ETV Bharat / bharat

అందరికీ అందని సూక్ష్మ పోషకాలు

ఒకప్పుడు దేశంలో ప్రధాన ఆహారంగా ఉన్న చిరుధాన్యాల సాగు.. హరిత విప్లవంతో తగ్గుతూ వచ్చింది. అయితే మానసిక రుగ్మతలు, పోషకాహార లోపం దాడి చేస్తున్న ప్రస్తుత తరుణంలో వాటి ప్రాముఖ్యతను ప్రజలు గుర్తిస్తున్నారు. కానీ చిరుధాన్యాల గిరాకీకి దీటుగా ఉత్పత్తి కొరవడింది.

author img

By

Published : Mar 29, 2021, 7:56 AM IST

wide gap between demand and supply of millets
అందరికీ అందని సూక్ష్మ పోషకాలు

చిరుధాన్యాల ఆరోగ్య ప్రయోజనాలు, వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగు మీద అవగాహన పెంచడానికి 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించాలన్న భారత తీర్మానానికి ఐక్యరాజ్య సమితి మద్దతు పలికింది. బంగ్లాదేశ్‌, కెన్యా, నేపాల్‌, నైజీరియా, రష్యా, సెనెగల్‌లతో కలిసి భారత్‌ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని 193 సభ్య దేశాలతో కూడిన సర్వ ప్రతినిధి సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఒకప్పుడు మన దేశంలో ఎక్కువ మంది ప్రధాన ఆహారం చిరుధాన్యాలే. హరిత విప్లవంలో భాగంగా గోధుమ, వరికి అధిక ప్రాధాన్యం దక్కడం వల్ల చిరుధాన్యాలు ప్రాధాన్యం కోల్పోయాయి. వాటి సాగు తగ్గుతూ వచ్చింది. మధుమేహం, ఊబకాయం లాంటి జీవనశైలి రుగ్మతలు, పోషకాహారలోపం ముప్పేట దాడి చేస్తున్న ప్రస్తుత తరుణంలో చిరుధాన్యాల ప్రాధాన్యాన్ని అందరూ గుర్తిస్తున్నారు. వాటిలోని సూక్ష్మపోషకాల గురించి అవగాహన పెరుగుతుండటం కారణంగా చాలామంది అటువైపు మొగ్గు చూపుతున్నారు. సాగు విస్తృతి పెరగకపోవడం, డిమాండ్‌కు తగ్గట్లు వాటి లభ్యత లేకపోవడం మూలంగా ధరలు సామాన్యులు అందుకోలేకుండా ఉన్నాయి.

wide gap between demand and supply of millets
సజ్జలు

అరకొర ప్రోత్సాహమే

చిరుధాన్యాల ప్రాధాన్యాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2018ని జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. వీటి ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం సహా ఉత్పత్తి, వినియోగం, వ్యాపార కోణంలో జొన్న, సజ్జ, రాగి, కొర్రలు, అరికెలు, సామలు, ఊదలు, ఒరిగలు లాంటి వాటిని ముతక ధాన్యాల (కోర్స్‌ సెరియల్స్‌) నుంచి పోషక ధాన్యాలు (న్యూట్రీ సెరియల్స్‌)గా మార్చింది. అయినా చిరుధాన్యాల సాగు మన దేశంలో ఆశించిన మేర పెరగడంలేదు. ముఖ్యంగా ఆరు దశాబ్దాల నుంచి భారత్‌లో వాటి సాగు తగ్గుతూ వచ్చింది. భారత్‌లో ప్రస్తుతం దాదాపు మూడున్నర కోట్ల ఎకరాల్లో చిరుధాన్యాలు సాగవుతున్నట్టు అంచనా. రాజస్థాన్‌, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌ ఇందులో ముందువరసలో ఉన్నాయి. డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ ముందస్తు అంచనాల ప్రకారం 2020-21లో భారత మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 303.34 మిలియన్‌ టన్నులు. ఈ మొత్తంలో వరి (ఖరీఫ్‌, రబీ), గోధుమ (రబీ) ఉత్పత్తే వరసగా 120.32, 109.24 (మొత్తం 229.56 మిలియన్‌ టన్నులు). అంటే 75శాతం వాటా వీటిదే. ఇదే కాలానికి న్యూట్రీ సెరియల్స్‌ ఉత్పత్తి 17.22 మిలియన్‌ టన్నులు. మొత్తం ఉత్పత్తిలో ఇది 5.6శాతమే.

పేరుకే ప్రోత్సాహకం..

దేశంలో వరి, గోధుమ లాంటి ఉత్పత్తుల మిగులు భారీగా పేరుకుపోతుండటం, ఆ ప్రభావం వాటి ధరల మీద పడుతుండటం గురించి ఈ ఏడాది ఫిబ్రవరిలో నీతి ఆయోగ్‌ పాలక మండలి ఆందోళన వ్యక్తం చేసింది. పంజాబ్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ లాంటి రాష్ట్రాల్లో రైతులు చిరు ధాన్యాలు సాగుచేసేలా వ్యవసాయంలో భారీ వైవిధ్యం రావాల్సి ఉందని సూచించింది. దేశంలో చిరుధాన్యాల ఉత్పత్తి పెంచడానికి, సాగును ప్రోత్సహించడానికి జాతీయ ఆహార భద్రత మిషన్‌ కింద ప్రత్యేక కార్యక్రమాన్ని 2014-15లో 28 రాష్ట్రాల్లోని 265 జిల్లాల్లో కేంద్రం ప్రారంభించింది. 2018-19లో 22 రాష్ట్రాల్లోని 202 జిల్లాల్లో న్యూట్రీ సెరియల్స్‌ కార్యక్రమం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాలకు చేసిన కేటాయింపులు, విడుదల చేసిన నిధుల్లో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. 2018-19లో 28 రాష్ట్రాలకు రూ.92 కోట్లు ప్రకటించగా, 2018 డిసెంబరు నాటికి రూ.52.93 కోట్లే విడుదల చేసింది. 2017-18లో రూ.156 కోట్లు ప్రకటించి తీరా ఇచ్చింది రూ.76 కోట్లే.

రాగులు

ఆరోగ్యంపై పెరగాల్సిన అవగాహన

చిరుధాన్యాలకు క్రమంగా ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో వాటి ఉత్పత్తి కనీసం నలభై శాతమన్నా పెరగాల్సిన అవసరం ఉందని జాతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్‌) సంచాలకులు విలాస్‌ టొనాపీ అంటారు. దేశంలో చిరు ధాన్యాల సాగు పెంచడానికి ఈ సంస్థ కృషి చేస్తోంది. చిరు ధాన్యాల సాగుకు తక్కువ నీరు సరిపోతుంది. కఠిన వాతావరణ, కరవు పరిస్థితులను ఇవి సమర్థంగా తట్టుకుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో చిరుధాన్యాల కార్యక్రమాన్ని 2016లో ప్రారంభించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో దాదాపు డెబ్బై నాలుగు వేల ఎకరాల్లో చిరుధాన్యాలు సాగవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం 2018లో ఆరు జిల్లాల్లోని 36 మండలాల్లో అయిదేళ్ల కాలానికి చిరుధాన్యాల కార్యక్రమం ప్రారంభించింది. ప్రోత్సాహం, వినియోగం, ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌ ఇందులో ప్రధాన అంశాలు. ఏడువేల ఎకరాల్లో సాగు చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సరైన ప్రోత్సాహకాలు లేకపోవడం, వినియోగదారుల ప్రాధాన్యాలు మారిపోవడం వల్ల ఒకప్పుడు చిరుధాన్యాలు పండిన భూములు క్రమంగా మొక్కజొన్న, పత్తి, చెరకు, పొద్దు తిరుగుడు, మిరప లాంటి వాటి సాగులోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం చిరుధాన్యాలకు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో వాటి సాగును విస్తృతం చెయ్యడానికి ప్రభుత్వాలు త్వరితగతిన చర్యలు చేపట్టాలి. చిరుధాన్యాల ఆరోగ్య ప్రయోజనాల మీద అవగాహన కల్పించేందుకు కర్ణాటక ప్రభుత్వం చాలా ప్రాంతాల్లో మిల్లెట్‌ మేళాలు నిర్వహిస్తోంది. ఇలాంటి ప్రయత్నాలు అన్ని రాష్ట్రాల్లో జరగాలి. వ్యవసాయంలో వైవిధ్యం, ప్రజారోగ్య పరంగా చిరు ధాన్యాల సాగుకు చేయూతనివ్వడం అత్యావశ్యకం.

- వేణుబాబు మన్నం

ఇదీ చూడండి: కరోనాతో మానసిక కల్లోలం- ఇదిగో పరిష్కారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.