ETV Bharat / city

'దేశంలో ప్రతి 10 ఉద్యోగాల్లో 3 తెలంగాణ ఐటీ రంగమే కల్పిస్తోంది'

author img

By

Published : Mar 7, 2022, 5:36 PM IST

సుస్థిరమైన ప్రభుత్వం, మేలైన శాంతి భద్రతలతో తెలంగాణ జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తోందని అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు వెల్లడించారు. రాష్ట్రంలో కరెంటు కష్టాలు లేవని... 24 గంటలు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలుగా 2 వేల కోట్లు, పరిశ్రమలకు విద్యుత్ రాయితీ కింద 190 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వాడకం, రవాణాపై పోలీసు శాఖ ఉక్కుపాదం మోపుతోందని వెల్లడించారు.

employees
employees

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ మరింత పెరిగిందని... సుస్థిరమైన ప్రభుత్వం, సుపరిపాలన, మేలైన శాంతి భద్రతలు నెలకొనడంతో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని బడ్జెట్‌ ప్రసంగంలో మంత్రి హరీశ్‌ రావు వెల్లడించారు.

17,921 పరిశ్రమలకు అనుమతులు

టీఎస్​ ఐపాస్‌ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 17,921 పరిశ్రమలకు అనుమతులు వచ్చాయని వెల్లడించారు. ఐటీ రంగంలోనూ తెలంగాణ దూసుకుపోతోందని... 1,500లకు పైగా చిన్న, పెద్ద ఐటీ పరిశ్రమలో హైదరాబాద్‌ కార్యకలాపాలు సాగిస్తున్నాయని వెల్లడించారు. దేశంలో ఐటీ పరిశ్రమలో కొత్తగా ఏర్పడుతున్న ప్రతి 10 ఉద్యోగాల్లో 3 తెలంగాణ ఐటీ రంగమే కల్పిస్తోందని హరీశ్​ రావు పేర్కొన్నారు.

ఏకైక రాష్ట్రం తెలంగాణ

కరెంటు కష్టాలకు చరమగీతం పాడిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కిందని తెలిపారు. 24 గంటల పాటు నాణ్యమైన కరెంటును అన్ని రంగాలకు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. తలసరి విద్యుత్తు వినియోగ వృద్ధిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. 7,778ల మెగావాట్లున్న విద్యుత్‌ సామర్థ్యాన్ని... 17,305 మెగావాట్లకు పెంచుకున్నామని హర్షం వ్యక్తం చేశారు.

శాంతి భద్రతలకు పెద్దపీట

రాష్ట్రంలో శాంతి భద్రతలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని హరీశ్​ రావు తెలిపారు. అరాచక శక్తులపై ఉక్కుపాదం మోపేందుకు రాజీలేని వైఖరిని అవలంభిస్తోందని అన్నారు. పోలీసు శాఖకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించామని వివరించారు. మాదక ద్రవ్యాల రవాణా అరికట్టేందుకు పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు.

ఇదీ చదవండి : 'రూ.50 వేలలోపు రైతు రుణాలు మార్చిలోపు మాఫీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.