ETV Bharat / city

FEVER SURVEY: కరోనా ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి జ్వర సర్వేకు సీఎం ఆదేశం

author img

By

Published : Jul 9, 2021, 7:23 PM IST

Updated : Jul 9, 2021, 10:45 PM IST

FEVER SURVEY: కరోనా ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి జ్వర సర్వేకు సీఎం ఆదేశం
FEVER SURVEY: కరోనా ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి జ్వర సర్వేకు సీఎం ఆదేశం

19:20 July 09

కరోనా ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి జ్వర సర్వేకు సీఎం ఆదేశం

రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నియంత్రణ, వైద్య, ఆరోగ్య పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కొవిడ్ వైరస్‌ వ్యాప్తి, ఆయా జిల్లాల్లో పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలను సీఎం సమీక్షించారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పారిశుద్ధ్యంలో గుణాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని... తద్వారా కరోనాను కూడా కట్టడి చేయగలిగామని అన్నారు. సరిహద్దు జిల్లాల్లో తీవ్రత ఉన్న నేపథ్యంలో... వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఆధ్వర్యంలో అధికారుల బృందం కరోనా ప్రభావిత జిల్లాల్లో పర్యటించాలని ఆదేశించారు. నాగార్జున సాగర్, మిర్యాలగూడ, నకిరేకల్, సూర్యాపేట, ఖమ్మం, డోర్నకల్, హుజూరాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, బెల్లంపల్లి, గోదావరిఖని, సిరిసిల్ల, వరంగల్ ప్రాంతాల్లో మూడు రోజుల పాటు హెలికాప్టర్ ద్వారా పర్యటించాలని... పరిస్థితులపై మంత్రివర్గానికి నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జిల్లాల్లో కరోనా విస్తరణకు ప్రధాన కారణాలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి విశ్లేషించాలన్న ఆయన... నియంత్రణ కోసం చేపట్టాల్సిన చర్యలు, ముందస్తు నివారణ కార్యక్రమాలను ప్రత్యేకంగా రూపొందించాలని చెప్పారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, డీపీవోలు, మున్సిపల్ కమిషనర్, డీఎంహెచ్​వోలు, ఆసుపత్రుల సూపరిండెంట్లు సహా స్థానిక అధికారులను సమావేశపరిచి అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు.  

నియంత్రణ చాలా సంక్లిష్టంగా మారింది..  

   ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తికి సరైన కారణాలను ఎవరూ గుర్తించలేకపోతున్నారన్న ఆయన...  కరోనా అనేది అంతుచిక్కని సమస్యగా పరిణమిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కట్టడి, ముందస్తు నియంత్రణకు నిర్దిష్ట చర్యలు చేపట్టేందుకు కూడా ప్రభుత్వాలకు సంపూర్ణ అవగాహన కరువైందని వ్యాఖ్యానించారు. ఏ వేరియంట్, ఏ వేవ్, ఎప్పడు, ఎందుకు వస్తుందో...  ఏ మేరకు విస్తరిస్తుందో తెలవడం లేదని కేసీఆర్ అన్నారు. కారణం తెలిస్తేనే నివారణకు మార్గం సుగమం అవుతుందని.. కరోనా రోగకారణం,  లక్షణం, దాని స్వరూపం, పర్యవసానాలు అర్థం కాని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. కరోనా నియంత్రణ చాలా సంక్లిష్టంగా మారిందన్న ముఖ్యమంత్రి... ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లోనే వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కరోనా నియంత్రణ కోసం కొత్త మార్గాలను అనుసరించాలని సూచించారు. కొత్త వేరియంట్, వేవ్​ల రూపంలో వస్తున్న దశలవారీ కరోనా నియంత్రణకు ఎప్పటికప్పుడు అప్​డేట్ అవుతూ ప్రజలను కొవిడ్​ బారి నుంచి రక్షించుకునే చర్యలను చేపట్టాలని సీఎం ఆదేశించారు.

మరోసారి జ్వర సర్వే

   కరోనా నియంత్రణలో అధికారులు, సిబ్బంది పనితీరు, ఔషధాలు లభ్యత, పడకలు, ఆక్సిజన్ అందుబాటు తదితర అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో నిర్వహించిన జ్వర సర్వే ద్వారా కరోనాను ముందస్తు కట్టడిచేయడంలో సఫలీకృతమైనట్లు ముఖ్యమంత్రి తెలిపారు. సత్ఫలితాలు రాబట్టి దేశానికే ఆదర్శంగా నిలిచిన జ్వర సర్వే కార్యక్రమాన్ని కరోనా ప్రభావిత ప్రాంతాల్లో మరోమారు చేపట్టాలని ఆదేశించారు. భవిష్యత్తులో కరోనా మరో వేవ్ వస్తుందంటున్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. దిల్లీ, మహారాష్ట్ర, బంగాల్​ సహా ఇతర రాష్ట్రాల్లో కరోనా స్థితిగతులు, నియంత్రణ చర్యలను అధ్యయనం చేయాలని చెప్పారు. కరోనా నియంత్రణ కోసం చేయాల్సిన పనులు గుర్తించి సఫలీకృతం కావాలని అధికారులకు సీఎం సూచించారు.  

వరంగల్​ను హెల్త్​సిటీగా తీర్చిదిద్దాలి..  

  కరోనా కట్టడి కోసం ప్రభుత్వంతో ప్రజలు కలిసి రావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, స్వీయనియంత్రణ పాటిస్తూ కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. వరంగల్ పట్టణాన్ని హెల్త్ సిటీగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడం ద్వారా తూర్పు తెలంగాణ మొత్తం వైద్యసేవల కోసం వరంగల్​కు వెళ్లేలా ఉండాలని చెప్పారు. అన్ని విభాగాలతో కూడిన సమీకృత భవన సముదాయంగా నూతన ఆసుపత్రి నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి తెలిపారు. 

ఇదీ చదవండి: kcr: 50 వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని సీఎం కేసీఆర్​ ఆదేశం

Last Updated :Jul 9, 2021, 10:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.