ఆన్‌లైన్‌లో ఉంచాలి.
  • ఆర్థిక సంఘం నిధులను వేతనాలు, కార్యాలయ నిర్వహణ వ్యయాలకు ఎట్టి పరిస్థితుల్లో వినియోగించకూడదు. ఇతరత్రా అవసరాలకు 40 శాతం వినియోగించుకోవచ్చు. ఈ నిధుల వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన బయట సంస్థలతో ఆడిట్‌ చేయించాలి.
  • 30 శాతం నిధులను తాగునీటి సరఫరా, వాననీటి సంరక్షణ లేదా మురుగునీటి శుద్ధి, పునర్వినియోగానికి వినియోగించాలి.
  • మరో 30 శాతం పారిశుద్ధ్యానికి ప్రధానంగా బహిరంగ మల విసర్జనలేకుండా చూసేందుకు వ్యయం చేయవచ్చు.

పట్టణ స్థానిక సంస్థల్లో...

  • గత ఆర్థిక సంవత్సరం ప్రాథమిక లెక్కలు, అంతకు ముందు ఏడాదికి సంబంధించి ఆడిట్‌ చేసిన లెక్కలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలి.
  • 2021-22, 2022-23 సంవత్సరాలకు 25 శాతం స్థానిక సంస్థల లెక్కలు ఆన్‌లైన్‌లో ఉంచితే సరిపోతుంది.
  • 2023-24 ఆర్థిక సంవత్సరానికి అన్ని పట్టణ స్థానిక సంస్థల వివరాలూ ఆన్‌లైన్‌లో ఉంచాల్సిందే.
  • ఒక వేళ 35 శాతం పట్టణ స్థానిక సంస్థలే ఈ లెక్కలను ఆన్‌లైన్‌లో ఉంచితే కేటాయించిన మొత్తంలో 35 శాతం నిధులు మాత్రమే అందుతాయి.

ఇదీ చదవండి: అన్ని జిల్లాల్లోనూ ప్రత్యేక ల్యాబ్‌లు.. అందుబాటులోకి టిమ్స్‌, ఎయిమ్స్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.