ETV Bharat / city

RICE: తెలంగాణ దొడ్డురకం బియ్యానికి గడ్డుకాలం

author img

By

Published : Jul 22, 2021, 6:45 AM IST

RICE: తెలంగాణ దొడ్డురకం బియ్యానికి తగ్గుతున్న డిమాండ్​
RICE: తెలంగాణ దొడ్డురకం బియ్యానికి తగ్గుతున్న డిమాండ్​

తెలంగాణ రైతులు ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేస్తున్న దొడ్డు రకం బియ్యానికి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండు తగ్గుతోంది. సన్నరకం ధాన్యం దిగుబడి, వరి సాగు విస్తీర్ణం తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ప్రస్తుత వానాకాలంలో సన్నరకాల వరి వంగడాలనే అధికంగా సాగుచేయాలని వ్యవసాయశాఖ ప్రచారం చేస్తోంది.

ఇంతకాలం అధిక ధర ఉందనే కారణంగా తెలంగాణ రైతులు ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేస్తున్న దొడ్డు(లావు) రకం బియ్యానికి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండు తగ్గుతోంది. దొడ్డు రకాల బియ్యాన్ని నిత్యాహారానికి తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా వినియోగిస్తారు. తమిళనాడు, కేరళలో దొడ్డు రకం వరి వంగడాల సాగు విస్తీర్ణం పెరుగుతున్నందున తెలంగాణలో పండే దొడ్డురకం బియ్యానికి డిమాండు తగ్గుతున్నట్లు వ్యవసాయశాఖ తెలిపింది. పలు రాష్ట్రాల, విదేశీ మార్కెట్లలో సన్నరకం బియ్యానికే అధిక డిమాండు, మంచి ధరలు పలుకుతున్నాయి. గతేడాది(2020-21)లో తెలంగాణలో 2 కోట్ల టన్నులకు పైగా వరి ధాన్యం దిగుబడి వచ్చినా సన్న బియ్యం చిల్లర ధరలు మార్కెట్‌లో ఒక్కరూపాయి తగ్గలేదు. సన్నరకం ధాన్యం దిగుబడి, వరి సాగు విస్తీర్ణం తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ప్రస్తుత వానాకాలంలో సన్నరకాల వరి వంగడాలనే అధికంగా సాగుచేయాలని వ్యవసాయశాఖ ప్రచారం చేస్తోంది. ఈ మేరకు రైతులను చైతన్యపరచాలని జిల్లా వ్యవసాయాధికారుల(డీఏఓ)కు తాజాగా ఆదేశాలు జారీచేసింది. జూన్‌ లేదా జులైలో సన్నవరి నాట్లు వేస్తేనే మంచి దిగుబడి వస్తుందని, ప్రస్తుతం వానలతో వాతావరణం అనుకూలం ఉందని జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకుడు డాక్టర్‌ జగదీశ్వర్‌ రైతులకు సూచించారు. తెలంగాణ సోనా సన్నరకం వరి నాట్లు వేయడానికి ఇంకా సమయం ఉంది.

స్పష్టత కరవు...

సన్న, దొడ్డు రకం వరి వంగడాల్లో ఏది సాగు చేస్తే మద్దతు ధర ఎక్కువొస్తుందనే విషయంలో రైతుల్లో గందరగోళం నెలకొంది. ప్రభుత్వం మద్దతు ధరకు కొనేందుకు నిబంధనల ప్రకారం వరి ధాన్యాన్ని రెండు రకాలుగా వర్గీకరించింది. వీటిలో ‘ఏ గ్రేడ్‌’ పేరుతో కొనేవాటికి క్వింటాకు రూ.1,960, సాధారణరకం వరి ధాన్యానికి రూ.1,940గా మద్దతు ధరను కేంద్రం ప్రకటించింది. ఏ గ్రేడ్‌ ధాన్యం అంటే దొడ్డు రకాల వరి వంగడాలే అనే అభిప్రాయం రైతుల్లో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. సన్నరకాలను సాధారణ రకంగా చూపుతూ క్వింటాకు రూ.20 తక్కువగా చెల్లిస్తున్నారని కొందరు రైతులు నిరసనలకు సైతం దిగారు. ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏ గ్రేడ్‌, సాధారణ రకాలేమిటనే వివరాలతో వరి వంగడాల పేర్లతో జాబితాను ఇటీవల విడుదల చేసింది.

జయశంకర్‌ వర్సిటీ పేర్కొన్న సాధారణ, ఏ గ్రేడ్‌ రకాలు
సాధారణ రకం
‘విజేత’(ఎంటీయూ 1001)
ఏ గ్రేడ్‌ రకం
సాంబ మసూరి (బీపీటీ 5204), తెలంగాణ సోనా, హెచ్‌ఎంటీ సోనా, బీపీటీ3291, వరంగల్‌ సన్నాలు (డబ్ల్యూజీఎల్‌ 32100), వరంగల్‌ సాంబ (డబ్ల్యూజీఎల్‌14), జగిత్యాల మసూరి (జేజీఎల్‌ 11470), కాటన్‌దొర సన్నాలు (ఎంటీయూ1010), భద్రకాళి వరంగల్‌(డబ్ల్యూజీఎల్‌ 3962) వంటి సన్న రకాలతో పాటు తెల్లహంస (ఆర్‌ఎన్‌ఆర్‌ 10754), ఎంటీయూ 1153, జేజీఎల్‌ 24423, ఎంటీయూ 1156, ఐఆర్‌ 64 వంటి దొడ్డు రకం వంగడాలూ ఉన్నాయి.

రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించాం

డిమాండు ఉన్న సన్నరకం వరితో పాటు నూనెగింజల పంటలను సాగు చేస్తేనే రైతులకు అధిక ఆదాయం వస్తుంది. ఈ మేరకు వారికి అవగాహన కల్పించాలని వ్యవసాయాధికారులకు ఆదేశాలు జారీచేశాం. - ఎస్‌.నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి

ఇదీ చదవండి: PRASHANTH REDDY: 'అద్భుత కట్టడంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.