ETV Bharat / city

అంతా అయోమయం: 185 మండలాల్లో డీటీలే తహసీల్దార్లు

author img

By

Published : Oct 4, 2020, 8:53 AM IST

కొత్త చట్టం అమలు... ధరణి పోర్టల్‌ ఆధారంగా కొత్తగా రిజిస్ట్రేషన్లు.. మ్యుటేషన్ల సేవలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కొన్ని మండలాల్లో అయోమయ పరిస్థితులున్నాయి. రాష్ట్రంలో 590 మండలాలుండగా దాదాపు 185 చోట్ల డీటీలు తహసీల్దార్ల బాధ్యతల్లో ఉన్నారు. సుమారు 30 చోట్ల పక్క మండలాల తహసీల్దార్లు ఇన్‌ఛార్జులుగా వ్యవహరిస్తున్నారు.

అంతా అయోమయం: 185 మండలాల్లో డీటీలే తహసీల్దార్లు
అంతా అయోమయం: 185 మండలాల్లో డీటీలే తహసీల్దార్లు

కొత్త చట్టం నేపథ్యంలో తహసీల్దారు కార్యాలయాలపై అదనంగా రిజిస్ట్రేషన్ల సేవల భారం పడనుంది. ఫలితంగా ఇన్‌ఛార్జిలున్న మండలాల్లో పరిపూర్ణమైన సేవలు అందించడం కష్టంగా మారే పరిస్థితులున్నాయి.

డీటీలపై మరింత భారం

కొత్త చట్టం ప్రకారం తహసీల్దారు సంయుక్త సబ్‌రిజిస్ట్రారుగా .. మండలంలో కీలకమైన ప్రొటోకాల్‌ బాధ్యతలను డీటీలు నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం ఇన్‌ఛార్జిలుగా ఉన్న చోట తహసీల్దారు, డీటీ విధులను డీటీలే చేపడుతున్నారు. రిజిస్ట్రేషన్ల సేవలు ప్రారంభమయ్యాక తహసీల్దారు సెలవులో వెళితే ఆ బాధ్యతలు డీటీలు చూడాలి. డీటీ ఒక్కరే ఉన్నచోట ఏం చేస్తారనేది చర్చగా మారింది.

పదోన్నతుల ప్రక్రియ... శిక్షణ

కొత్త చట్టం నేపథ్యంలో డీటీ స్థాయి నుంచి డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి వరకు పదోన్నతులు ఇచ్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఐదు, ఆరో జోన్ల పరిధిలోని అర్హులైన డిప్యూటీ తహసీల్దార్లకు డీపీసీని కూడా నిర్వహించారు. తహసీల్దార్ల నుంచి డిప్యూటీ కలెక్టర్లుగా, డిప్యూటీ కలెక్టర్ల నుంచి స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్ల పదోన్నతుల ప్రక్రియ కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉంది.

సర్వత్రా ఉత్కంఠ

మరోవైపు కొత్త చట్టం అమలుకు వీలుగా కంప్యూటర్‌ ఆపరేటర్లు, డీటీలు, తహసీల్దార్లు, సబ్‌ రిజిస్ట్రార్లకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. దసరా సమీపిస్తుండటంతో ఈ మధ్యలో పదోన్నతులు, బదిలీలు, శిక్షణ కార్యక్రమాల అమలు ఏ విధంగా పూర్తవుతుందో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కొత్త చట్టం అమలుకు వీలుగా ఎక్కడా పోస్టులు ఖాళీగా ఉంచొద్దని సీఎం ఆదేశించారని, దానికనుగుణంగానే గత నెలలోనే ప్రభుత్వం పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించిందని ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి తెలిపారు. దసరా నాటికి పదోన్నతులు, సమగ్ర శిక్షణ పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రారంభమవుతాయన్నారు.

ఇవీ చూడండి: ఆస్తుల ఆన్​లైన్​పై ప్రత్యేక శ్రద్ధ... శరవేగంగా నమోదు ప్రక్రియ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.