ETV Bharat / city

విద్యుక్తధర్మం: రెప్పపాటు విద్యుత్​ అంతరాయం లేకుండా..

author img

By

Published : May 18, 2021, 7:26 AM IST

కరోనా చికిత్సకు ఆక్సిజన్‌ ఎంత ప్రధానమో... నిరంతరాయ విద్యుత్‌ సరఫరా అంతే ముఖ్యం. వెంటిలేటర్‌లు, ఐసీయూల్లో రెప్పపాటున కరెంట్‌ పోయినా బాధితులకు ప్రాణగండంగా మారుతుంది. ఆక్సిజన్‌కు కొరత లేకుండా శ్రమిస్తున్న ప్రభుత్వం.. విద్యుత్‌ శాఖను అదేస్థాయిలో అప్రమత్తం చేసింది. కరెంట్‌ సరఫరాలో ఎలాంటి అంతరాయం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంది. కొవిడ్‌ మార్గదర్శకాలు పాటిస్తూ విద్యుత్‌ ఉద్యోగులు పవర్‌ వారియర్స్‌గా విద్యుక్తధర్మం నిర్వహిస్తున్నారు.

telangana Genco and transco
రెప్పపాటు కాలం కూడా విద్యుత్​ అంతరాయం లేకుండా..

రెప్పపాటు కాలం కూడా విద్యుత్​ అంతరాయం లేకుండా..

రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రులకు కరెంట్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడి.. కరోనా బాధితులకు ప్రాణ సంకటం కలగకుండా విద్యుత్‌శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కరోనా చికిత్స చేసే ఆసుపత్రులకు విద్యుత్ అంతరాయం కలగకుండా చేశారు. ప్రధానంగా హైదరాబాద్‌లోని కీలకమైన ఆసుపత్రులకు రెండు సబ్‌స్టేషన్‌ల నుంచి విద్యుత్ లైన్‌లను సిద్ధం చేశారు. ఒక లైన్‌లో అంతరాయం ఏర్పడితే మరో లైన్ నుంచి తక్షణమే కరెంట్‌ అందిస్తారు.

24 గంటల కంట్రోల్​ రూమ్​..

నిమ్స్, టిమ్స్, గాంధీ వంటి ఆసుపత్రుల్లో 24 గంటలపాటు నిరంతరం పనిచేసేలా సిబ్బందిని నియమించారు. విద్యుత్ సౌధ ప్రధాన కార్యాలయంలోనూ జెన్​కో, ట్రాన్స్​కో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి... 24 గంటలు అధికారులు నేరుగా పర్యవేక్షిస్తున్నారు. ఇంతచేసినా అకాల వర్షాల ముప్పుతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించామని ట్రాన్స్‌కో, జెన్​కో సీఎండీ ప్రభాకర్‌రావు వెల్లడించారు.

ప్రైవేటులోనూ..

రాష్ట్రంలోని 113 ప్రభుత్వ, 1050 ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్సలు అందిస్తున్నారు. ఆ ఆసుపత్రులన్నింటికి అదనపు విద్యుత్ సరఫరా చేస్తున్నామని విద్యుత్ శాఖ వెల్లడించింది. టిమ్స్, గాంధీ, నిమ్స్ వంటి ప్రధాన ఆసుపత్రులకు కరెంట్‌ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని తెలిపింది. చెస్ట్, ఫీవర్, కింగ్ కోఠి ఆసుపత్రులకూ అదనపు విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ విద్యుత్‌ సరఫరా ఇబ్బందులు తలెత్తకుండా సంస్థ నుంచి నోడల్ అధికారులను నియమించామన్నారు.

రాష్ట్రంలో ఆక్సిజన్‌ ఉత్పత్తి, రీ ఫిల్లింగ్‌ స్టేషన్‌ల వద్ద విద్యుత్‌ ఆటంకాలు లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. 130 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తికి సంబంధించిన రెండు ప్లాంట్లు.. 30 రీ ఫిల్లింగ్ స్టేషన్‌ల వద్ద జాగ్రత్తలు తీసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.