ETV Bharat / city

కరెంటు బిల్లు కట్టమంటూ కాల్స్, లిఫ్ట్ చేశారో బుక్కయ్యారే

author img

By

Published : Aug 18, 2022, 9:11 AM IST

fake calls of cyber criminals
fake calls of cyber criminals

fake calls of cyber criminals మీరు మీ కరెంట్ బిల్లు ఇంకా కట్టలేదు. ఇప్పటికిప్పుడు బిల్లు కట్టకపోతే మీ విద్యుత్ సరఫరా కట్ చేస్తాం. ఇలాంటి సడెన్ కాల్స్ మీకు వస్తున్నాయా. అయితే మీరు తప్పక జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే సైబర్ కేటుగాళ్లు అమాయకులకు వల వేసేందుకు మరో పంథాను ఎంచుకున్నారు. వారి మాటలు నమ్మి బాధితులు మోసపోతున్నారు. చివరకు డబ్బంతా కోల్పోయి పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

fake calls of cyber criminals : ఓటరు గుర్తింపుకార్డు.. ఆధార్‌ మార్పులు.. బహుమతులు.. వివాహ పరిచయ వేదికలు కావేవీ మోసానికి అనర్హం అన్నట్టుగా మాయగాళ్లు రెచ్చిపోతున్నారు. వాటిపై ప్రజల్లో అవగాహన పెరగడంతో కొత్త మార్గాలను ఎంచుకొని బురిడీ కొట్టిస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లోని సొమ్మంతా స్వాహా చేస్తున్నారు. ప్రస్తుతం సైబర్‌ నేరస్థులు విద్యుత్‌ బిల్లులు బకాయిలు చెల్లించాలని..లేకుంటే రాత్రికి రాత్రే సరఫరా నిలిపివేస్తామంటూ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. ఇదంతా నిజమని భావించి వారు చెప్పినట్టు చేసి డబ్బు నష్టపోతున్నారు. బాధితుల్లో ఉన్నత విద్యావంతులు, ఉద్యోగులు కూడా ఉండటం గమనార్హం. నగర సైబర్‌క్రైమ్‌ పోలీసులు ఈ ఏడాది ఇప్పటి వరకూ 15 కేసులు నమోదు చేస్తే.. వాటిలో 5 ఫిర్యాదులో వారం వ్యవధిలోనే రావటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కొద్ది మొత్తంలో సొమ్ము పోగొట్టుకున్న బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావట్లేదని సమాచారం.

ఎలా మోసగిస్తున్నారంటే..

ఎలా మోసగిస్తున్నారంటే.. ‘మీరు చెల్లించాల్సిన విద్యుత్‌ బిల్లులు సకాలంలో చెల్లించలేదు. ఒకవేళ చెల్లించినట్టయితే రికార్డుల్లో సర్దుబాటు కాలేదని గమనించాలి. ఈ రోజు రాత్రి 9-10 గంటల్లోపు బకాయిలు జమ చేయకుంటే విద్యుత్తు సరఫరా నిలిపివేస్తాం. వెంటనే మీరు కింద పేర్కొన్న విద్యుత్‌ కార్యాలయం నంబర్‌కు ఫోన్‌ చేయండి’. పని ఒత్తిడిలో ఉన్నపుడు ఏ మధ్యాహ్నమో.. రాత్రివేళో సెల్‌ఫోన్‌కు ఇటువంటి సందేశం వస్తే సహజంగానే ఉలిక్కి పడతారు. ఈ బలహీనతే మాయగాళ్లు అవకాశంగా మార్చుకుంటున్నారు. బకాయి చెల్లిద్దామనే ఉద్దేశంతో మాయగాళ్లు పంపిన నంబర్‌కు ఫోన్‌ చేశారో అంతే సంగతులు. ఆన్‌లైన్‌ ద్వారా నగదు చెల్లించే అవకాశం ఉందంటూ నమ్మకంగా మాట్లాడతారు. తమ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుని చెల్లింపులు జరపొచ్చంటూ మొబైల్‌కు లింకు పంపుతారు. బాధితులు లింక్‌ను క్లిక్‌ చేయగానే టైమ్‌వ్యూయర్‌, ఎనీడెస్క్‌ యాప్‌లు డౌన్‌లోడ్‌ అవుతాయి. ప్రస్తుతం మాయగాళ్లు క్విక్‌షేర్‌ యాప్‌ కూడా ఉపయోగిస్తున్నారు. ఆ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోగానే బాధితుల ఆన్‌లైన్‌ లావాదేవీలు మోసగాళ్ల చేతిలోకి చేరతాయి. బాధితులు నగదు చెల్లింపులకు ఉపయోగించే క్రెడిట్‌/డెబిట్‌కార్డు వివరాలు, ఓటీపీ నంబర్లు పసిగడతారు. నగదు జమచేయగానే బాధితుల ఫోన్‌నంబర్లు బ్యాంకులు పంపే సందేశాలను తొలగిస్తూ జాగ్రత్త పడతారు. బ్యాంకులో ఎంత నగదు నిల్వ ఉందో పసిగట్టి సొమ్మంతా కాజేసే వరకూ లావాదేవీలు నిర్వహిస్తారు.

నమ్మారు... నష్టపోయారు.. బేగంపేట్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగికి విద్యుత్తు బిల్లులు బకాయిలు వెంటనే చెల్లించమంటూ ఫోన్‌ నంబర్‌కు సందేశం రాగానే స్పందించారు. ఎనీడెస్క్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ముందుగా రూ.10 పంపి దఫాలవారీగా రూ.3.60లక్షలు నష్టపోయారు. హబ్సిగూడ నివాసి శ్రీనివాస్‌ క్విక్‌షేర్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని రూ.1.61లక్షలు, తార్నాకకు చెందిన శాస్త్రి రూ.1.05లక్షలు.. ఇలా ఇప్పటి వరకూ నేరగాళ్లు రూ.20-25లక్షలు కొట్టేసినట్టు పోలీసులు తెలిపారు.

కంగారుపడొద్దు.. గుడ్డిగా నమ్మొద్దు.. "విద్యుత్‌ బిల్లులు చెల్లించకుంటే సరఫరా ఆపేస్తామన్న సందేశం రాగానే కంగారుపడొద్దు. మాయగాళ్లు పంపే మొబైల్‌ నంబర్‌కు ఫోన్‌ చేయవద్దు. అప్పటికే బిల్లులు చెల్లించినా/చెల్లించకున్నా సందేశాలు రావని గుర్తుంచుకోండి. సంస్థ అధికారిక వెబ్‌సైట్లలో విద్యుత్తు మీటర్ల యూనిక్‌ సర్వీసు నెంబర్లతో వాస్తవాలు తెలుసుకోండి. సమీప కార్యాలయంలో ఆరా తీయండి. మోసగాళ్లు పంపే లింకులను క్లిక్‌ చేయడం, యాప్‌లు డౌన్‌లోడ్‌తో ఖాతాలో సొమ్మంతా నష్టపోతారు. మోసపోయినట్టు గ్రహించగానే డయల్‌ 100, 1930 నంబర్లలో ఫిర్యాదు చేయండి." - కె.వి.ఎం.ప్రసాద్‌, ఏసీపీ, సైబర్‌క్రైమ్‌ హైదరాబాద్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.