ETV Bharat / city

ఆంక్షల పునరావాసం.. వారసత్వ హక్కులే తప్ప అమ్ముకోలేమంటా..!

author img

By

Published : Jun 20, 2022, 5:20 AM IST

Expatriates tension about  Conditions in the allocation of places
Expatriates tension about Conditions in the allocation of places

తరతరాలుగా నివసిస్తున్న ఇంటిని, పుట్టినప్పటి నుంచీ గ్రామంతో పెనవేసుకున్న ఆత్మీయ బంధాలనూ ప్రాజెక్టుల కోసం విడిచివెళ్తున్నా.. తమ త్యాగాలకు కనీస గుర్తింపునూ ఇవ్వడం లేదని నిర్వాసిత కుటుంబాలు వాపోతున్నాయి. గ్రామాల్లోని విలువైన తమ ఇళ్లను, భూమిని స్వాధీనం చేసుకుంటున్న రెవెన్యూశాఖ.. తమకు కేటాయిస్తున్న స్థలాలకు షరతులు విధిస్తుండటంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.

గతంలో కన్నా ఇప్పుడు భూముల ధరలు బాగా పెరిగాయి. ప్రాజెక్టుల నిర్మాణంలో తాము కోల్పోతున్న ఇళ్లు, భూములకు ప్రభుత్వం చెల్లిస్తున్న ధర బహిరంగ మార్కెట్‌ కంటే చాలా తక్కువగా ఉంటోంది. నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఇంటిని నిర్మించుకునేందుకు ప్రభుత్వం అందిస్తున్న పరిహారం ఏమూలకూ సరిపోవడం లేదు. పైగా, పునరావాసం కల్పించేందుకు ఇస్తున్న భూములకు నిబంధనలు పెడుతోంది. వారసత్వ హక్కులు తప్ప అధికారాలు కల్పించకపోవడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో విక్రయించే అవకాశం కూడా లేకుండా పోతోందని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎసైన్డ్‌ నిబంధనలు వర్తిస్తాయట..

పునరావాసం, పునరాశ్రయంలో భాగంగా నీటిపారుదల, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా ముంపు బాధితులకు నివాస స్థలాలు కేటాయిస్తున్నాయి. రాష్ట్రంలో పాలమూరు-రంగారెడ్డి, డిండి, నిజామాబాద్‌ జిల్లాలో కాళేశ్వరం ప్యాకేజీలు, ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మల్లన్నసాగర్‌ ముంపు ప్రాంతాల్లోని వారికి పునరావాసం కింద ప్రభుత్వం స్థలాలు కేటాయిస్తోంది. కొన్ని జిల్లాల్లో అవార్డు ప్రకారం ఇళ్లు కూడా నిర్మించి ఇస్తోంది. అయితే, బాధితులకు కేటాయించే స్థలాలపై కనీస హక్కులు కల్పించకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై రెవెన్యూ శాఖకు చెందిన ఓ సీనియర్‌ అధికారిని ‘ఈనాడు’ సంప్రదించగా.. ఆర్‌ అండ్‌ ఆర్‌ చట్టం ప్రకారం నిర్వాసితులకు కేటాయిస్తున్న భూములకు ‘ఎసైన్డ్‌’ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నారు.

హక్కు పత్రాల వెనుక 11 నిబంధనలు

డిండి ఎత్తిపోతల కింద నిర్మిస్తున్న జలాశయంలో ముంపునకు గురవుతున్న నల్గొండ జిల్లా చింతపల్లి, నాంపల్లి, మర్రిగూడ మండలాల్లోని నిర్వాసిత కుటుంబాలకు చింతపల్లి శివారులో నివాస స్థలాలు కేటాయిస్తున్నారు. వారికి ఇస్తున్న హక్కు పత్రాల వెనుక 11 రకాల నిబంధనలు చేర్చారు. ఇదే తరహాలో.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులోని ముంపు గ్రామాల వారికీ షరతులతో కూడిన హక్కు పత్రాలు అందజేస్తున్నారు. ఈ నిబంధనలపై నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము సర్వం కోల్పోయామని.. వెంటనే ఇళ్లు కట్టుకోలేని దుస్థితిలో ఉన్నామని వాపోతున్నారు. పట్టాగా మార్చి ఇస్తే తమ పిల్లల చదువులకు, అత్యవసరాలకు ఎవరి వద్దనైనా తాకట్టు పెట్టి డబ్బు తీసుకునేందుకు ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఇస్తున్న భూములకు క్రమబద్ధీకరణ హక్కులు కల్పించాలని కోరుతున్నారు.

కొన్ని నిబంధనలిలా..

  • ఇంటి స్థలం కేటాయించిన తేదీ నుంచి ఆరు నెలల్లోనే స్వాధీనం చేసుకోవాలి. ఏడాదిలోపు ఇల్లు నిర్మించుకుని.. లబ్ధిదారుడు స్వయంగా కాపురం ఉండాలి. రెవెన్యూశాఖ అనుమతించిన లేఅవుట్‌ ప్రకారమే ఇల్లు కట్టుకోవాలి.
  • అయిదేళ్ల తరువాత ఇంటి స్థలాన్ని విక్రయించదలచుకుంటే రెవెన్యూ అధికారి నుంచి అనుమతి తీసుకోవాలి. వారసత్వ బదిలీకి మాత్రమే అనుమతి ఉంటుంది.
  • ఇంటి స్థలం విక్రయం, తనఖాకు అనుమతి తీసుకోవాలి. ఈ భూమికి అనుమతితోనే రిజిస్ట్రేషన్‌ ఉంటుంది. ప్రభుత్వ సంస్థలు, బ్యాంకుల నుంచి మాత్రమే రుణం పొందడానికి, తాకట్టుకు అనుమతి ఉంటుంది.
  • నిబంధనలను ఉల్లంఘిస్తే నోటీసు లేకుండానే హక్కుపత్రం రద్దుచేస్తుంది. స్థలంలోని కట్టడాలకు పరిహారమివ్వకుండానే స్వాధీనపర్చుకుంటారు.
  • కేటాయించిన స్థలంలో ఉండే నిధి నిక్షేపాలపై ప్రభుత్వానికే హక్కు ఉంటుంది. భవిష్యత్తులో ఏవైనా అవసరాలకు భూమి కావాల్సి వస్తే పరిహారం ఇచ్చి వెనక్కు తీసుకుంటుంది.
  • లబ్ధిదారు తనకు స్థలం అవసరం లేదని భావిస్తే రూ.50 అఫిడవిట్‌ రూపంలో వాంగ్మూలం పొందుపర్చి రెవెన్యూ అధికారికి ఇవ్వాలి.
.

మీకు కేటాయిస్తున్న ఇంటి స్థలాన్ని ఇతరులకు విక్రయించడానికి అధికారం లేదు. వారసత్వ హక్కులు తప్ప ఇతర అధికారాలేవీ ఉండవు. ప్రైవేట్‌లో తాకట్టు పెట్టడానికి, దీనిపై అప్పు తీసుకోవడానికి వీల్లేదు. భవిష్యత్తులో ప్రభుత్వానికి ఈ స్థలం అక్కరకొస్తుందని భావిస్తే ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే స్వాధీనం చేసుకుంటుంది’’.. నిర్వాసితులకు ఇంటి స్థలాల కేటాయింపులో ప్రభుత్వం విధిస్తున్న నిబంధనలివి. జలాశయాల నిర్మాణంలో సర్వం కోల్పోయిన తమ పునరావాసానికి కేటాయిస్తున్న స్థలాలపై కఠిన నిబంధనలు పెట్టడం ఎంతమేరకు సబబని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.