ETV Bharat / city

Millets Boosts Children Growth : చిరుధాన్యాలతో చిన్నారులకు ఎంతో మేలు

author img

By

Published : Jan 21, 2022, 6:51 AM IST

Millets Boosts Children Growth : పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పుట్టిన తర్వాత మొదటి మూడేళ్లు చాలా ముఖ్యమని ఇక్రిశాట్ సీనియర్ శాస్త్రవేత్త ఎస్.అనిత అన్నారు. అందుకే చిన్నారులకు బియ్యంతో కూడిన ఆహారం కంటే.. చిరుధాన్యాల ఆహారం అందజేయాలని సూచించారు. బియ్యంతో కూడిన ఆహారం కంటే చిరుధాన్యాల ఆహారం తీసుకునే పిల్లల్లో శారీరక వృద్ధి 26 నుంచి 39 శాతం ఎక్కువ ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని వెల్లడించారు.

Millets Boosts Children Growth
Millets Boosts Children Growth

Millets Boosts Children Growth : బియ్యంతో కూడిన ఆహారం తీసుకొనే వారికంటే చిరుధాన్యాల ఆహారం తీసుకొనే పిల్లల్లో శారీరక వృద్ధి 26 నుంచి 39 శాతం ఎక్కువగా ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని ఇక్రిశాట్‌కు చెందిన సీనియర్‌ శాస్త్రవేత్త ఎస్‌.అనిత పేర్కొన్నారు. ఇందులో ఉండే ప్రయోజనాల గురించి విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పుట్టిన తర్వాత మొదటి మూడేళ్లు చాలా ముఖ్యమన్నారు. చిరుధాన్యాల ఆధారంగా పిల్లలకు ఆహారం ఇవ్వడం వల్ల వృద్ధి ఎలా ఉంటుందన్న అంశంపై ఇక్రిశాట్‌తోపాటు యు.కె.లోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ న్యూట్రీషన్‌ అండ్‌ హెల్త్‌ యూనివర్సిటీ ఆఫ్‌ రీడింగ్‌, యునిసెఫ్‌, ఎన్‌.ఐ.ఎన్‌ (హైదరాబాద్‌), ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (థాయిలాండ్‌) తదితర సంస్థలకు చెందిన పరిశోధకులు కలిసి అధ్యయనం చేశారు. దీనికి నాయకత్వం వహించిన అనిత ‘ఈనాడు-ఈటీవీ భారత్​’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరుధాన్యాల ప్రభావం, వాటివల్ల ప్రయోజనాల గురించి వివరించారు. ‘ఈనాడు’తో ఇక్రిశాట్‌ సీనియర్‌ శాస్త్రవేత్త ఎస్‌.అనిత

ఇక్రిశాట్ శాస్త్రవేత్త అనిత

చిరుధాన్యాలపై మీ అధ్యయనంలో తేలిన ప్రధానాంశాలేంటి?

Millets Helps in Children Growth : బియ్యం, గోధుమలు, మొక్కజొన్నలతో సాంప్రదాయక ఆహారం తీసుకొనే వారికంటే చిరుధాన్యాలతో తీసుకొన్న వారిలో ఎలాంటి ప్రయోజనం ఉంటుంది.. పౌష్టికాహార లోపాన్ని అధిగమించవచ్చా? అన్నదానిపై ఈ అధ్యయనం జరిగింది. బియ్యానికి బదులు చిరుధాన్యాలతో ఆహారం ఇచ్చి పరిశీలించాం. రెండేళ్లలోపు, అయిదేళ్లలోపు, 5-10 ఏళ్లు, 11-19 ఏళ్ల మధ్య వయసుల వారీగా ఈ అధ్యయనం జరిగింది. బియ్యం ఆధారంగా ఆహారం తీసుకొనే వారికంటే చిరుధాన్యాలతో క్రమం తప్పకుండా తీసుకొనే పిల్లల్లో వృద్ధి ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. వృద్ధిని గుర్తించడానికి ఎత్తు, బరువు, జబ్బ, ఛాతిలను పరిగణనలోకి తీసుకొంటాం. బియ్యం ఆధారిత ఆహారం కంటే చిరుధాన్యాలతో తీసుకొన్న వారిలో వృద్ది 26 నుంచి 39 శాతం ఎక్కువగా ఉంది. ఎత్తు పరంగా 28.2 శాతం వృద్ధి ఉంటే, బరువు 26 శాతం, జబ్బలో 39 శాతం, ఛాతిలో ఎదుగుదల 37 శాతం ఉంది.

పిల్లల వృద్ధికి ఎలాంటి చిరుధాన్యాలు ఉపయోగం?

Millets are Good For Kids Growth : అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రాగులు పిల్లలకు చాలా ఉపయోగకరమైనవి. జొన్నలు కూడా చాలా మంచివని మేం చేసిన ఇంకో అధ్యయనంలో తేలింది. అన్ని చిరుధాన్యాలు (సామలు, సజ్జలు, రాగులు) కలిపి ఇవ్వడం కూడా చాలా మంచిదని మరో పరిశీలనలో తేలింది. భారతదేశంలో కూడా ఆహారంలోకి చిరుధాన్యాలను తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతోంది. 2018లో నేషనల్‌ మిల్లెట్‌ మిషన్‌ను కేంద్రం ప్రారంభించింది. 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. దీనిని బట్టి చిరుధాన్యాలకు ఉన్న ప్రాధాన్యం స్పష్టంగా తెలుస్తోంది. పోషకాల అవసరం వయసును బట్టి ఉంటుంది. యుక్త వయసులో అన్ని రకాల పోషకాలు అవసరమవుతాయి.

దేశంలో పౌష్టికాహార లోపం ప్రధాన సమస్యగా ఉందంటారా?

Millets are Good For Kids Health : పౌష్టికాహారలోపం ఇప్పటికీ ప్రధాన సమస్యే. ఐదేళ్లలోపు వయసున్న పిల్లల్లో 14.9 కోట్ల మంది ఎదుగుదల లేకుండా ఉన్నారు. మరికొంతమంది ఇతర సమస్యలతో ఉన్నారు. ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పుట్టిన తర్వాత మొదటి వెయ్యి రోజులు చాలా ముఖ్యం. ఆహార భద్రత, ఆకలిలో పిల్లల్లో పౌష్టికాహర లోపం ప్రధాన కొలమానం. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ది లక్ష్యం-2030 ప్రకారం ఆకలి సమస్యను అధిగమించడం ప్రధానం. కొన్ని దశబ్దాలుగా చేసిన కృషి వల్ల పౌష్టికాహరలోపం సమస్యను కొంతవరకు అధిగమించాం.

చిరుధాన్యాల్లో ఉన్న ప్రధానమైన పోషకాలు ఏంటి?

Millets Are Good For Health : చిరుధాన్యాల్లో పోషకాలు చాలా ఎక్కువ. ప్రొటీన్‌, ఐరన్‌, జింక్‌ ఇలా అన్నీ ఉంటాయి. రాగుల్లో కాల్షియం ఎక్కువ. పాలకంటే మూడు రెట్లుఎక్కువగా ఉంటుంది. మిల్లింగ్‌ చేసిన బియ్యం, రిఫైన్డ్‌ గోధుమ, మొక్కజొన్నలో ఇవి తక్కువ. సామల్లో ఐరన్‌ ఎక్కువగా ఉంటుంది. సజ్జలలో కాల్షియం అధికం. ఈ రెండింటిలో ప్రొటీన్‌ కూడా ఉంటుంది. చిరుధాన్యాల్లో సెలీనియం, జింక్‌ పోషకాలు, ఫైబర్‌ ఉంటాయి. రక్తం, గ్లూకోజు స్థాయిలో అకస్మాత్తుగా పెరగకుండా ఇవి దోహదపడతాయి. చక్కెరవ్యాధిని నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. మలబద్ధకం రాకుండా చూడటంలో ఫైబర్‌ పాత్ర చాలా ముఖ్యం.

వీటి వైపు ప్రజలు మళ్లీ మొగ్గుచూపే అవకాశం ఉందా?

Millets Helps to Increase Height : పోషకాహార విలువలతో రాజీపడకుండా మంచి రుచిగా ఉండేలా తయారు చేస్తే అన్ని వయసుల వారిని ఆకట్టుకునే అవకాశం ఉంది. పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పుట్టిన తర్వాత మొదటి వెయ్యి రోజులు చాలా ముఖ్యం. చిరుధాన్యాల వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు మంచి ఆహారం అంటే ఏంటో కూడా అవగాహన కల్పిస్తే ఎక్కువ మంది వినియోగిస్తారనడంలో సందేహం లేదు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.