ETV Bharat / city

విదేశీ బొగ్గు ధరల మేరకు కరెంటు రేట్ల పెంపు.. ప్రజలపై మరింత భారం..

author img

By

Published : May 7, 2022, 6:45 AM IST

current rates will  Increase  in line with foreign coal prices in telangana
current rates will Increase in line with foreign coal prices in telangana

Coal Crisis in India : బొగ్గు సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విద్యుదుత్పత్తికి సంబంధించి తాజాగా వెలువరించిన ఉత్తర్వులతో ప్రజలపై మరింత భారం పడే ప్రమాదం పొంచి ఉంది. విద్యుదుత్పత్తి వ్యయం భారీగా పెరిగే సూచనలుండడంతో అది కరెంటు ఛార్జీల రూపంలో పరోక్షంగా వినియోగదారులపైనే ప్రభావం చూపనుంది. విదేశీ బొగ్గుపైనే ఆధారపడి నడిచే విద్యుత్కేంద్రాలకు అనుకూలించే ఉత్తర్వులను కేంద్ర విద్యుత్‌శాఖ శుక్రవారం జారీచేసింది.

Coal Crisis in India : బొగ్గు ధర పెరుగుదల నిష్పత్తి ప్రకారం ఆయా కేంద్రాల్లో ఉత్పత్తి చేసే విద్యుత్‌ విక్రయ ధరలను పెంచుతామని కేంద్ర విద్యుత్​ శాఖ స్పష్టం చేసింది. ధరల నిర్ణయం కోసం జాతీయస్థాయిలో కమిటీని ఏర్పాటు చేసింది. పెంచిన ధరల ప్రకారం కరెంటు తీసుకుంటారా లేదా అనేది విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లకే వదిలేసింది. ప్రతి విద్యుదుత్పత్తి కేంద్రం(జెన్‌కో)లో ఉత్పత్తి చేసే కరెంటును కొనేందుకు డిస్కంలు ముందుగానే ‘విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం’ (పీపీఏ) చేసుకుంటాయి. ఇలా పీపీఏ చేసుకున్న డిస్కంలకే జెన్‌కోలు పెరిగిన ధరల ప్రకారం కరెంటు అమ్ముతామని ముందుగా తెలపాలి. ఆ ధరలకు కొనడానికి డిస్కంలు ముందుకు రాకపోతే జెన్‌కోలు కరెంటును ‘భారత ఇంధన ఎక్స్ఛేంజి’ (ఐఈఎక్స్‌)లో ఏ రోజుకారోజు అమ్ముకోవచ్చని కేంద్రం సూచించింది. దేశవ్యాప్తంగా మొత్తం 13 కంపెనీలు విదేశీ బొగ్గుతో విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. వీటితోపాటు అన్ని రాష్ట్రాల విద్యుత్కేంద్రాలు తప్పనిసరిగా 10 శాతం విదేశీ బొగ్గును దిగుమతి చేసుకుని వాడాలని కేంద్రం ఆదేశించింది. దీనివల్ల రాష్ట్రాల విద్యుత్కేంద్రాల్లో ఉత్పత్తి వ్యయం భారీగా పెరగనుందని తెలంగాణ జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు ‘ఈనాడు’కు చెప్పారు.

యూనిట్‌కు రూ.3-5 అదనపు భారం..: అంతర్జాతీయ మార్కెట్లో విదేశీ బొగ్గు ధర ఏడాది కిందట టన్నుకు 50 నుంచి 70 డాలర్లుంటే ఇప్పుడు 140 డాలర్ల (రూ.10,781)కు చేరిందని కేంద్రం ఉత్తర్వుల్లో తెలిపింది. దేశీయ బొగ్గు ధర టన్ను రూ.4 వేలలోపే ఉంది. విదేశీ బొగ్గుతో విద్యుదుత్పత్తి చేయడం భారంగా మారినందున ఈ 13 కంపెనీలకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది. అదానీ గ్రూపునకు సంబంధించిన రెండు ప్లాంట్లు, ఏపీలోని సింహపురితో పాటు మరో 10 ప్లాంట్లు ఈ జాబితాలో ఉన్నాయి. వీటిలో ఉత్పత్తి చేసే కరెంటు ధర ఇప్పుడు యూనిట్‌కు రూ.3 నుంచి రూ. 5 దాకా అదనంగా పెరిగే సూచనలున్నాయి.

తెలుగు రాష్ట్రాలకు అశనిపాతమే..: కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వులతో తెలుగు రాష్ట్రాల డిస్కంలపై భారీగా ఆర్థికభారం పడనుంది. ఏపీ, తెలంగాణల్లోని విద్యుదుత్పత్తి కేంద్రాలకు రోజూ సగటున లక్షన్నర టన్నుల బొగ్గు అవసరం. ఇందులో పది శాతం అంటే 15 వేల టన్నులు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని కేంద్ర ఉత్తర్వుల సారాంశం. దేశీయ బొగ్గు ధరతో పోలిస్తే, విదేశీ బొగ్గుపై టన్నుకు రూ. 5 వేల చొప్పున అదనంగా చెల్లించాలి. 15 వేల టన్నులపై రోజుకు రూ. 7.50 కోట్లు.. ఏడాదికి రూ. 2700 కోట్ల మేర ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఈ భారం తొలుత డిస్కంలపైన, అక్కడి నుంచి ప్రజలపైన పడుతుంది. గత ఏడాది సింగరేణి బొగ్గు ధర కొద్దిగా పెంచితేనే ఏపీ, తెలంగాణ విద్యుత్కేంద్రాలపై రూ. 500 కోట్ల అదనపు భారం పడింది. ఇక విదేశీ బొగ్గు కొంటే వ్యయం ఆకాశాన్నంటుతుందని జెన్‌కోలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

విదేశీ బొగ్గుతో విద్యుదుత్పత్తి చేసే కంపెనీలు

* అదానీ పవర్‌ ముంద్రా లిమిటెడ్‌ (1, 2 దశలు)
* అదానీ పవర్‌ ముంద్రా లిమిటెడ్‌ (3వ దశ)
* కోస్టల్‌ గుజరాత్‌ పవర్‌
* ఎస్సార్‌ పవర్‌ గుజరాత్‌ లిమిటెడ్‌
* జేఎస్‌డబ్ల్యూ రత్నగిరి లిమిటెడ్‌
* టాటా ట్రాంబే లిమిటెడ్‌
* జీఎస్‌ఈసీఎల్‌ సిక్కా లిమిటెడ్‌
* ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ తమిళనాడు లిమిటెడ్‌
* కోస్టల్‌ ఎనర్జెన్‌ నీ ఉడుపి పవర్‌
* సింహపురి ఎనర్జీ నీ మీనాక్షీ ఎనర్జీ లిమిటెడ్‌
* జేఎస్‌డబ్ల్యూ తోర్నగల్లు-1, 2

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.