ETV Bharat / city

Narcotic Enforcement Wing units : 'మత్తు'పై పోలీసుల నిఘా.. ఆ ప్రత్యేక విభాగాలతో!

author img

By

Published : Feb 9, 2022, 4:02 PM IST

Updated : Feb 9, 2022, 5:02 PM IST

Narcotic Enforcement Wing units: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో హైదరాబాద్‌లో డ్రగ్స్‌ నివారణకు పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. డ్రగ్స్‌పై నిఘాకు ఏర్పాటు చేసిన రెండు ప్రత్యేక విభాగాలను డీజీపీ మహేందర్ రెడ్డి హైదరాబాద్ సీపీ కార్యాలయంలో ప్రారంభించారు.

Drugs Control Wings
Drugs Control Wings

Narcotic Enforcement Wing units : రాష్ట్రంలో డ్రగ్స్​ నివారణకు సీఎం కేసీఆర్​ ఆదేశాలతో డ్రగ్స్‌పై నిఘాకు పోలీసులు రెండు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశారు. వాటిని డీజీపీ మహేందర్ రెడ్డి హైదరాబాద్ సీపీ కార్యాలయంలో ప్రారంభించారు. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం, నార్కోటిక్స్ ఇన్వెస్టిగేషన్ సూపర్ విజన్ వింగ్‌లు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పని చేయనున్నట్లు తెలిపారు. రెండు నార్కోటిక్ విభాగాలను స్థానిక పీఎస్‌లకు అనుసంధానిస్తామని డీజీపీ మహేందర్​ రెడ్డి వెల్లడించారు. డ్రగ్స్ కట్టడి కోసం రెండు ప్రత్యేక విభాగాలు పని చేస్తాయని వివరించారు.

నార్కోటిక్​ ఎన్​ఫోర్స్​మెంట్​​ వింగ్​ విభాగాలను ప్రారంభించిన డీజీపీ

డ్రగ్స్​ మాఫియా ఆటకట్టించేందుకు..

మావోయిస్టులు, టెర్రరిస్టుల ఏరివేయడానికి గ్రేహౌండ్స్, కౌంటర్ ఇంటిలిజెన్స్ పనిచేస్తున్నట్టుగా.... మాదక ద్రవ్యాలను అరికట్టడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేస్తామని... డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. వ్యవస్థీకృత నేరాల్లో మాదక ద్రవ్యాల విక్రయం మొదటి స్థానంలో ఉందని..... సరఫరా, విక్రయాల గురించి ఎవరికీ తెలియకుండా డ్రగ్స్ మాఫియా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోందని పేర్కొన్నారు. డ్రగ్స్ మాఫియా ఆట కట్టించే విధంగా ప్రత్యేక పోలీసు బృందాలు పనిచేస్తాయని మహేందర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పర్యవేక్షణలో రెండు విభాగాలు పని చేయనున్నాయి.

ఇటీవల నైజిరీయాకు చెందిన టోనీని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని పలువురు బడా వ్యాపారులు మాదక ద్రవ్యాలను టోనీ నుంచి కొనుగోలు చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వేళ్లూనుకుపోతున్న మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టకపోతే శాంతి భద్రతల సమస్యగా మారే ప్రమాదముందని గ్రహించిన హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా మాదక ద్రవ్యాల సరఫరా, విక్రయాలను అడ్డుకోనున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి ఆర్గనైజేషనల్​ ఫ్రేమ్​ వర్క్​ను రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.​ దాదాపు వెయ్యి మంది పోలీసు అధికారులు, సిబ్బంది నియామకానికి అనుమతి ఇవ్వడమే కాకుండా.. అందుకు కావాల్సిన సాంకేతికతను సమకూర్చుకోవడం, ఇతర వ్యవస్థలను నిర్మించాలని ఆదేశించారు. వాటి ఆధారంగా గత పదిరోజులుగా పలువురితో చర్చలు జరుపుతున్నాం. వాటన్నింటిక సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రభుత్వం ముందు ఉంచుతాం. -మహేందర్​ రెడ్డి, డీజీపీ

ముఖ్యమంత్రి కేసీఆర్​... వెయ్యి మందితో కొత్త విభాగాన్ని ఏర్పాటు చేయాలన్న సూచనలపై.. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. సిబ్బంది నియామకం, నిధులు సమకూర్చుకోవడం తదితర పనులు జరుగుతున్నాయి. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అనేది ఏర్పాటు చేస్తున్నాం. సౌత్​జోన్​ టాస్క్​ఫోర్స్​కు ఇంఛార్జ్​గా ఉన్న చక్రవర్తిని ఈ విభాగానికి నాయకత్వం వహించాలని మేము నిర్ణయించాం. - సీవీ ఆనంద్​, హైదరాబాద్​ సీపీ

ఎలా పనిచేస్తుంది..

మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగం నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. డ్రగ్స్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో మత్తు పదార్ధాల నిర్మూలనకోసం రెండు ప్రత్యేక విభాగాలు ఏర్పాటయ్యాయి. హైదరాబాద్‌ సీపీ కార్యాలయం కేంద్రంగా ఈ రెండు విభాగాలు ఇక నుంచి పటిష్ఠ చర్యలు చేపట్టనున్నాయి. హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం, నార్కోటిక్స్‌ ఇన్వెస్టిగేషన్‌ సూపర్‌ విజన్‌ వింగ్ పేరిట వీటిని ఏర్పాటు చేశారు. నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, నలుగురు ఎస్‌ఐలు, 20 మంది కానిస్టేబుళ్లు పనిచేస్తారు. నార్కోటిక్స్‌ ఇన్వెస్టిగేషన్‌ సూపర్‌ విజన్‌ వింగ్‌లో ఒక ఏసీపీ, ఒక ఇన్‌స్పెక్టర్‌, ఒక ఎస్‌ఐ, ఆరుగురు కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తిస్తారు.

ఇదీ చూడండి : TS Drugs Control Wings: పోలీస్​ శాఖలో డ్రగ్స్​ కంట్రోల్​ వింగ్స్​ ఏర్పాటు

Last Updated : Feb 9, 2022, 5:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.