ETV Bharat / city

AP CM JAGAN : 'గ్రామం యూనిట్​గా టీకా పంపిణీ జరగాలి'

author img

By

Published : Aug 12, 2021, 7:07 AM IST

ఏపీ  ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి

ఏపీలో 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసు వారికి వ్యాక్సిన్‌ పంపిణీ చేసేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామం యూనిట్‌గా టీకాల పంపిణీ జరగాలని.. ఉపాధ్యాయులతో పాటు పాఠశాలల్లో పనిచేసే సిబ్బందికి టీకాల పంపిణీలో ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు.

ఏపీలో 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసు వారికి వ్యాక్సిన్‌ పంపిణీ చేసేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏపీలో టీకాల పంపిణీ, వ్యాక్సిన్‌ పొందిన వారిపై వైరస్‌ ప్రభావం ఎలా ఉంది? పొరుగు రాష్ట్రాల్లోని పరిస్థితులెలా ఉన్నాయన్న దానిపైనా అధ్యయనం చేయాలని సూచించారు. గ్రామం యూనిట్‌గా టీకాల పంపిణీ జరగాలని సూచించారు. ఉపాధ్యాయులతో పాటు పాఠశాలల్లో పనిచేసే సిబ్బందికి టీకాల పంపిణీలో ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. కొవిడ్‌ నియంత్రణ, చర్యల పురోగతిపై బుధవారం వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సీఎం సమీక్ష జరిపారు.

‘ఆరోగ్యశ్రీ కార్డులో కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలను తేదీ, సమయంతో సహా నమోదు చేయాలి. వీటిని ‘క్యూఆర్‌ కోడ్‌’ రూపంలో తెలుసుకునేలా ఉండాలి. 104 వైద్య సిబ్బంది గ్రామాలకు వెళ్లే సరికి స్థానికుల ఆరోగ్య వివరాలు (రక్తపోటు, షుగర్‌, రక్తం గ్రూపు) సులువుగా తెలుసుకునేలా ఈ విధానం ఉండాలి. ఆరోగ్యశ్రీ కార్డు, ఆధార్‌ కార్డు నంబరు చెప్పగానే ఆరోగ్య వివరాలు వెంటనే లభ్యమయ్యేలా చర్యలు తీసుకోవాలి. వీటి అమలులో గ్రామ ఆరోగ్య కేంద్రాలు కీలకపాత్ర పోషించాలి’

- జగన్​మోహన్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి

ఏపీలో వైరస్‌ కేసులు తగ్గుతున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఆ రాష్ట్ర సీఎంకు వివరించారు. 10 జిల్లాల్లో 3% కంటే తక్కువ, 2 జిల్లాల్లో 3-5%, 5% కంటే ఎక్కువ పాజిటివిటీ రేట్‌ ఒక జిల్లాలోనే ఉందని చెప్పారు. ఇప్పటివరకు 16 సార్లు ఇంటింటి సర్వే నిర్వహించామన్నారు. మూడో వేవ్‌ సంకేతాలకు తగ్గట్లు మందులు, ఆక్సిజన్‌ను ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచుతున్నామని వెల్లడించారు.

ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని (వైద్యం) ఇతర అధికారులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.