ETV Bharat / city

తస్మాత్ జాగ్రత్త: తెలుగురాష్ట్రాల్లోనూ పెరుగుతున్న సైబర్‌మోసాలు

author img

By

Published : Apr 10, 2021, 4:25 AM IST

ఒకప్పుడు దోపిడీలు, దొంగతనాలంటే హడలిపోయిన ప్రజలు.. ఇప్పుడు అంతకంటే ప్రమాదకర సైబర్ నేరాలతో బెంబేలెత్తుతున్నారు. ఇలా.. మోసపోతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది తప్ప తగ్గట్లేదు. వీటిపై జనాలకు అవగాహన లేదా? అంటే అదేం కాదు. పోలీసుల దగ్గర్నుంచి ప్రముఖుల వరకు అందరు సైబర్‌ నేరాలపై అవగాహన కల్పిస్తున్నారు. రోజూ ఎక్కడో ఓ చోట ఈ తరహా మోసాలు తారసపడుతూనే ఉన్నాయి. అయినా, సైబర్‌ వలలో చిక్కుతున్నామంటే దాని అర్థం..... మోసపోయేవారు ఉన్నంత కాలం మోసం చేస్తునే ఉంటారేమో!

cyber crimes are increased in Telegu states day by day
తస్మాత్ జాగ్రత్త: తెలుగురాష్ట్రాల్లోనూ పెరుగుతున్న సైబర్‌మోసాలు

తస్మాత్ జాగ్రత్త: తెలుగురాష్ట్రాల్లోనూ పెరుగుతున్న సైబర్‌మోసాలు

ఇంటర్నెట్‌పై ఎంత అవగాహన ఉన్నా, ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా, ప్రముఖులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా, పోలీసులు భద్రత కల్పిస్తున్నా మోసాలు మాత్రం ఆగట్లేదు. ఎవరో అనామకుడు ఫోన్‌ చేస్తే... తమ వ్యక్తిగత, రహస్య సమాచారాలు సైతం క్షణాల్లో ఇచ్చేస్తున్నారు. కేంద్రం లెక్కల ప్రకారం 2019లో సైబర్‌ నేరాల బారినపడిన ప్రపంచంలోని మొదటి 20 దేశాల్లో భారత్‌ 3వ స్థానంలో ఉంది. జాతీయ నేరాల గణాంక సంస్థ- ఎన్​సీఆర్​బీ నివేదిక ప్రకారం సైబర్‌ నేరాలు ఏటా 1.5 శాతం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపింది.

ప్రముఖ యాంటీ వైరస్‌ సంస్థ నార్టన్‌ 10 దేశాల్లో నిర్వహించిన ఆన్‌లైన్‌ సర్వే ప్రకారం- 2019 లో భారత్‌లో సైబర్‌నేరాల కారణంగా 1.24లక్షల కోట్లు నష్టం వాటిల్లింది. ప్రపంచవ్యాప్తంగా 35కోట్ల మంది సైబర్‌ మోసాల బాధితులుంటే.. అందులో 13కోట్ల మంది భారత్‌కు చెందినవారే. ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తిగత సమాచారం చౌర్యం సగటు 67% ఉంటే... భారత్‌లో మాత్రం 81%గా ఉంది. తెలుగురాష్ట్రాల్లోనూ ఈ తరహా మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇటీవల ఓ సంస్థ చేపట్టిన అధ్యయనంలో... సైబర్‌ మోసాలు ఎక్కువగా నమోదవుతున్న నగరాల్లో హైదరాబాద్‌ 2వ స్థానంలో ఉంది. ఈ గణాంకాలన్నీ నమోదైన కేసుల ఆధారంగా లెక్కగట్టినవే. దేశంలో ఇంకా చాలా మంది బాధితులు కనీసం ఫిర్యాదు కూడా చేయట్లేదు. ఎలాగో మోసపోయాం... ఫిర్యాదు చేస్తే పరువు పోతుంది వంటి ఇతరత్రా కారణాలతో కేసులు పెట్టేందుకు ఇష్టపడట్లేదు.

ఈ నేపథ్యంలో... బాధితులు పోలీస్‌ఠాణాకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే... ఫిర్యాదులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సైబర్‌క్రైం పోర్టల్‌ అందుబాటులోకి తెచ్చింది. బాధితులు ఎవరైనా... మెుదటగా జాతీయ సైబర్‌ క్రైం పోర్టల్‌ తెరవాలి. అన్ని వివరాలు నమోదు చేసిన తరువాత... రాష్ట్రాన్ని, జిల్లాను, ఠాణా ఎంపిక చేసుకొవాలి. ఇది ముందుగా డీజీ కార్యాలయానికి వెళ్తుంది. అక్కడి నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయానికి వస్తుంది. వారి నుంచి సంబంధిత పోలీస్‌ స్టేషన్‌కు చేరుతుంది. ఎఫ్​ఐఆర్​ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తారు. విచారణ సమాచారాన్ని కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. ఇలా చేయడంతో నేరం జరిగినప్పటి నుంచి విచారణ పూర్తయ్యే వరకు పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షించే అవకాశం ఉంటుంది.

కొందరు నిపుణులు మాత్రం.... సైబర్‌ వలలో చిక్కుకోవడం ఎందుకు...? ఠాణాల వెంబడి పరిగెత్తడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. సైబర్‌ మోసాలపై కొంచెం ఒపిగ్గా అవగాహన తెచ్చుకుంటే చాలు..! ఇంటర్నెట్‌లో హాయిగా గడపవచ్చని సూచిస్తున్నారు. బ్యాంకింగ్‌ అధికారులెవరూ.. ఫోన్‌ చేసి మీ వివరాలు అడగరు. అలా ఎవరైనా చేశారంటే.. బ్యాంకుకు వచ్చి చెబుతామంటూ.. కాల్‌ కట్‌ చేయాలి. ఓటీపీ రహస్యంగా ఉండాలి. అలాంటిది ఎవరికి పడితే వారికి చెప్పకూడదు. ఒకవేళ మోసపోతే బ్యాంకు కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేసి, కార్డు బ్లాక్‌ చేయించి వెంటనే సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలి.

గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి మీ ఫోన్‌లో ఫలానా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోమని చెప్పారంటే అది మోసమని అనుమానించాలి. రిమోట్‌ యాప్‌లు ఉపయోగించి మీ ఖాతాలు ఖాళీ చేశారంటే ..వెంటనే బ్యాంకుకు ఫోన్‌ చేసి ఖాతాను స్తంభింప చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలి. నిరుద్యోగ యువత బ్యాక్‌డోర్‌ నుంచి ఉద్యోగాలు సంపాదించాలనుకుంటే అది ఎప్పటికైనా ప్రమాదమనే విషయం గుర్తించాలి. సాధారణంగా కన్సల్టెన్సీలు ఉచితంగా ఉద్యోగాలు ఇప్పిస్తుంటాయి. అందుకుగానూ... ఆయా సంస్థల ద్వారా కమీషన్‌ ఆర్జిస్తాయి. అంతే కానీ, ఉద్యోగం ఇప్పిస్తామంటూ వసూళ్ల దందా చేయవు.

అమ్మకాలు, కొనుగోళ్ల విషయంలో సైబర్‌ నేరగాళ్లు బాధితుల అత్యాశ, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మోసం చేస్తున్నారు. వస్తువును చూసిన తరువాత, దానిని అమ్మే వ్యక్తి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడో నిర్ధరించుకున్న తరువాతే ఆర్థికపరమైన లావాదేవీలు చేయాలి. సామాజిక మాధ్యమాల ద్వారా తెలిసినవారు డబ్బులు అడిగితే.. సదరు వ్యక్తికి ఫోన్‌ చేసి నిజమా ? కాదా? అని నిర్ధరించుకోవాలి. అలా చేయడంతో స్నేహితుడికి కూడా తన పేరుతో నకిలీ ఖాతాలు ఉన్నాయనే విషయం తెలుస్తుంది. ఇతరులను అప్రమత్తం చేస్తాడు.

వెయ్యి రూపాయల షాపింగ్‌ చేస్తే 25 లక్షల రూపాయల లాటరీ వచ్చిందంటే గుడ్డిగా ఎలా నమ్ముతారు..? షాపింగ్‌లు చేస్తే లాటరీలు తగలవు అనే వాస్తవాన్ని ముందు గ్రహించాలి. అలాంటి మెసేజ్‌లకు స్పందించకుండా ఉండటం మంచిది. లేకపోతే... వచ్చే డబ్బుల సంగతి...దేవుడెరుగు ఉన్న డబ్బులు మాయమవుతాయి. గిప్ట్‌లు, ఇన్సూరెన్స్‌, చారిటీ, అయిల్స్‌, పెట్టుబడుల పేరుతో వచ్చే ఆఫర్ల గురించి...వాటిపై అవగాహన ఉన్న వ్యక్తులతో చర్చించాలి. ఇతరులకు తెలిస్తే నాకు వచ్చే లాభం పోతుందేమోనన్న ధోరణి నుంచి బయటకు రావాలి.

ప్రస్తుతం.. ఆర్థికలావాదేవీల్లో అధికభాగం ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. దీంతో నేరాలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి.. గుర్తుపెట్టుకో.. నువ్వు ఉంటుంది.. ఆన్‌లైన్‌లో కాదు... మాయాబజార్‌లో.

ఇవీ చూడండి: ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి ఆర్థిక సాయం పంపిణీకి మార్గదర్శకాలు ఖరారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.