ETV Bharat / city

కరోనా నిర్ధరణ పరీక్షల పేరుతో 'ప్రైవేట్' దోపిడీ

author img

By

Published : Apr 19, 2021, 9:02 AM IST

కరోనా నిర్ధరణ పరీక్షల పేరుతో ఏపీలో దోపిడీ జరుగుతోంది. కృష్ణా జిల్లాలో కరోనా పరీక్షా కేంద్రాలు తక్కువగా ఉండటంతో ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్‌లకు వరంగా మారింది. ఏ అనారోగ్య సమస్య వచ్చినా.. ముందుగా కరోనా పరీక్ష చేయించుకుని రావాలంటూ ఆసుపత్రుల్లో వైద్యులు సూచిస్తున్నారు. అప్పటివరకు చికిత్స అందించేందుకు నిరాకరిస్తున్నారు. అత్యవసర వైద్య చికిత్సల కోసం కరోనా నిర్ధారణ పరీక్షలకు బాధితులు పరుగులు తీస్తున్నారు.

corona, corona updates, corona news
కరోనా, కరోనా అప్​డేట్స్, కరోనా న్యూస్

ఏపీలోని కృష్ణా జిల్లాలో జనవరి నుంచి కరోనా కేసులు తగ్గడంతో పరీక్షల కేంద్రాలను తగ్గించారు. విజయవాడ, మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అక్కడ ఇన్‌పేషెంట్లుగా ఉండేవారికే ఎక్కువ శాతం చేస్తున్నారు. మిగతా వైద్యారోగ్య కేంద్రాలన్నింటిలోనూ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నా.. కొవిడ్‌ టీకా నేపథ్యంలో ఆపేశారు. కరోనా నిర్ధారణ పరీక్షల కోసం ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్‌లపైనే ఆధారపడాల్సి వస్తోంది.

పాజిటివ్‌ వస్తేనే.. మెసేజ్‌..

తాజాగా కొద్దిరోజుల కిందటి నుంచి మళ్లీ విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియం సహా రెండు మూడు ప్రాంతాల్లో నిర్ధారణ పరీక్షలను ఆరంభించారు. పరీక్షల కోసం వందలాది మంది ఉదయం నుంచి నిరీక్షిస్తున్నారు. పరీక్షల ఫలితాలు రావడానికి నాలుగైదు రోజుల సమయం పడుతోంది. అదికూడా పాజిటివ్‌ వస్తేనే.. మెసేజ్‌ వస్తోంది. నెగెటివ్‌ వస్తే.. ఎలాంటి సమాచారం మొబైల్‌కు రావడం లేదు. కరోనా ఉందో.. లేదో త్వరగా తెలియాలంటే.. ప్రైవేటుపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.

సమయాన్ని బట్టి రుసుములు..

ప్రైవేటుగా పరీక్షలు చేసే కొన్ని ఆసుపత్రులు, ల్యాబ్‌ల వాళ్లు రిపోర్టు ఇచ్చే సమయాన్ని బట్టి రుసుములు నిర్ణయించారు. పరీక్ష చేసిన వెంటనే రెండు మూడు గంటల్లో రిపోర్టు ఇవ్వాలంటే రూ.2 వేలు, పరీక్ష చేసిన తర్వాత ఎనిమిది గంటల్లో ఇవ్వాలంటే రూ.1200, ఒక రోజు తర్వాత ఇచ్చినా పర్వాలేదంటే రూ.800 వసూలు చేస్తున్నారు. వీటిలో ర్యాపిడ్‌ యాంటీజెన్, ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలకు మళ్లీ వేర్వేరుగా ధరలు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి ఈ రెండు పరీక్షల్లోనూ నెగెటివ్‌ వచ్చినా.. కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తుండడంతో సీటీ స్కాన్‌ చేయించుకోవాల్సి వస్తోంది. సీటీ స్కాన్‌కు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇదికూడా ఎంత త్వరగా కావాలనే దానిపై ఆధారపడి ఉంటోంది.

పరీక్ష కేంద్రాలను పెంచాలి..

పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా సోమవారం నుంచి విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో కరోనా నిర్ధారణ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. బందరు రోడ్డులోని ఇందిరాగాంధీ స్టేడియం, తుమ్మళపల్లి కళాక్షేత్రంలో ఇప్పటికే పరీక్షలు కొనసాగుతున్నాయి. అదనంగా దండమూడి రాజగోపాల్‌ ఇండోర్, సింగ్‌నగర్‌లోని బసవపున్నయ్య స్టేడియంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో పరీక్ష కేంద్రాలను మరిన్ని పెంచి, త్వరితగతిన ఫలితాలను తెలియజేస్తే.. ప్రైవేటు దోపిడీకి అడ్డుకట్ట పడేందుకు అవకాశం ఉంటుందని బాధితులు కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.