కేసీఆర్‌ జాతీయ పార్టీకి కుదిరిన ముహూర్తం.. ఆ పేరు వైపు మొగ్గు

author img

By

Published : Oct 2, 2022, 7:13 PM IST

Updated : Oct 2, 2022, 7:33 PM IST

CM Kcr

CM Kcr Clarity on National Party: జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మార్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దసరా రోజున మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాలకు తెరాస విస్తృత స్థాయి భేటీలో పార్టీ పేరు మారుస్తూ తీర్మానం చేయనున్నారు. పార్టీ పేరును మాత్రమే మార్చడం వల్ల.. కారు గుర్తు యథాతథంగా కొనసాగుతుందని నాయకులకు కేసీఆర్ వివరించారు. దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ పాలన అందించేందుకు జాతీయ రాజకీయాల్లోకి రావాలని వివిధ వర్గాలు కోరుతున్నాయని కేసీఆర్ వివరించారు. డిసెంబరు 9న దిల్లీలో బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు.

కేసీఆర్‌ జాతీయ పార్టీకి కుదిరిన ముహూర్తం.. ఆ పేరు వైపు మొగ్గు

CM Kcr Clarity on National Party: జాతీయ రాజకీయాలపై తెరాస కీలక నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టతనిచ్చారు. తెరాస పేరు మార్చి జాతీయ పార్టీగా రూపాంతరం చేస్తూ దసరా రోజున మధ్యాహ్నం ఒంటి గంట 10 నిమిషాలకు పార్టీ విస్తృతస్థాయి కార్యవర్గం తీర్మానం చేయనుంది. జాతీయ పార్టీ ఏర్పాటుపై మంత్రులు, తెరాస జిల్లా అధ్యక్షులతో కేసీఆర్ ప్రగతిభవన్‌లో చర్చించారు. స్వతంత్ర భారతదేశంలో భాజపా, కాంగ్రెస్ రెండూ పాలనలో విఫలమయ్యాయని కేసీఆర్ చెప్పారు. పుష్కలమైన సహజ, మానవ వనరులు ఉన్నప్పటికీ దేశాన్ని ఆశించినంత అభివృద్ధి చేయలేక పోయాయన్నారు.

తెలంగాణ మోడల్‌ను విస్తరించేందుకు.. కొత్త రాష్ట్రమైనప్పటికీ.. తెలంగాణను అన్ని రంగాల్లో శరవేంగా ముందుకు తీసుకెళ్లి దేశాన్ని ఆకర్షించగలిగినట్లు కేసీఆర్ వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల దేశమంతా ఆకర్షితులవుతున్నారని తెలిపారు. తెలంగాణ మోడల్‌ను దేశమంతటికీ విస్తరించేందుకు జాతీయ రాజకీయాల్లోకి రావాలన్న వివిధ వర్గాలు కోరుకుంటున్నాయని తెలిపారు. కాబట్టి పార్టీ శ్రేణులు అంగీకరిస్తే తెరాసను దేశవ్యాప్తంగా విస్తరించాల్సిన అసరముందని కేసీఆర్ చెప్పడంతో.. మంత్రులు, జిల్లా అధ్యక్షులు ముక్తకంఠంతో ఆమోదించారు.

భారత రాష్ట్ర సమితి పేరుకే మొగ్గు.. జాతీయ పార్టీ ఏర్పాటుపై నేతలకు కేసీఆర్ స్పష్టతనిచ్చారు. వివిధ అంశాలపై లోతైన అధ్యయనం చేశాక ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మార్చనున్నట్లు కేసీఆర్ వివరించారు. పార్టీ పేరుపై అభిప్రాయాలు కోరగా... భారత రాష్ట్ర సమితి.. నయా భారత్ సమితి వంటి పేర్లను నాయకులు సూచించారు. కొత్తగా పార్టీ ఏర్పాటు చేస్తే కారు గుర్తు కొనసాగకపోవచ్చు కాబట్టి.. ఉన్న పార్టీ పేరునే మారిస్తే సాంకేతికంగా ఇబ్బంది ఉండదని కేసీఆర్ వివరించారు. కేసీఆర్ సహా ఎక్కువ మంది నేతలు భారత రాష్ట్ర సమితి పేరుకే మొగ్గు చూపారు.

డిసెంబరు 9న దిల్లీలో బహిరంగ సభ.. ఈనెల 5న ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గం సహా కీలక ప్రతినిధులు సమావేశం కానున్నారు. తెరాస పేరు మారుస్తూ తీర్మానంపై సంతకాలు చేశాక.. మధ్యాహ్నం ఒంటి గంట 10 నిమిషాలకు కేసీఆర్ ఆమోద ముద్ర వేయనున్నారు. ఆరోజు వివిధ రాష్ట్రాల నుంచి పలువురు నేతలు, ప్రతినిధులను ఆహ్వానించాలని నిర్ణయించారు. 6న తెరాస పేరు మార్పుపై ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్ సమర్పించనున్నారు. పార్టీ పేరు మార్పును ఈసీ ఆమోదించిన తర్వాత పూర్తి స్థాయి జెండా, అజెండా ప్రకటించనున్నారు. డిసెంబరు 9న దిల్లీలో బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. తెరాస జాతీయ పార్టీగా ఎందుకు మారాల్సి వచ్చిందనే పూర్తి విషయాలను కేసీఆర్ దిల్లీ సభలో వెల్లడించనున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Oct 2, 2022, 7:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.