ETV Bharat / city

శ్రీవారి ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు.. భక్తుల ఎదురుచూపులు

author img

By

Published : Apr 23, 2022, 6:59 AM IST

Tirumala Latest News
Tirumala Latest News

Tirumala Latest News : కరోనా సమయంలో ఆర్జిత సేవలకు ముందస్తు టికెట్‌ బుక్ చేసుకుని లాక్‌డౌన్ ఆంక్షల వల్ల అందులో పాల్గొనలేకపోయిన భక్తులు తమకు ఇప్పుడు అవకాశం కల్పించాలని తితిదేను కోరుతున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఆర్జిత సేవలకు అనుమతించడంతో తమకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తితిదే స్పందన కోసం.. శ్రీవారి సేవలో పాల్గొనేందుకు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

Tirumala Latest News : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు భక్తులు ఎదురుచూస్తున్నారు. కొవిడ్‌ సమయంలో ఆర్జిత సేవలకు ముందస్తు టికెట్లు పొంది అందులో పాల్గొనలేకపోయిన చాలామంది తమకు ఇప్పుడు అవకాశం కల్పించాలని తితిదేను కోరుతున్నారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో 2020 మార్చి 20వ తేదీ నుంచి ఆర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహించారు. ఆంక్షలను ఎత్తివేయడంతో ఈ ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తున్నారు. ముందస్తు నమోదు చేసుకున్న భక్తులతోపాటు కొన్ని ఆన్‌లైన్‌ డిప్‌ ద్వారా.. మరికొన్ని కరెంటు బుకింగ్‌(డిప్‌ విధానం) ద్వారా కేటాయిస్తున్నారు. ఇందులో ఏదో ఒక కోటాను తగ్గించి తమకు అవకాశం ఇవ్వాలని కొవిడ్‌ సమయంలో ముందస్తు టికెట్లు పొందిన భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

తిరుమల శ్రీవారికి పలు రోజుల్లో నిర్వహించే తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన, అభిషేకం, కల్యాణోత్సవం, తిరుప్పావడ, సుప్రభాతం, నిజపాద దర్శనం, సహస్రదీపాలంకరణ, ఊంజల్‌, వసంతోత్సవం తదితర విశేషపూజలకు భక్తులను అనుమతిస్తారు. 2020 మార్చి 20వ తేదీ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకు సుమారు 17,946 మంది భక్తులు పలు సేవల్లో పాల్గొనేందుకు ముందస్తు టికెట్లు పొందారు. అయితే కొవిడ్‌ నేపథ్యంలో ఈ సేవలను నిలిపివేశారు. టికెట్లు పొందిన వారికి వీఐపీ బ్రేక్‌, రీఫండ్‌ తీసుకునే సదుపాయం కల్పించారు. దీంతో 8,965 మంది వీఐపీ బ్రేక్‌ సేవను సద్వినియోగం చేసుకున్నారు. 264 మంది భక్తులు తమ సొమ్మును వెనక్కి తీసుకున్నారు. మిగిలిన 8,717 మంది భక్తులు సేవల్లో పాల్గొనేందుకు అవకాశం ఇస్తారని ఎదురుచూస్తున్నారు.

వాస్తవానికి అభిషేకం సేవలో పాల్గొనే అవకాశం కోసం భక్తులు ఎదురుచూస్తుంటారు. ఇందులోనే మేల్‌చాట్‌ వస్త్రం, కస్తూరి వెసల్‌ అభిషేకం, సివిట్‌ వెసల్‌ అభిషేకం ముఖ్యమైనవి. మేల్‌చాట్‌ వస్త్రం టికెట్లు పొందిన వారు 730 మంది ఉన్నారు. ఇందులో 36 మంది తమ సొమ్మును వెనక్కి తీసుకున్నారు. మరో 257 మంది బ్రేక్‌ దర్శనం చేసుకున్నారు. ఇంకా 437 మంది తమకు ఇందులో అవకాశం కల్పిస్తారని ఎదురుచూస్తున్నారు. పూరాభిషేకానికి టికెట్లు పొందిన 3,995 మందిలో 51 మంది తమ సొమ్మును వెనక్కి తీసుకున్నారు. 2146 మంది వీఐపీ బ్రేక్‌ దర్శనం చేసుకోగా.. మిగిలిన 1,798 మంది తితిదే నిర్ణయం కోసం వేచి ఉన్నారు. ఇలా అర్చన, తోమాలతోపాటు ఇతర సేవల్లో తిరిగి తమకు అవకాశం కల్పించకపోతారా అని టికెట్లు పొందిన భక్తులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

శ్రీవారి ధర్మదర్శనానికి 25 గంటలు : తిరుమల శ్రీవారిని ధర్మదర్శనం చేసుకునేందుకు 25 గంటల సమయం పడుతోందని తితిదే శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. వారాంతం కావడంతో భక్తుల సంఖ్య పెరిగింది. శుక్రవారం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.