ETV Bharat / city

పార్టీల ముసుగులో మాదక ద్రవ్యాల సరఫరా

author img

By

Published : Apr 4, 2022, 5:43 AM IST

Updated : Apr 4, 2022, 6:03 AM IST

drugs in hyderabad
drugs in hyderabad

Drugs Parties in Hyderabad: హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల అధిక మోతాదు కారణంగా ఓ యువకుడు మరణించిన అంశం మరిచిపోకముందే తాజాగా శనివారం అర్ధరాత్రి బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌లో మాదకద్రవ్యాలు దొరకడం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు ఎక్కువగా పబ్‌లే వేదికలవుతుండటం గమనార్హం.

Drugs Parties in Hyderabad: వారాంతపు మత్తు పార్టీలు తరచూ కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా రాజధానితో పాటు శివార్లలోని పలు ప్రాంతాల్లో ఈ తరహా పార్టీలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. శుక్ర, శనివారాల్లో అర్ధరాత్రి దాటేవరకు నడుస్తున్న వీటిల్లో మాదకద్రవ్యాల జాడలు బహిర్గతమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల అధిక మోతాదు కారణంగా ఓ యువకుడు మరణించిన అంశం మరిచిపోకముందే తాజాగా శనివారం అర్ధరాత్రి బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌లో మాదకద్రవ్యాలు దొరకడం చర్చనీయాంశంగా మారింది. డ్రగ్స్‌ దందాపై ఉక్కుపాదం మోపాలని గత అక్టోబరులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కొంతకాలంగా పోలీసులు తరచూ దాడులు చేస్తున్నారు. అయినా మత్తు దందా నిర్వాహకులు జంకు లేకుండా వ్యవహరిస్తున్నారనేందుకు తాజా ఉదంతమే నిదర్శనం. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు ఎక్కువగా పబ్‌లే వేదికలవుతుండటం గమనార్హం. పబ్‌లలో జరుగుతున్న వ్యవహారాలపై ఇటీవలి ఉన్నతాధికారుల సమీక్షలో స్వయంగా ముఖ్యమంత్రే అసహనం వ్యక్తం చేయడాన్ని బట్టే పరిస్థితి తీవ్రత కనిపిస్తోంది.

బయటి నుంచీ రాక

ఒకప్పుడు వారాంతపు వేడుకల కోసం హైదరాబాద్‌ నుంచి గోవా, బెంగళూరు, ముంబయి.. తదితర ప్రాంతాలకు వెళ్లేవారు. ఇప్పుడు హైదరాబాద్‌లో పబ్‌ల సంస్కృతి విస్తరించడంతో ప్రస్తుతం ఇక్కడే జోరుగా సాగుతున్నాయి. బయట నుంచి పార్టీల కోసం వస్తున్నారు. అయితే భారీ పార్టీలకు ఇప్పటికీ గోవా, బెంగళూరు వెళ్తుంటారు. పబ్‌లలోనే కాకుండా శివార్లలోని ఫామ్‌హౌస్‌లను, రిసార్ట్‌లను ఒకట్రెండు రోజులపాటు లీజుకు తీసుకొని మత్తు పార్టీలు నిర్వహిస్తున్నారు. ఈ వ్యవహారమంతా ఆన్‌లైన్‌ వేదికగానే జరిగిపోతోంది. వెబ్‌సైట్ల ద్వారా రిజిస్ట్రేషన్లు చేయిస్తుండటతో పాటు వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాంలాంటి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగిస్తున్నారు. ఇలా నమోదు చేసుకున్న వారందరినీ ఒకే వేదికపైకి తెచ్చి మత్తులో మునిగి తేలేలా పార్టీలు నిర్వహిస్తున్నారు. ఈ పార్టీల్లోనే అవసరాన్ని బట్టి మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నారు. కొద్దిరోజుల కిందట పంజాగుట్ట పోలీసులు ముంబయిలో పట్టుకొచ్చిన ప్రముఖ డ్రగ్‌ పెడ్లర్‌ టోనీని విచారించినప్పుడు ఇలాంటి మాదకద్రవ్యాల సరఫరా రాకెట్‌ బహిర్గతమైంది.

24 గంటలూ ‘బార్‌’లా..!

రాజధానిలో బార్‌ల ముసుగులో పబ్‌లను నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గ్రేటర్‌లోని మూడు, అయిదు నక్షత్రాల హోటళ్లలో ఉన్న బార్లలో చాలావరకు 24 గంటలపాటు కొనసాగించేందుకు ఎక్సైజ్‌శాఖ అనుమతించింది. ఎక్సైజ్‌ ట్యాక్స్‌కు అదనంగా సొమ్ము కట్టిన బార్ల నిర్వాహకులు ఏ సమయంలోనైనా మందు సరఫరా చేసుకోవచ్చు. ఈ వెసులుబాటును మత్తు పార్టీల నిర్వాహకులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. కొందరు ఈ బార్లను లీజుకు తీసుకొని మత్తు సరఫరా వేదికలుగా మార్చుతున్నారు. తాజా ఉదంతంతో పోలీసులు ఈ తరహా వ్యవహారాలపై లోతుగా దర్యాప్తు చేసే పనిలో నిమగ్నమయ్యారు.

ఇవీచూడండి:

Last Updated :Apr 4, 2022, 6:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.