ETV Bharat / city

etela rajender: 31న భాజపాలో చేరిక.. లేదంటే జూన్‌ 1, 2 తేదీల్లో!

author img

By

Published : May 28, 2021, 7:21 AM IST

మాజీ మంత్రి ఈటల రాజేందర్​ భాజపాలో చేరికకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ నెల 31న లేదంటే... జూన్​ 1, 2 తేదీల్లో దిల్లీ వెళ్లటం ఖాయమని సమాచారం. అంతకుముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటున్న ఈటల... భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకుంటారనే సమాచారం చక్కర్లు కొడుతోంది.

etela rajender joining in bjp on 31 may in delhi
etela rajender joining in bjp on 31 may in delhi

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను పార్టీలో చేర్చుకునే ముహూర్తంపై కమలనాథులు కసరత్తు మొదలుపెట్టారు. తొలుత ఈ నెల 30వ తేదీ అనుకున్నారు. ఆ రోజు కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చి ఏడేళ్లవుతున్న సందర్భంగా పార్టీ కార్యక్రమాలు ఉండటం వల్ల మే 31న దిల్లీకి వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. లేదంటే జూన్‌ 1, 2 తేదీల్లో వెళ్లడం ఖాయమని పార్టీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. ఈటలతో పాటు తెరాస మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి దిల్లీకి వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో భాజపాలో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. అంతకు ముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే యోచనలో ఈటల ఉన్నట్లు సమాచారం.

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, మరికొందరు భాజపా ముఖ్యనేతలు ఈటలతో పాటు హైదరాబాద్‌ నుంచి దిల్లీకి వెళ్లనున్నారు. ఈటల చేరిక విషయంపై బండి సంజయ్‌ పార్టీ జాతీయ నాయకత్వంతో గురువారం వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడినట్లు సమాచారం. చేరికకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నాయకత్వం తేదీ విషయాన్ని ఖరారుచేయాలని రాష్ట్ర నాయకత్వానికి సూచించినట్లు తెలిసింది. అంతకుముందు ఉదయం కిషన్‌రెడ్డి ఈటలతో ఫోన్‌లో మాట్లాడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. హోంశాఖకు సంబంధించిన వ్యవహారాల నేపథ్యంలో కిషన్‌రెడ్డి గురువారం సాయంత్రం దిల్లీకి వెళ్లారు. ఆయన శుక్రవారం సాయంత్రం లేదా శనివారం తిరిగివచ్చే అవకాశం ఉండటం వల్ల ఈటల చేరిక ఆ తర్వాత ఉండేలా భాజపా నేతలు కసరత్తు చేస్తున్నారు.

జరిగిన అన్యాయంపై జనంలోకి వెళ్లాలి

భాజపాలోకి ఈటల వెళ్లనున్నారన్న సమాచారం నేపథ్యంలో తెజస అధ్యక్షుడు కోదండరాం, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి... రాజేందర్‌ ఇంటికి వెళ్లారు. ఒత్తిడిలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించినట్లు సమాచారం. ‘భయపెట్టి పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేసి ఉప ఎన్నిక పెట్టించాలన్నది తెరాస వ్యూహంగా భావిస్తున్నా. మీరు ఇప్పుడు పార్టీ మారితే కేసులకు భయపడే వెళ్లారని ప్రజలు అనుకుంటారు. అదే జరిగితే మీతోపాటు, భాజపాకూ రాజకీయంగా లాభం ఉండదు. ఆరోపణలపై ముందు కేసీఆర్‌కు సవాలు విసరాలి. ఈ విషయంలో అందరం కలిసి పనిచేద్దాం’ అని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఈటలతో అన్నట్లు తెలిసింది. మీరు స్వతంత్రులుగా పోటీచేసినా, భాజపాలో చేరినా మద్దతిస్తామని, కేసీఆర్‌ వ్యతిరేక శక్తులకు నష్టం జరగకుండా చూడాలని చెప్పినట్లు సమాచారం. ‘కేసీఆర్‌కు వ్యతిరేకంగా గట్టిగా నిలబడితే మీ వెంట ఉంటాం. తొందరపాటుతో నిర్ణయాలు వద్దు. అభియోగాలు మోపింది తెరాసనే. నిర్ణయం తీసుకోవాల్సింది వారే. ప్రజల్లో సానుభూతి, రాష్ట్రస్థాయి నాయకుడిగా గుర్తింపు వచ్చింది. ఆ బలం నిలబడాలి. పెరగాలి. ఆ లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లి విస్తృతంగా తిరిగి మీకు జరిగిన అన్యాయం చెప్పాలి’ అని కోదండరాం సూచించినట్లు తెలిసింది.

ఈ సమావేశంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే, తెరాస నేత ఏనుగు రవీందర్‌రెడ్డి కూడా ఉన్నారు. భేటీ అనంతరం కోదండరాం మాట్లాడుతూ.. ఈటలను, ఆయన కుటుంబసభ్యుల్ని ఆరోపణల పేరుతో సీఎం కేసీఆర్‌ వేధిస్తున్నారని, ఇది అన్యాయమని మండిపడ్డారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈటల నిజంగా కబ్జాలకు పాల్పడి ఉంటే పార్టీ నుంచి ఎందుకు తొలగించడం లేదని సీఎంను ప్రశ్నించారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా వేదిక ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

మధ్యాహ్నం భాజపా నేతలతో ఈటల భేటీ

కోదండరాం, కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో సమావేశం అనంతరం ఈటల గురువారం మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడ భాజపా పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్‌ వెంకటస్వామి, మరి కొందరు నేతలతో కలిసి భోజనం చేశారు. కోదండరాంతో సమావేశంలో చర్చకు వచ్చిన విషయాలను ఈటల ప్రస్తావించినట్లు సమాచారం. పెద్దిరెడ్డి వ్యాఖ్యలను కూడా ఈటల చర్చించినట్లు, సమస్య లేకుండా చూడాలని భాజపా వర్గాలను కోరినట్లు తెలిసింది.

ఇదీ చూడండి: జేపీ నడ్డాతో త్వరలో ఈటల భేటీ.. భాజపాలో చేరిక ఖరారు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.